వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
137. నిరాకారా (చతురక్షరీ)
138. నిరాకులా (చతురక్క్షరీ)
నూట ముప్పైఎనిమిదవ నామ మంత్రము:
ఓం నిరాకులాయై నమః
నిరాకులా = ఏ కలవరపాటు , వికారమూ లేనిది.
శ్రీవిద్యయే పరమేశ్వరి. పరాత్పరియే శ్రీవిద్య అయినప్పటికీ, ఏ విద్య కూడా అంటకుండా దర్శనం ఇచ్చిన శ్రీమాతను చూసిన వశిన్యాది వాగ్దేవతలు అమ్మను "నిరాకులా" అని కీర్తించారు. అన్నింటా తానే ఉండి, అన్నీ తానే అయి కూడా, ఏది తనను అంటకుండా చరాచర జగత్తును కాపాడుతున్న కాత్యాయనీ పరదేవతకు నమస్కారము.
ఈ తల్లి, కలత చెందిన, చపల చిత్తముతో ఉండేవారికి దూరంగా ఉంటుంది. ఆకులా, అంటే కలత చెందడం. మనసులో ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి కలిగియుండి, ఏకాగ్రత లేకపోవడం. అజ్ఞానముతో కూడిన ఈ విషయాలు అంటనిది, కాబట్టి పార్వతి "నిరాకులా" అయ్యింది.
జీవుడి మనసు కోతి లాంటిది. దినికి అజ్ఞానం తోడవడంతో చపలత్వమూ, చంచలత్వమూ కూడా అబ్బాయి. ఇంక ఈ మనసును ఆపగల శక్తి ఈ చరాచర జగత్తులో లేదు. నేను, నాది అనే ఆపేక్షల సుడిగుండాలలో కొట్టుకుపోతూ ఉంటుంది. ఈ అవలక్షణాలు అన్నీ మానవులకు మాత్రమే. సుఖదుఃఖాలు, కలతలూ, కన్నీళ్ళు కూడా చాలా సహజంగా ఏర్పడే విషయాలు. పరమాత్మ లేదా పరాత్పరికి ఈ విపరీతాలు ఏవీ ఉండవు. ఆ తల్లి "నిరాకారా" కదా. ఒక నిర్ధిష్ట రూపమే లేనప్పుడు, మనసు ఉండనే ఉండదు కదా!! మనసే లేనప్పుడు, చంచలత్వమూ, చపలత్వమూ అసలే ఉండవు కదా!!! అందుకనే, అమ్మ "నిరాకులా" అయ్యింది.
ఈ చపలత్వాన్నీ, ఆకులతనూ పోగొట్టుకోవాలి అని కోరుకునేవారు ఏ దారి పట్టాలో శంకరభగవద్పాదులు ఇలా సెలవిచ్చారు.
సత్సంగత్వే నిస్సంగత్వమ్ నిస్సంగత్వే నిర్మోహత్వమ్ !
నిర్మోహత్వే నిశ్చలతత్వమ్ నిశ్చలతత్వే జీవన్ముక్తిః !!
మంచి స్నేహాల వల్ల, చెడు స్నేహాలు దూరం అవుతాయి. చెడు స్నేహాలు దూరం అవడం వల్ల, ఇది నాది, నేను అనే లక్షణాలు, దేహాభిమానం పోయి మోహం, కామం దూరం అవుతాయి. మోహ లక్షణాలు పోయినప్పుడు, ఏకాగ్రత ఏర్పడి, మనసును ఒక చోట లగ్నం చేయగలుగుతాము. అలా కలిగిన ఏకాగ్రతతో ముక్తి మార్గాన్ని పట్టుకుని, అమ్మను చేరగలుగుతాము. ఈ దారిలో మనకు తోడుగా ఉండి, చేయి పట్టుకుని తనవైపు నడిపించి, తానే అంతా అని తెలియజేసి, మోక్షాన్ని అనుగ్రహిస్తున్న పరమేశ్వరి, "నిరాకులా".
తనను చేరుకోవాలి అంటే, సత్యనిష్ఠ, ధర్మ కార్యాచరణ, అంతఃకరణ శుద్ధి, సాధు సత్పురుషుల సాంగత్యంలో ఉంటేనే సాధకులు తనను చెరుకోగలుగుతారు అని తెలుసుకుని, తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం నిరాకులాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి