ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి ఆప్తమిత్రుడు. ప్రియ శిష్యుడు. అంతేకాదు, గొప్ప జ్ఞాని, విద్యావంతుడు. దీనివల్ల తన జ్ఞానంపై ఆయనకు కొద్దిగా అహంకారం ఉండేది.
ఆయనలోని ఈ సూక్ష్మ అహంకారాన్ని తొలగించి, తనపై ఉండే నిజమైన భక్తి స్వరూపాన్ని తెలియజేయడానికి శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన లీలను చేశాడు.
మథురలో ఉన్నప్పుడు, శ్రీకృష్ణుడు ఉద్ధవుడిని బృందావనానికి పంపాడు.
"ఉద్ధవా! నువ్వు బృందావనానికి భూమికి వెళ్ళు. నందరాజు, యశోదమ్మ, గోపికలకు నా సందేశాన్ని అందించు. నేను అంతటా నిండి ఉన్నానని వివరించు. నాపై ధ్యానం చేస్తూ, విరహ వేదనను వదిలిపెట్టమని చెప్పు" అని పంపించాడు.
పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉద్ధవుడు బృందావనం చేరుకున్నాడు. మొదట ఆయన నందరాజును, యశోదమ్మను కలిశాడు. వారు శ్రీకృష్ణుడి వియోగంతో రాత్రింబవళ్లు కన్నీరు కారుస్తున్నారు. ఉద్ధవుడు వారికి జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని బోధించాడు. అయినా, ఆ తల్లిదండ్రుల ప్రేమ ముందు ఏ తార్కిక జ్ఞానమూ పని చేయలేదు. వారు తమ ముద్దుల కృష్ణుడు గురించే నిరంతరం మాట్లాడుకుంటూ ఉండిపోయారు.
ఆ తర్వాత, ఉద్ధవుడు గోపికల దగ్గరకు వెళ్లాడు. ఆత్మ అమరమైన దని, దేవుడు అంతటా ఉంటాడని చెప్పాడు. బాధను వదిలేయమంటూ శ్రీకృష్ణుడి సందేశాన్ని వారికి వినిపించాడు.
గోపికలు చిరునవ్వుతో ఇలా అన్నారు, "ఉద్ధవా, మాకు క్లిష్టమైన జ్ఞాన విషయాలు ఏమీ తెలియవు. శ్రీకృష్ణుడే మా ప్రాణాధారం అని మాకు తెలుసు. దేవుడిని ధ్యానించడానికి మనసు కావాలి కదా! ఆ మనసును మేము ఎప్పుడో శ్రీకృష్ణుడికి ఇచ్చేశాము. ఇక మేము ఏ మనసుతో ధ్యానించాలి?" అని ప్రశ్నించారు.
సరిగ్గా అదే సమయంలో, ఒక పెద్ద భ్రమరం వారి చుట్టూ తిరగడం ప్రారంభించింది. దాన్ని శ్రీకృష్ణుడు పంపిన దూతగా గోపికలు భావించారు. తమ విరహ వేదననంతా ఆ తుమ్మెద ముందు కుమ్మరించారు. ఈ ఘట్టమే 'భ్రమర గీతం'గా ప్రసిద్ధి చెందింది.
గోపికల స్వార్థం లేని, పవిత్రమైన, పరిపూర్ణమైన భక్తిని చూసి ఉద్ధవుడి జ్ఞాన గర్వం కరిగిపోయింది. నిజమైన భక్తి కేవలం శాస్త్ర జ్ఞానంతో రాదని, నిరుపాధికమైన ప్రేమ, శరణాగతి వల్లనే సాధ్యమవుతుందని ఆయన గ్రహించాడు.
ఉద్ధవుడు మనసులో ఇలా ప్రార్థించాడు:
"వచ్చే జన్మలో నేను బృందావనంలో ఒక గడ్డి పోచగానో, లతగానో, పొదగానో పుట్టాలి. అప్పుడే ఈ మహోన్నత గోపికల పాదధూళి నాపై పడుతుంది."
మథురకు తిరిగి వచ్చిన తర్వాత ఉద్ధవుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, "స్వామీ! జ్ఞానం కంటే మీపై ఉండే ప్రేమ, భక్తి గొప్పవని ఈరోజు నేను తెలుసుకున్నాను. ఈ ప్రపంచంలో బృందావనంలోని గోపికలే అత్యుత్తమ భక్తులు."
కాబట్టి, ఉద్ధవుడి కథ మనకు చెబుతున్నదిదే... అహంకారంతో కూడిన జ్ఞానం కంటే, భగవంతుడిపై ఉంచే షరతులు లేని ప్రేమ, సమర్పణ భావం, చెదరని భక్తి మాత్రమే ఎంతో మిన్న అయినది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి