వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
128. సాధ్వీ (ద్వ్యక్షరీ)
129. శరచ్చంద్రనిభాననా (అష్టాక్షరీ)
నూట ఇరవైతొమ్మిదవ నామ మంత్రము:
ఓం శరచ్చంద్రనిభాననాయై నమః
శరత్ = శరత్ / వసంత కాలములో కనిపించే; చన్ద్ర = చన్ద్రుని; నిభ = కాంతితో; ఆననా = ముఖము కలదానా.
వంసంత ఋతువు లో, పౌర్ణిమ నాడు చల్లని కాంతిని వెదజల్లే చంద్రుని వంటి ముఖము తో, కాంతులీనుతూ దర్శనమిచ్చిన పరమేశ్వరిని చూచిన వశిన్యాది వాగ్దేవతలు, శ్రీలలితా పరాభట్టారికను "శరచ్చంద్రనిభాననా" అని కీర్తించారు. తన చల్లని కరుణతో కూడిన చూపులతో మనలను ఎల్లవేళలా కాపాడే పరమేశ్వరికి నమస్కారము.
మన భారత వర్షంలో, సంవత్సరం లో వున్న ఆరు ఋతువులలో, శరత్ ఋతువు / వసంత ఋతువు కు చాలా ప్రత్యేకత ఉంది. ఈ శరత్ ఋతువు లో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పక్షుల కిలకిలారవాలు, పలకరింపులు. వినిపిస్తూ ఉంటాయి. నదీనదాలు జలకళను సంతరించుకుంటాయి. చంద్రుడు తన చల్లని కిరణాలను నేల నలుచెరగులా ప్రసరింప చేస్తూ, చూచే కళ్ళకు, మనసుకు ఎంతో ఆనందాన్ని పంచుతాడు. నల్లకలువలు చక్కగా వికసించి నేత్రానందం కలుగచేస్తాయి.
శరన్నవరాత్రులలో, "పూర్ణచంద్రనిభాననా" గా చెప్పబడే అమ్మ ముఖము కూడా, విల్లు వంటి కనుబొమలు కలిగి, కలువలవంటి కన్నులతో, చల్లని చంద్ర కిరణాలవంటి తన కంటి చూపులతో, మనందరికి కరుణను పంచుతూ ఉన్న పరమేశ్వరి ముఖారవిందం "శరచ్చంద్రనిభాననా" అని చెప్పబడింది.
పరమగువు యొక్క కృపా కటాక్ష వీక్షణాల భాగ్యంతో, పరమేశ్వరియే, "శరచ్చంద్రనిభాననా" గా తెలుసుకుని,
తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం శరచ్చంద్రనిభాననాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి