ల్యాండ్ మార్క్ అడిగితే...: - తమిళంలో మనుష్యపుత్రన్-తెలుగులో యామిజాల జగదీశ్
 

స్నేహితుడికి ఇంటి దారి అడగడానికి ఫోన్ చేశాను
అతని చిన్న కూతురు ఫోన్ తీసింది
చిరునామా కాస్త గందరగోళంగా ఉండటంతో
గుర్తులేవైనా (ల్యాండ్‌మార్క్) చెప్పమన్నాను
"అంకుల్!
మా ఇంటికి ఎదురుగా
ఉండే ఇంట్లో
ఒక కుక్కపిల్ల ఉంటుంది
అది ఎప్పుడూ
గేటు గుండా వీధినే
చూస్తూ ఉంటుంది
ఆ తర్వాత మూడు ఇళ్లు దాటితే
ఒక చెట్టు ఉంటుంది
దానికి ఇప్పుడు బోలెడు
ఎర్రటి పూలు పూశాయి
మా ఇంటి కాంపౌండ్ గోడ మీద
ఒక పిల్లి పిల్ల
నిద్రపోతూ ఉంటుంది
ఇంటి గుమ్మం ముందర
మా నాన్నగారి స్కూటర్ ఉంటుంది
స్కూటర్ నంబర్ చెప్పనా అంకుల్?"
పిల్లలకు
తెలిసిన దారులు ఏవీ
గూగుల్ మ్యాప్ లకు తెలియవు
ఒక చిన్నారి చూపించే దారిలో వెళ్తే
ఒక్క ఇల్లే కాదు
వెయ్యి ఇళ్లకు వెళ్లే
దారి మనకు తెలిసిపోతుంది
----------------------


-----------------------
కామెంట్‌లు