ఒకరోజు ఒక భక్తుడు ఎంతో భక్తితో, తను నిత్యమూ ప్రార్థించే భగవంతుడితో ఒక్కరోజు మాట్లాడే అవకాశం లభించింది.
భక్తుడు : భగవంతుడా, నేను మిమ్మల్ని ఒక వివరణ అడగవచ్చా?
దేవుడు : ధారాళంగా అడుగు.
భక్తుడు : కోప్పడకుండా ఓపికగా సమాధానం చెప్తారా?
దేవుడు : ఖచ్చితంగా!
భగవంతుడు : ఈరోజు నాకు ఎందుకు ఇంతటి దారుణమైన రోజును ఇచ్చారు?
దేవుడు : ఏంటీ అలా అంటున్నావు?
భక్తుడు : ఎప్పుడూ టైంకి నిద్ర లేచే నేను, ఈరోజు లేవడమే చాలా ఆలస్యమైంది.
దేవుడు : అవును! కంగారులో నన్ను కూడా మొక్కుకోకుండా ఆఫీస్‌కి బయలుదేరావు.
భక్తుడు : బయలుదేరడమే లేట్, ఇందులో నా బైక్ కూడా పంచర్ అయింది.
దేవుడు : అవును, నాకు తెలుసు.
భక్తుడు : సరే! బస్సు ఎక్కితే, దారిలో ఏదో బస్సు యాక్సిడెంట్ జరిగి ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీస్‌కి గంట లేట్ అయింది.
దేవుడు : అవును! తెలుసు.
భక్తుడు : మధ్యాహ్నం భోజనం చేయడం కొంచెం లేట్ అయింది, అంత క్యాంటీన్‌లో తిండి అయిపోయింది. చివరికి ఆకలికి ఏదో దొరికింది అరకొరగా తిని వచ్చాను.
దేవుడు : అవును, అది నాకు తెలుసు.
భక్తుడు : బ్యాంకులో పర్సనల్ లోన్ కోసం అప్లై చేశాను. ఆ విషయంగా ఒకరి నుండి ఫోన్ వస్తుందని అనుకున్నాను. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆయన నుండి నాకు కాల్ వచ్చింది. కానీ బ్యాటరీ ఛార్జింగ్ లేకపోవడంతో ఆ సమయానికే మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది.
దేవుడు : అవును తెలుసు.
భక్తుడు : అలా కిందా మీదా పడి, కష్టపడి ఇంటికి వచ్చి, కొద్దిసేపు రూమ్‌లో ఏసీలో కూర్చొని టీవీ చూస్తూ రిలాక్స్ అవుదామంటే ఏసీ రిపేర్ అయి పని చేయలేదు.
ఈరోజు నాకు ఏది సరిగ్గా జరగలేదు. ఒక్క రోజు మిమ్మల్ని మొక్కుకోవడం మర్చిపోతే ఇన్ని కష్టాలా?
(దేవుడు గట్టిగా నవ్వుతాడు. కొన్ని సెకన్ల తర్వాత! మాట్లాడటం ప్రారంభిస్తాడు)
దేవుడు : ఈరోజు నీ కర్మ ప్రకారం చాలా దారుణమైన రోజు. నువ్వు ఉదయం గాఢనిద్రలో ఉన్నప్పుడే యమధర్మరాజు (మరణదేవుడు) నీ వైపు వచ్చాడు. ఆయనతో వాదించి నిన్ను కాపాడటం కోసమే నిన్ను కొంచెం ఎక్కువ సమయం నిద్రపోయేలా చేశాను.
భక్తుడు : (ఆశ్చర్యంతో) ఓహ్!
దేవుడు : నీ బైక్‌ని పంచర్ చేశాను. ఎందుకంటే! నువ్వు ఆఫీస్‌కి వెళ్లే దారిలో బ్రేకులు ఫెయిల్ అయి అడ్డదిడ్డంగా దూసుకొస్తున్న ఒక వ్యాన్ నీపైకి దూసుకురావాల్సి ఉంది. ఆ వ్యాన్ యాక్సిడెంట్ అవ్వడం వల్లే అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. నువ్వు బైక్ మీద వెళ్లి ఉంటే, మరణదేవుడి లెక్క ప్రకారం ఆ వ్యాన్ నీకే డాష్ ఇచ్చి ఉండేది.
భక్తుడు : (వినయంగా) ఓహ్!
దేవుడు : మధ్యాహ్నం నీకు భోజనం దొరకకపోవడానికి కారణం... చివర్లో మిగిలిన కూరలో ఎలుకల కోసం పెట్టిన ఎలుకల మందు ఎలాగోలా పొరపాటున పడిపోయింది! దాన్ని ఎవరూ గమనించలేదు. ఒకవేళ నువ్వు దాన్ని తిని ఉంటే ఏమయ్యేది?
భక్తుడు : (కళ్లలో నీళ్లతో) మ్..
దేవుడు : సాయంత్రం నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడానికి కారణం! ఆ వ్యక్తి నీకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి నిన్ను పెద్ద సమస్యల్లో ఇరికించబోయాడు. అందుకే దాని నుండి నిన్ను కాపాడటానికి నీ ఫోన్ పని చేయకుండా చేశాను.
భక్తుడు : మ్మ్..
దేవుడు : ఇకపోతే ఆ ఏసీ మెషిన్... అందులో ఎర్త్ ప్రాబ్లం వచ్చి కరెంట్ లీక్ అవుతోంది. ఒకవేళ నువ్వు ముఖం కడుక్కుని, తడి చేతులతో ఎప్పటిలాగే స్విచ్ ముట్టుకుని ఉంటే ఆ క్షణమే షాక్ కొట్టి పడిపోయేవాడివి. అందుకే దాన్ని పని చేయకుండా చేశాను.
నన్ను ప్రార్థించడం మర్చిపోవడం వల్లే రోజంతా నీకు కష్టాలు వచ్చాయని నన్ను తప్పుగా అనుకున్నావు. కానీ నువ్వు ప్రతిరోజూ నన్ను నమ్ముకుని ప్రార్థిస్తూ రావడం వల్లే... నువ్వు నన్ను మర్చిపోయిన రోజున కూడా నేను నిన్ను కాపాడటం మర్చిపోలేదు.
భక్తుడు : ఇప్పుడు అర్థమైంది దేవుడా! నాపై మీకు ఉన్న ప్రేమాభిమానాలు. ఇది తెలియక మిమ్మల్ని ఎంతో నిందించాను. నన్ను క్షమించండి.
దేవుడు : క్షమాపణలు అడగొద్దు! నన్ను నమ్ము, ఎల్లప్పుడూ, ఎలాంటి పరిస్థితిలోనైనా. అది చాలు!
భక్తుడు : ఖచ్చితంగా!
దేవుడు : నువ్వు ప్లాన్ చేసుకునే దానికంటే, నీ కోసం నేను ప్లాన్ చేసేది ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది.
భక్తుడు : ఇకపై మిమ్మల్ని ఎప్పుడూ అనుమానించను. మీ కరుణను అనుమానించను. కంటికి రెప్పలా ప్రతి క్షణం మీరు నన్ను కాపాడుతున్నారని గ్రహించాను.
దేవుడు : నన్ను నమ్ముకున్నవారిని నేను ఎన్నటికీ వదిలిపెట్టను!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి