వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
129. శరచ్చంద్రనిభాననా (అష్టాక్షరీ)
130. శాతోదరీ (చతురాక్షరీ)
నూట ముప్పైయవ నామ మంత్రము:
ఓం శాతోదర్యై నమః
శాత = కృశించిన / సూక్ష్మమైన; ఉదరీ = పొట్టకలది; శాతోదర = అనేక గుహలు కల హిమవంతుడు.
శతోదరుడు = నూరు గుహలు కలవాడు అయిన హిమవంతుని కి కూతురుగా పుట్టి, సూక్ష్మమైన నడుము, పొట్ట కలిగి సర్వాంగ సుందరంగా దర్శనం ఇస్తున్న జగన్మాతను చూసిన వశిన్యాది వాగ్దేవతలు "శాతోదరీ" అని కీర్తించారు. శతోదరుడూ, హిమవంతుని కుమార్తె అయిన "శాతోదరీ" కి నమస్కారము.
దక్షుని కుమార్తె దాక్షాయణి / సతీదేవి, శివునికి ఇల్లాలు అయ్యింది. దక్షయజ్ఞం సమయంలో తన భర్త శంకరునికి, తనకూ జరిగిన అవమానానికి క్రుద్ధురాలై యోగాగ్నిలో తనువు చాలించింది. తిరిగి మేనకా, హిమవంతులకు కూతురు గా జన్మించింది. హిమవంతుడు, పర్వత రాజు కనుక, ఆతని కుమార్తె, "పార్వతి" అయ్యింది. హిమవంతుని మరోపేరు, "శాతోదరుడు". అంటే, శతము / నూరు లేదా లెక్కలేనన్ని గుహలు కలవాడు, శాతోదరుడైన హిమవంతుడు. ఈ శాతోదరుని కుమార్తె "శాతోదరీ".
అమ్మ నామాలలో 36వ నామమంత్రము, "లక్ష్యరోమ లతాధారతా సమున్నేయ మధ్యమా" అని. ఎంతో ప్రయత్న పూర్వకంగా చూస్తే కానీ కనిపించనంత, సన్నని తీగలాంటి నడుము కలిగిన శ్రీమహారాజ్ఞి, అని కూడా ఈ నామం చెపుతోంది. ఇంత సన్నని, సూక్ష్మమైన నడుము ఆధారంగానే చరాచర జగత్తు నిలబడి ఉంది అనేది, ఈ నామములో దాగి ఉన్న నిగూఢమైన అర్థం.
సన్నని నడుము, పొట్టతో ఉన్న నేనే, ఈ జగత్తు మొత్తానికి ఆధారంగా ఉన్నాను అని తెలుసుకుని, తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం శాతోదర్యై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి