జపాన్ లో ఒక పల్లెటూరు ఉండేది. అది చాలా అంటే చాలా చిన్నది. అక్కడి ప్రజలకు నగరం చాలా దూరం. నగరంలో దొరికే వస్తువులు ఏవీ అక్కడ ఉండేవి కావు. ఆ ఊరి నుండి ఎవరూ పెద్దగా బయటికి కూడా పోయేవాళ్ళు కాదు.
ఆ నగరంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఆ వ్యాపారికి ఒక చిన్న పాప ఉంది. ఆ పాప ముద్దు ముద్దు మాటలు, ముత్యాల్లాంటి నవ్వులంటే అతనికి చాలా ఇష్టం. అడిగినవన్నీ కొనిస్తూ అల్లారుముద్దుగా పెంచుకునేవాడు. అతను బట్టలు తయారు చేసేవాడు. ఆ ఏడు ఆ ఊరిలో పెద్ద కరువు వచ్చి ఎవరు కొనడానికి రాలేదు. దాంతో దూరంగా ఉన్న టోకియో నగరానికి పోయి అమ్ముకొని రావాలనుకున్నాడు. దాంతో ఆయన పెళ్ళాన్ని పిలిచి "నేను పోయి రావడానికి చాలా రోజులు పడుతుంది. పాప జాగ్రత్త. దాని పాదాలను నీ అరచేతుల్లో పెట్టుకొని కాపాడు. కాటుక కళ్ళలో కన్నీరు కారకుండా చూసుకో. నేను తిరిగి వచ్చేటప్పుడు నీవు ఇంతవరకు ఎప్పుడూ ఎక్కడా చూడని ఏదైనా ఒక అపురూపమైన కానుక తీసుకొని వస్తా" అని చెప్పాడు.
అదే సమయంలో కూతురిని పిలిచి "పాపా... నీవు పుట్టినప్పటినుంచి నిన్ను విడిచి ఎప్పుడూ ఎక్కడికీ ఇంతకాలం పోలేదు. నేను లేనని అమ్మని సతాయించొద్దు. అనవసరంగా బయట తిరుగుతూ అదికావాలా ఇది కావాలా అని మొండిపట్టు పట్టొద్దు. నీవు బుద్ధిగా అమ్మ చెప్పినట్లు వింటే వచ్చేటప్పుడు రంగురంగుల బొమ్మలు కానుకగా తెస్తా. సరేనా" అన్నాడు. ఆ పాప అలాగేనంటూ తల ఊపింది.
ఇద్దరికీ జాగ్రత్తలు చెప్పి నగరానికి బయలుదేరాడు. అక్కడ వీధులన్నీ తిరుగుతూ తాను తెచ్చిన బట్టలన్నీ ఒక్కొక్కటే అమ్మసాగాడు. అవి చాలా మంచిగా మన్నికగా ఉండటంతో మంచి ధర వచ్చింది. నెలరోజుల్లో అన్నీ అమ్ముడైపోయాయి. ఇచ్చిన మాట ప్రకారం పెళ్ళానికి, కూతురికి కావలసిన కానుకలు తీసుకుని ఇంటికి బైలుదేరాడు.
నెలరోజుల తర్వాత ఇంటికి తిరిగి రావడంతో పెళ్ళాం బిడ్డలు చాలా సంబరపడ్డారు. పాప పరుగు పరుగున వచ్చి నాన్నను చుట్టేసుకుంది. వ్యాపారి ఆ పాపకు ముద్దుపెట్టి "నీకోసం ఏం తెచ్చానో తెలుసా..." అంటూ ఒక బుట్ట తీశాడు. అందులో అడుగు వేస్తే అల్లరి చేసే మెత్తని రంగురంగుల కిర్రు చెప్పులు, ఎంత ఎండలో తిరిగినా మొహం మీద వెలుతురు పడని నెమలీకల టోపీ, కీ ఇస్తే పల్టీలు కొడుతూ ఇల్లంతా తిరిగే కోతిబొమ్మ, నోట్లో వేస్తే తియ్యగా కరిగిపోయే మెత్తని జిలేబీలు ఉన్నాయి. అవిచూసి ఆ పాపకు ఒకటే సంబరం. "మా మంచి నాన్న" అంటూ మెడను కౌగిలించుకొని బుగ్గమీద ముద్దులమీద ముద్దులు పెట్టింది.
పాప వాటితో ఆడుకుంటూ వుంటే పెళ్ళాన్ని పిలిచి "ఇదిగో... నీవు ఎప్పుడూ చూడని, అసలు ఈ ఊరిలోనే ఎవరికీ తెలియని అద్భుతమైన కానుక" అంటూ ఒక అందమైన చెక్కపిడి వున్న అద్దాన్ని తీసి ఆమెకు అందించాడు.
ఆమె అద్దాన్ని జీవితంలో అదే మొదటిసారి చూడడం. అందులోకి చూడగానే ఆమె మొహం ఆమెకే కనపడింది. అందులో కనపడుతున్నది తన మొహమే అని తెలియక ఆ అద్దంలో ఏ దయ్యమో, భూతమో ఉందని అదిరిపడి భయంతో కెవ్వుమని కేకపెట్టి దాన్ని అక్కడే వదిలేసి వణికిపోయింది.
అతను చిరునవ్వు నవ్వి "ఒసేయ్ పిచ్చి మొహమా... దీన్ని అద్దం అంటారు. దీనిలో మన మొహమే మనకు కనపడుతుంది. అంతేగానీ భూతం కాదు, దయ్యం కాదు. దా ఇద్దరం కలసి ఒకేసారి చూద్దాం" అన్నాడు. ఆమె భయపడుతూ భయపడుతూ మొగునితో కలసి దానిలోకి తొంగిచూసింది. ఇద్దరి మొహాలు పక్కపక్కనే చూడముచ్చటగా కనపడ్డాయి. అదిచూసి ఆమె సంబరపడింది. దాన్ని తీసుకొని ఎవరికీ కనపడకుండా భద్రంగా దాచిపెట్టుకుంది.
కొంతకాలం తర్వాత ఆమెకు అనుకోకుండా ఒక నయంకాని జబ్బు చేసింది. ఎన్ని మందులు వాడినా, ఎంతమంది వైద్యులకు చూపించినా కొంచెం కూడా తగ్గలేదు. రోజురోజుకి రోగం ముదిరిపోయి చివరికి దీపం కొండెక్కింది. చనిపోయేముందు కూతుర్ని పిలిచి అద్దాన్ని ఆ పాప చేతిలో పెట్టి "పాపా... నాన్న మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పకు. తల్లిలేనిబిడ్డగా జాగ్రత్తగా బతుకు. నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటా. నీకు బాధ కలిగితే ఈ అద్దంలో చూడు. ఇందులో కనపడతా. నీ బాధలన్నీ నాకు చెప్పుకో... తగ్గిపోతాయి" అంది. అమ్మ చనిపోయాక ఆ పాప ఆ అద్దాన్ని జాగ్రత్తగా ఎవరికీ కనబడకుండా తన గదిలోని చెక్కపెట్టెలో దాచిపెట్టుకుంది.
కొంతకాలానికి వాళ్ళ నాన్న మరలా పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి మంచిదే గానీ కోపం చాలా ఎక్కువ. చెప్పిన పని చేయకున్నా, మాటకుమాట చెప్పినా తల్లి లేని పిల్ల అని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు తిట్టేది. కొంచెం కూడా జాలి చూపించేది కాదు. దగ్గరికి తీసుకునేది కాదు. నాన్న కూడా వ్యాపారంలో పడిపోయాడు. ఇంతకుముందులా ఆ పాపను పట్టించుకోవడం మానేశాడు. దాంతో పాపం ఆ పాప ఒంటరిది అయిపోయింది. మనసుకు బాధ కలిగినప్పుడు ఎవరూ లేని సమయం చూసి చెక్క పెట్టెలో దాచిపెట్టిన అద్దం తీసి చూసేది.
ఆ పాపకు అద్దంమంటే తెలియదు కదా... ఆ అద్దంలో తన రూపమే కనపడినా అది అమ్మే అనుకునేది. అమ్మ తన కోసం అచ్చం తనలాగే చిన్న పిల్లలాగా మారిపోయింది అని సంబరపడేది. అమ్మతో బాధలన్నీ చెప్పుకునేది. ఆ పాప నవ్వితే అద్దంలో అమ్మ నవ్వేది. ఆ పాప ఏడిస్తే అద్దంలో అమ్మ కూడా ఏడ్చేది. అమ్మకు అన్నీ చెప్పుకునేసరికి ఆ పాపకు గుండె బరువు తగ్గిపోయేది. మనసంతా తేలికగా మారిపోయేది. ఇంటి పనులన్నీ అయిపోయాక ఆ పాప ఎక్కువగా గదిలోనే ఉండిపోయేది. అద్దం తీసి అమ్మను చూస్తూ ఉండేది.
