అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవికి దగ్గరలోనే ఒక చిన్న పల్లె. ఆ పల్లెలో రాము అనే వేటగాడు ఉండేవాడు. రాము పేదవాడు. రోజూ అడవికి వెళ్లి వేటాడి దొరికిన దానితోనే ఇల్లు గడిపేవాడు. ఒక రోజు తెల్లవారుజామునే రాము వేటకు బయలుదేరాడు. ఈ రోజు అయినా మంచి వేట దొరికితే బాగుండు అని అనుకుంటూ అడవిలోకి వెళ్లాడు. కానీ ఎంత తిరిగినా ఒక్క జంతువూ కనిపించలేదు. ఎండ పెరిగిపోయింది. దాహం వేసింది. కాళ్లు నొప్పి పెట్టాయి. అలసిపోయి ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్లాడు. ఇక్కడే కాసేపు కూర్చుందాం అని అనుకుని చెట్టు ఎక్కాడు. పై నుంచి చుట్టూ చూస్తూ, ఏదైనా జంతువు వస్తుందేమో అని ఎదురుచూస్తూ కూర్చున్నాడు. చాలా సేపు అయిపోయింది. కానీ ఏమీ కనిపించలేదు. రాముకి విరక్తి వచ్చింది. అప్పుడు చెట్టుకు ఉన్న ఆకులను ఒక్కొక్కటిగా తెంపి కింద పడేయ సాగాడు. అలా పడేస్తూనే ఉన్నాడు. చెట్టు ఆకులు అయిపోయాయి కానీ రాముకి అది కూడా తెలియలేదు. చెట్టు కింద ఏముందో రాము చూసుకోలేదు. అక్కడ ఒక చిన్న శివలింగం ఉంది. ఆ రోజు మహాశివరాత్రి. రాము పడేసిన ఆకులన్నీ బిల్వపత్రం చెట్టు ఆకులు. అవన్నీ శివలింగం మీదే పడుతున్నాయి.
సాయంత్రం అయిపోయింది. వేట దొరకక పోయినా రాము ఇంటికి వెళ్లిపోయాడు. ఆరోజు రాత్రి రాముకి ఒక అద్భుతమైన కల వచ్చింది. కలలో శివుడు కనిపించాడు. నీవు తెలియక చేసిన భక్తికి నేను సంతోషించాను అని అన్నాడు. నీకు మంచి జరుగుతుంది. మరుసటి రోజు నుంచి రాము జీవితం మారిపోయింది. అతని పనులన్నీ సాఫీగా జరిగాయి. కొద్దికాలంలోనే అతను ధనవంతుడయ్యాడు. అయినా రాము గర్వపడలేదు. ప్రతి రోజు శివుడిని గుర్తు చేసుకుని, మంచి పనులు చేస్తూ, పేదలకి సాయం చేస్తూ జీవించాడు. ఆ పల్లెలో వాళ్లందరూ రాము అదృష్టవంతుడు. మంచి మనసున్న వాడు అని చెప్పుకునేవారు.
నీతి :తెలియక చేసిన మంచి పని కూడా దేవునికి ప్రీతికరం అవుతుంది. భక్తి హృదయం నుంచి రావాలి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి