"కూపర్స్ లా": - - యామిజాల జగదీశ్.


 అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక విచిత్రమైన, దారుణమైన సంఘటన జరిగింది. 'కూపర్' అంటే ఒక కుక్క వీల్ చైర్ ర్యాంప్ కింద దాక్కుని కనిపించింది. దాని నోటికి ప్లాస్టర్ (డక్ట్ టేప్) గట్టిగా చుట్టి ఉంది. దాంతో అది ఊపిరి ఆడక విలవిలలాడిపోయింది.
ఆ దారిలో వెళ్తున్న ఒక మహిళ, ఆమె కొడుకు ఆ ప్లాస్టర్‌ను కట్ చేసి కుక్కను కాపాడారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విచారణ జరిపారు. క్రితం రోజే ఆ కుక్క యజమాని దాని నోటికి ప్లాస్టర్ వేసినట్లు ఒప్పుకుంది.
పశువైద్యులు ఆ కుక్కను పరీక్షించారు. ప్లాస్టర్ వేయడం వల్ల దానికి గాయాలు అయ్యాయని చెప్పారు. సరిగా ఆహారం అందక నీరసించిపోయిందని చెప్పారు. అలాగే దానిని చాలా కాలంగా కట్టేసి ఉంచినట్లు ఆధారాలు లభించాయి.
పోలీసులు మరింత విచారణ చేశారు. ఆ మహిళ ఉంటున్న ఒక వాహనంలో ఇంకా చాలా జంతువులు ఉన్నాయి. అందులో 7 పిల్లలు, 3 చేపలు, కొన్ని పక్షులు, ఒక బాతు ఉన్నాయి. అవన్నీ చాలా మురికిగా, భయంకరమైన వాతావరణంలో ఉన్నాయి.
ప్రస్తుతం ఆ మహిళపై జంతువులను వేధించిన, నిర్లక్ష్యంగా వదిలేసినందుకు కేసులు నమోదు చేశారు. కూపర్, మిగిలిన జంతువులు చికిత్స పొందుతున్నాయి. అవి నెమ్మదిగా కోలుకుంటున్నాయి.
ఈ ఘటన తర్వాత జంతు ప్రేమికులు ఒక కొత్త డిమాండ్ చేస్తున్నారు. "కూపర్స్ లా" పేరుతో ఒక కొత్త చట్టం తీసుకురావాలని కోరుతున్నారు.
ఈ చట్టం అమలులోకి వస్తే చాలా మార్పులు వస్తాయి. జంతువుల నోరు, దవడ లేదా ఊపిరి పీల్చే భాగాలను టేప్, వైరు, తాడుతో కట్టేయడం పెద్ద నేరం అవుతుంది. ఈ నేరంలో శిక్ష పడినవారు ఇకపై ఏ జంతువునూ పెంచుకోకూడదు. జంతువులతో కలిసి నివసించడంపై కూడా శాశ్వతంగా నిషేధం ఉంటుంది.
నోరు నొక్కేయడం అంటే వాటిని అదుపు చేయడం కాదు. అది వాటి ప్రాణాలకే ప్రమాదం కలిగించే దారుణమైన పని. కూపర్ అదృష్టం బతికి బయటపడింది. కానీ అన్ని జంతువులకూ అంత అదృష్టం ఉండదుగా.
కామెంట్‌లు
Popular posts