ఒకసారి వాళ్ళ సవతి తల్లి ఆ పాప గదిలో ఎవరితోనో మాట్లాడడం గమనించింది. "ఇదేందబ్బా... ఒక్కతే ఎవరితో మాట్లాడుతుంది" అని చప్పుడు కాకుండా కిటికీలోంచి తొంగిచూసింది. చూస్తే ఇంకేముంది ఆ పాప చేతిలోని అద్దంలో ఏదో కదులుతున్న బొమ్మ కనపడింది. ఆమె కూడా అంతవరకు అద్దం చూడలేదు కదా దాంతో "ఓరి దేవుడా... ఈ పాపకు ఏవో మంత్రశక్తులు ఉన్నట్టున్నాయి. చేతిలో ఏ దయ్యాన్నో, భుతాన్నో బందీ చేసి పట్టుకొని మాట్లాడుతావుంది. కొంపదీసి నా మీదకు వదలదు కదా" అని భయపడిపోయింది.
వెంటనే వేగంగా ఉరుక్కుంటా మొగుని దగ్గరికిపోయి "నీ ముద్దుల కూతురు ఈమధ్య మంత్రతంత్రాలు నేర్చుకొని దయ్యాన్ని తెచ్చి గదిలో పెట్టుకుంది. దానికి నేను తిట్టినవి కొట్టినవి అన్నీ ఒకదానిమీద మరొకటి ఎక్కించి చెబుతా వుంది. ఎప్పుడో ఒకసారి ఆ దయ్యాన్ని నా మీదికి వదలడం ఖాయం. నేను చావడం ఖాయం. నేను ఇక ఇలాంటి ఇంటిలో ఉండలేను. మా పుట్టింటికి వెళ్ళిపోతా" అని ఏడ్చుకుంటా చెప్పింది.
దాంతో వాళ్ళ నాయన సంగతేమో తెలుసుకుందామని ఆ పాప ఉన్న గదిలోకి వేగంగా వచ్చాడు. ఆ అడుగుల చప్పుడుకి అదిరిపడి ఆ పాప చేతిలోనే అద్దాన్ని ఠకీమని చెక్కపెట్టెలో పెట్టేసి మూత మూసింది. వాళ్ళ నాన్న కోపంగా పాప చేయి పట్టుకొని "మీ పినతల్లి మీద ఏవో కుట్రలు చేస్తున్నావంటేనే. ఏం దాచి పెట్టావు ఆ పెట్టెలో" అన్నాడు విసురుగా.
ఆ పాప మౌనంగా పెట్టె తెరిచి అద్దం నాన్న చేతికి అందిస్తూ "అమ్మ చనిపోతూ... చనిపోతూ... దీన్ని నాకు ఇచ్చింది. నేను చనిపోయాక ఈ అద్దంలోకి వస్తా. నీకు బాధ కలిగితే నా దగ్గరికి రా. నేను అందులో కనపడతా అంది. ఈ మధ్య నువ్వు నన్ను అసలు పలకరించడం లేదు. పట్టించుకోవడం లేదు. చిన్నమ్మ కూడా చీటికిమాటికి కసురుకుంటా ఉంది. నా బాధలు చెప్పుకోవడానికి ఎవరూ లేరు. ఒంటరిదాన్ని అయిపోయాను. దాంతో ఈ అద్దంలో వున్న అమ్మకు అన్నీ చెప్పుకుంటున్నా. ఇప్పుడు అమ్మనే నాకు తోడు నీడ. అంతే తప్ప ఎవరిమీద ఏ చాడీలు చెప్పడం లేదు" అంది కన్నీరు కారుస్తూ.
ఆ మాటలకు అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి.
ఆ పాపను దగ్గరికి తీసుకున్నాడు. "నన్ను మన్నించు తల్లీ... పొరపాటు చేశాను. ఇకపై నీ కంట కన్నీరు కాకుండా చూసుకునే బాధ్యత నాది. ఇక నీకు ఈ అద్దంతో గానీ అమ్మతో గానీ ఎప్పటికీ పనుండదు" అని చెప్పాడు. భార్యకు అద్దం గురించి చెప్పి "పాపం అది తల్లి లేని చిన్న పిల్ల. దానికి ఎవరున్నారు నీవు నేను తప్ప. ఆ పాప కంట కన్నీరు కారితే నా కంట కారినట్లే. నా మీద నీకు ఏ మాత్రం ప్రేమ వున్నా దాన్ని ఒక్క మాట అనొద్దు. సొంత కూతురు లెక్క చూడు" అంటూ మాట తీసుకున్నాడు. ఆమె కూడా మంచిదే కదా... దాంతో కరిగిపోయి 'అలాగే' అంది. ఆ తర్వాత ఆ పాపకు మరలా ఎప్పుడూ తన బాధలు చెప్పుకోడానికి అద్దం దగ్గరికి పోవాల్సిన అవసరం పడలేదు.
**********

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి