:దేశభక్తి:- వై. దివ్యశ్రీ 7వ తరగతి, ప్రాథమికోన్నత పాఠశాల అంబం (వై), ఎడపల్లి, జిల్లా: నిజామాబాద్.


 మహనీయుల ఆశయాలు, వారి దేశభక్తి మనకు ఎలా స్ఫూర్తినిస్తాయో వివరించే  కథ ఇది.
*****************************************************
మా అంబం పాఠశాలలో ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. జెండా ఎగురవేసిన తర్వాత మా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సార్ మమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడిగారు. పిల్లలు! దేశభక్తి అంటే ఏమిటి? కేవలం జెండాకు వందనం చేయడం, జై హింద్ అని అనడమే దేశభక్తి అనుకుంటున్నారా?. అందరం ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయాము. అప్పుడు సార్ మమ్మల్ని లైబ్రరీకి తీసుకెళ్లారు. అక్కడ గోడల మీద గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి మహనీయుల ఫోటోలు 

ఉన్నాయి. సార్ మాకు ఒక కథ చెప్పడం మొదలుపెట్టారు. 
ఒకప్పుడు మనం పరాయి పాలనలో ఉన్నప్పుడు, ఈ మహనీయులంతా తమ సొంత సుఖాలను వదులుకున్నారు. గాంధీజీ తలుచుకుంటే ఒక గొప్ప లాయర్‌గా విలాసవంతమైన జీవితం గడపవచ్చు, కానీ ఆయన దేశం కోసం ముతక బట్టలు ధరించి శాంతి మార్గంలో పోరాడారు. భగత్ సింగ్ తన ప్రాణాల కంటే దేశ స్వేచ్ఛే ముఖ్యం అనుకుని నవ్వుతూ ఉరికొయ్యను ముద్దాడారు. వారందరిలో ఉన్న ఒకే ఒక్క ఆశయం. మన భారతదేశం విద్యావంతులతో, ఆరోగ్యవంతులతో, పచ్చదనంతో విలసిల్లాలని. వారు తమ రక్తాన్ని ధారబోసి మనకు స్వేచ్ఛను ఇచ్చారు. ఇప్పుడు ఆ స్వేచ్ఛను కాపాడుకోవడం, దేశాన్ని అభివృద్ధి చేయడం మన బాధ్యత అని సార్ చెప్పారు. 
మరి సార్, మేము సైనికులం కాదు కదా! మేము దేశానికి ఎలా సహాయం చేయగలం? అని నేను అడిగాను. సార్ నవ్వుతూ ఇలా అన్నారు, దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో యుద్ధం చేయడమే కాదు. మీరు క్లాసులో శ్రద్ధగా చదువుకుని రేపు ఒక గొప్ప డాక్టరో, ఇంజనీరో అయ్యి పేదలకు సహాయం చేయడం దేశభక్తే! రోడ్డు మీద వెళ్తుంటే పడి ఉన్న చెత్తను తీసి డబ్బాలో వేయడం దేశభక్తే! నీటిని, విద్యుత్తును వృథా చేయకుండా ఆదా చేయడం దేశభక్తే! కులమతాల గొడవలు లేకుండా పక్కవాడిని తోటి మనిషిలా ప్రేమించడం దేశభక్తే! మహనీయులు మనకు చూపించిన సత్యం, అహింస, క్రమశిక్షణ అనే బాటలో నడవడమే మీరు వారికి ఇచ్చే గొప్ప బహుమతి. ఆ రోజు నాకు ఒక విషయం అర్థమైంది. దేశభక్తి అనేది ప్రదర్శించేది కాదు, అది మన ప్రతి పనిలో ఉండాలి. మేమందరం ఆ మహనీయుల విగ్రహాల ముందు ప్రమాణం చేశాము. మంచి పౌరులుగా ఎదిగి మన దేశం గర్వపడేలా చేస్తామని.
మహనీయుల చరిత్ర మనకు పాఠం కావాలి, వారి ఆదర్శాలు మనకు మార్గదర్శకం కావాలి. ప్రతి చిన్న పౌరుడు తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తేనే మన దేశం ప్రపంచంలోనే గొప్ప దేశంగా మారుతుంది.
నీతి: దేశం అంటే మట్టి కాదోయ్ - దేశం అంటే మనుషులోయ్. మన బాధ్యతను సక్రమంగా నిర్వహించడమే నిజమైన దేశభక్తి.
కామెంట్‌లు