ఒక ఊరిలో ఒక రాళ్లుకొట్టే యువకుడు ఉండేవాడు. అతడు రోజూ పక్కనేవున్న పెద్ద కొండ దగ్గరికిపోయి రకరకాల రాళ్ళను పగలగొట్టి ఇంటికి తెచ్చేవాడు. ఎవరికి ఏ రకం రాయి కావాలో కనుక్కొని వాటిని అందంగా మలచి ఇచ్చేవాడు. అతని అద్భుతమైన పనితనం చూసి ఊరిలో అనేకమంది అతని దగ్గరికి వచ్చేవారు. చేతినిండా పని, జేబునిండా డబ్బుతో హాయిగా జీవితం గడిపేవాడు. ఆ కొండమీద ఒక దేవత నివసిస్తా ఉండేది. ఆమె అప్పుడప్పుడు కొందరికి కనిపించి వారు కోరిన కోరికలు నెరవేర్చేది. ఈ రాళ్లుకొట్టే యువకుడు రోజూ పోయేది అక్కడికే కదా... కానీ అతనికి ఒక్కసారి కూడా ఆ దేవత కనిపించలేదు. దాంతో ఆ మాటలన్నీ అబద్దాలని, కట్టు కథలని అనుకునేవాడు.
ఒకరోజు ఒక ధనవంతుడు "ఒక అందమైన పూలకుండీ తయారు చేయడానికి ఒక మంచి తెల్లని పాలరాయి కావాలి" అని అతన్ని అడిగాడు. ఆ రాళ్లుకొట్టే యువకుడు కొండ దగ్గరికి పోయి ఒక మంచి అందమైన పాలరాయిని తీసుకొని ఆ ధనవంతునికి ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ ధనవంతుని ఇల్లు మామూలుగా లేదు రాజభవనంలో ఉంది. అడుగడుగునా అందమైన పాలరాతి శిల్పాలు, టేకుతో తయారుచేసిన గుమ్మాలు, కాలు కందకుండా మెత్తని ఖరీదైన తివాచీలు, రంగురంగుల రత్నాల దీపాలు, ఏవి కావాలంటే అవి క్షణాల్లో పరుగు పరుగున అందించే సేవకులు... వాటన్నిటినీ చూస్తూ ఆ యువకుడు "నేను కూడా ఇలా ధనవంతున్నయి, బంగారు ఉయ్యాలలో ఊగుతూ, హంసతూళికా తల్పంమీద పడుకుంటే ఎంత బాగుండేది. ఆ అదృష్టం ఈ జన్మలో పడుతుందో పట్టదో" అనుకున్నాడు. అంతలో ఆకాశంలోనించి "నీవు కోరుకున్నది కోరుకున్నట్లు జరుగుతుంది. దిగులు పడకు" అంటూ అతనికి వినిపించింది. ఆ యువకుడు తన చెవులను తానే నమ్మలేక చుట్టూ చూశాడు. ఏమీ కనపడలేదు. ఏదో అంతా భ్రమలే అనుకుని ఇంటిదారి పట్టాడు.
ఇంటి దగ్గరికిపోయి చూస్తే అతనికి తన చిన్న చెక్క ఇల్లు ఎక్కడా కనపడలేదు. దాని స్థానంలో అతి ఖరీదైన ఇంద్రధనస్సు లాంటి పాలరాతి భవనం కనిపించింది. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. నిజమా కలా అని కళ్ళు నులుపుకొని చూస్తావుంటే ఇంటి లోపల అతని అమ్మానాన్నలు కనిపించారు. తన కోరిక నెరవేర్చిన ఆ దేవతకు మనసులోనే ధన్యవాదాలు తెలియజేసుకున్నాడు. ఆ పాలరాతి భవనంలో హాయిగా జీవించసాగాడు.
ఒకసారి అతను ఆ భవనం పైన నిలబడి ముందున్న రహదారిపై చూస్తావుంటే ఆ రాజ్యానికి మహారాజు రథంమీద పోతూ కనబడ్డాడు. మంగళ వాయిద్యాలు మోగుతూవుంటే, ముందూ వెనుకా అనేకమంది సైనికులు సేవకులు కాపలాగా నడుస్తూవుంటే, దారిలో అందరూ రెండువైపులా నిలబడి పూలు, సుగంధద్రవ్యాలు చల్లుతావుంటే, ఏడు గుర్రాలు అమర్చిన బంగారు రథంపై కూర్చుని చిరునవ్వులు నవ్వుతూ ఊరేగింపుగా వెళుతున్నాడు. "ఆహా అదీ దర్జా అంటే... పుడితే జేజేలు అందుకునే రాజుగానన్నా పుట్టాలి, ఎక్కితే ఎత్తయిన ఏనుగన్నా ఎక్కాలి, తింటే తీయని గారెలన్నా తినాలి. ఈ అదృష్టం నాకు ఎప్పుడు పడుతుందో ఏమో" అనుకున్నాడు. అతను మనసులో అలా అనుకున్న మరుక్షణం ఆకాశంలో నుంచి "నీవు కోరుకున్నది కోరుకున్నట్లు కొద్ది రోజుల్లోనే జరుగుతుంది. దిగులు పడకు" అంటూ అతనికి వినిపించింది. ఆ మాటలు విని ఆ యువకుడు చాలా సంబరపడ్డాడు.
ఆ రాజుకు పిల్లలు లేరు. తన రాజ్యానికి తర్వాత ఎవరిని రాజుగా నియమించాలా అని ఆలోచించి ఒక ఏనుగుకు పూలహారం అందించి వీధిలోకి వదిలాడు. అది ఎవరి మెడలో దండ వేస్తే వాళ్లే తన తర్వాత మహారాజు అని ప్రకటించాడు. ఆ ఏనుగు అటూయిటూ చూడకుండా... ఎక్కడా ఆగకుండా చక్కగా వచ్చి ఆ రాళ్లు కొట్టుకునే యువకుని మెడలో దండ వేసింది. దాంతో మరుక్షణమే అతను ఆ రాజ్యానికి రాజుగా మారిపోయాడు. కొంతకాలం హాయిగా తియ్యని కలలాగా జీవితం గడిచిపోయింది.
ఎండాకాలం సమీపించింది. సూర్యుడు నిప్పులు కక్కుతా ఉన్నాడు. నీళ్లు ఆవిరవుతా వున్నాయి. చెట్లు వాడిపోతున్నాయి. భూములు బీడు వారుతున్నాయి. రాజభవనం ఆ వేడికి సలసలా కాగిపోసాగింది. ఎంతమంది ఎన్ని విసనకర్రలు తెచ్చి విసిరినా వేడి చల్లారడం లేదు. ఆ రాళ్లు కొట్టుకునే యువకుని ఒళ్ళు వేడికి నల్లగా కమిలిపోసాగింది. అదిచూసి ఆ యువకుడు "రాజే అందరికన్నా గొప్పవాడు, శక్తివంతుడు అనుకున్నా కానీ ఈ సూర్యునికి అడ్డొచ్చేవాళ్ళు, ఆపేవాళ్లు ఎవరూ లేరు. నేను కూడా సూర్యునిలా మారిపోతే ఎంత బాగుంటుంది. భూమి మీద ఉన్న రాజులందరినీ వణికిపోయేలా చేయవచ్చు" అనుకున్నాడు. అతను మనసులో అలా అనుకున్న మరుక్షణం ఆకాశంలోంచి "నీవు కోరుకున్నది కోరుకున్నట్లు జరుగుతుంది. దిగులు పడకు" అంటూ అతనికి వినిపించింది. అంతే... ఆ మరుక్షణమే అతడు వెలుగులు విరజిమ్ముతూ భగభగమండే సూర్యునిలా మారిపోయాడు.
వెంటనే ఆ యువకుడు మరింత మండిపోతూ భూమినంతా తన వేడితో అల్లకల్లోలం చేయసాగాడు. పెద్ద పెద్ద రాజులు, మహారాజులపై కిరణాలు భయంకరంగా ప్రసరిస్తూ అందమైన తెల్లని మొహాలన్నీ నల్లగా కమిలిపోయేటట్లు చేశాడు. జనాలంతా భయపడి "సూర్యదేవా... నీవు ఇలాగే ప్రతాపం చూపిస్తూవుంటే పంటలు పండక, నీళ్లు లేక ఈ భూమి మీద ఒక్కరము మిగలము. మమ్మల్ని కాపాడు స్వామీ" అంటూ ప్రార్థనలు చేయసాగారు. సూర్యుడు రొమ్ము విరుచుకొని తనంత మొనగాడు ఈ లోకంలో ఎవడూ లేడని పొగరుతో తిరగసాగాడు.
అంతలో పెద్దపెద్ద దట్టమైన మేఘాలు ఆకాశమంతా పరుచుకోసాగాయి. సూర్యుడు ఎంత ఎరుపెక్కినా ఒక్క కిరణం కూడా భూమి మీద పడకుండా గొడుగులా అడ్డం వచ్చాయి. వరుస వానలతో భూమినంతా చల్లబరిచాయి. భూమంతా గడ్డితో నిండిపోయి పచ్చని తివాచీలా అల్లుకుంది. సూర్యుడు ఎంత ప్రయత్నించినా ఏమీ చేయలేకపోతున్నాడు. అదిచూసి ఆ యువకుడు "ఇన్ని రోజులు సూర్యుడే అందరికన్నా గొప్పవాడు, శక్తివంతుడు అనుకున్నా కానీ ఈ మేఘరాజు కన్నా గొప్పవాడు ఎవడూ లేడు. సూర్యుని శక్తి అతనిముందు ఎందుకూ పనికిరాదు. నేను కూడా ఆ పెద్ద మేఘరాజుగా మారిపోతే ఎంత బాగుంటుంది" అనుకున్నాడు. అతను మనసులో అలా అనుకున్న మరుక్షణం ఆకాశంలోంచి "నీవు కోరుకున్నది కోరుకున్నట్లే జరుగుతుంది. దిగులు పడకు" అంటూ అతనికి వినిపించింది.
అంతే... ఆ మరుక్షణమే అతను మేఘరాజుగా మారిపోయాడు. వెంటనే ఆ యువకుడు ధగధగలాడే సూర్యుని చుట్టుముట్టాడు. ఒక్క కిరణం కూడా కిందకు పోకుండా ఆపి తన శక్తికి తానే సంబరపడిపోయాడు. వానలతో భూమిని ముంచెత్తసాగాడు. కాలువలు, వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లసాగాయి. ఊర్లన్నీ జలమయమై మొత్తం ఒక మహా సముద్రంగా మారిపోయింది. కానీ జపాన్ మధ్యలో వున్న ఒక పెద్ద పర్వతం మాత్రం చెక్కుచెదరకుండా అలాగే నిలబడి ఉంది. అదిచూసి మేఘరాజుకు కోపం పెరిగిపోయింది. ఉరుముతూ, మెరుస్తూ నల్లని మేఘాలతో ఆ పర్వతాన్ని చుట్టుముట్టాడు. ఎంత వాన కురిసినా, ఎంత గాలి వీచినా ఆ పర్వతం అలాగే నిలబడి చిరునవ్వులు రువ్వసాగింది. కురిసీ కురిసీ మేఘాలలోని నీళ్లన్నీ అయిపోయాయి. మేఘరాజు డీలా పడిపోయాడు. "ఛ... ఛ... ఇన్నిరోజులు ఈ మేఘరాజే అందరికన్నా గొప్పవాడు, శక్తివంతుడు అనుకున్నా కానీ మేఘరాజు కన్నా పర్వతరాజే గొప్పవాడు. అతనిముందు మేఘరాజు ఎందుకూ కొరగాడు. నేను పర్వతరాజుగా మారిపోతే ఎంత బాగుంటుంది" అనుకున్నాడు. అతను మనసులో అలా అనుకున్న మరుక్షణం ఆకాశంలోంచి "నీవు కోరుకున్నది కోరుకున్నట్లే జరుగుతుంది. దిగులు పడకు" అంటూ వినిపించింది.
అంతే... ఆ మరుక్షణమే అతడు అతిపెద్ద పర్వతంగా మారిపోయాడు. నిప్పులు చెరిగే ఎండకు, సర్రున వీచే గాలికి, భయంకరమైన వానకు... దేనికీ చెక్కుచెదరకుండా, ఠీవిగా తల ఎత్తుకొని గర్వంగా నిలబడసాగాడు. "ఇక తనను ఎవరూ ఏమీ చేయలేరు. అందరికన్నా నేనే శక్తివంతున్ని" అని అనుకున్నాడు.
అంతలో అతని పాదాల దగ్గర ఠప్పుమని ఏదో చప్పుడు వినపడింది. ఒళ్ళు జలదరించింది. ఏమబ్బా అని కిందికి తొంగిచూస్తే ఒక మనిషి ఉలి తీసుకొని సుత్తితో బలంగా దెబ్బమీదదెబ్బ కొడతావున్నాడు. అదిచూసి పర్వతరాజు భయంతో వణికిపోయాడు. ఒకొక్క దెబ్బ పడతావుంటే శరీరంలో ఒక్కొక్క భాగం ముక్కలు ముక్కలుగా చీలి పోసాగింది. అదిచూసి "ఓరి దేవుడా... ఇంతవరకు పర్వతాలే అన్నిటికన్నా గొప్పవని, శక్తివంతమైనవని అనుకున్నాను గానీ మనిషి శక్తిముందు, తెలివితేటలముందు ఏవీ సాటిరావు. కొండలు బద్దలు కొట్టగలడు. మేఘాలు చెదరగొట్టగలడు. నదులు మళ్లించి ఆపగలడు. ఆఖరికి మరో ప్రపంచాన్ని కూడా నిర్మించగలడు. నేను మరలా మనిషిగా మారితేనే మేలు" అనుకున్నాడు. అతను అలా కోరుకున్న మరుక్షణం ఆకాశంలోంచి "నీవు కోరుకున్నది కోరుకున్నట్లే జరుగుతుంది. దిగులు పడకు. ఇక ఇదే నీకు చివరిసారి" అంటూ వినిపించింది. అంతే మరుక్షణంలో అతను మరలా రాళ్లుకొట్టే యువకునిగా మారిపోయాడు.
**********

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి