శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ :- 157


 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
135. నిర్మలా (త్ర్యక్షరీ)
136. నిత్యా (ద్వాక్షరీ)
నూట ముప్పైఆరవ నామ మంత్రము:
ఓం నిత్యాయై నమః
నిత్యా = మూడు కాలములందు, సర్వకాల సర్వావస్థలలో ఉండేది
ఈ సృష్టిలో ప్రతీ కణములో, ప్రతీ క్షణములో, ప్రతీ జీవిలో నేనే ఉన్నాను అని దర్శనం ఇస్తున్న జగన్మాతను చూసిన వశిన్యాది వాగ్దేవతలు అమ్మను "నిత్యా" అని కీర్తించారు. మనమందరం లో ఉన్న మనందరిలోనూ జీవాత్మగా నిత్య సత్యగా కనిపిస్తున్న పరమేశ్వరికి నమస్కారము.
ఈ చరాచర జగత్తులో ఉన్న ప్రతీ వస్తువు, జీవి శ్రీమాత అనుగ్రహం తో వచ్చినవే, అయినా కూడా దీపపు పురుగుల లాగా క్షణభంగురాలే కానీ, శాశ్వతమైనవి కావు. ఎందుకంటే, అవి పాంచభౌతికమైనవి కనుక. గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం అనే పంచభూతాల ద్వారా ఏర్పడిన ఏ వస్తువు, జీవి అయిన జనన మరణ చక్రబంధం లో తిరుగాడేవే. కనుకనే ఇవి నశ్వరమైనవి. కానీ, వీటన్నిటి లో ఉన్న మూలం అయిన ఆత్మశక్తి, శాశ్వతమైనది. చిరంతరంగా, నిరంతరంగా నిలిచి ఉండేది. ఈ ఆత్మశక్తే "లలితా పరాభట్టారిక" కదా. అందువల్లనే కాత్యాయని "నిత్యా" అయ్యింది.
జననము, బాల్యము, కౌమారము, యౌవనము, ముసలితనము వంటి లక్షణాలు లేవు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలో ఉంటుంది. జాగ్రత్ / మెలుకవగా ఉన్నప్పుడు, నిద్రావస్థలో కూడా ఉంది. అసలు "నాశనము" లేనిది అయి, జీవశక్తి లాగా నిత్యమూ, నిరంతరమూ ప్రవహించే, సూర్య, చంద్ర కాంతుల లాగా ఉంటుంది. కనుకనే, "నిత్యా".
సంవత్సరం లోని 12 నెలలో, ఆరు ఋతువులలో, శుక్ల కృష్ణ పక్షాలలో నిన్న, నేడు, రేపు చరాచర జగత్తును నడిపిస్తున్న శ్రీమతను "నిత్యా" అని తెలుసుకుని, తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు   ఓం నిత్యాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు