చంద్రలోకపు మెరుపుతీగ (జపాన్ జానపద కథ) - డా.ఎం. హరి కిషన్-కర్నూలు-9441032212


 జపాన్ లోని ఒక గ్రామంలో ఒక మేదరి నివసిస్తూ ఉండేవాడు. మేదరి అంటే తెలుసు కదా... వెదురు బొంగులతో తడికలు, బుట్టలు, చాటలు, గంపలు, నిచ్చెనలు ఇలా ఇంట్లో ఉపయోగించే వస్తువులను తయారు చేసేవాడు. అతను రోజూ పక్కనే వున్న అడవికి పోయి మంచి వెదురు బొంగులు నరికి ఇంటికి తెచ్చుకునేవాడు. ఆ బొంగులను చీల్చి దబ్బలతో బుట్టలు, గంపలు, చాటలు తయారుచేసి అమ్మేవాడు.
ఒకసారి అతను వెదురు బొంగుల కోసం అడవికి పోయినప్పుడు ఒకచోట పొదల మధ్య ధగధగా మెరుస్తా ఏదో కాంతి కనపడింది. ఏముందబ్బా అని దగ్గరికి పోయి చూస్తే అక్కడ బంగారు రంగులో ధగధగా మెరిసిపోతావున్న ఒక చిన్నపాప చిరునవ్వులు నవ్వుతా కనపడింది. "ఎవరి పాపనో ఏమో" అనుకుంటూ చుట్టుపక్కలంతా వెతికాడు. ఎవరూ ఎక్కడా కనపడలేదు. దాంతో పాపం అనుకొని ఆ ముద్దులొలికే చిన్నారిని ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆ తర్వాతరోజునుంచి అతను అడవికి పోయినప్పుడల్లా ఆ పొదల దగ్గర ఒక బంగారు నాణెం దొరకసాగింది. చూస్తుండగానే అతను ఆ ఊరిలో అందరికన్నా పెద్ద ధనవంతుడు అయిపోయాడు. నగలు, మేడలు అన్నీ కొనేశాడు. ఆ అదృష్టమన్తా ఆ పాప వల్లనే అని ఆ పాపను అపురూపంగా సొంతకూతురిలాగా చూసుకోసాగాడు.
ఆ పాప రోజురోజుకీ పచ్చని మొక్కలాగా పెరగసాగింది. చూస్తుండగానే పదహారేళ్ళు వచ్చేశాయి. ఆ పాప నవ్వితే వెన్నెల వాన కురిసినట్లు ఉండేది. ఆ పాప మాట్లాడితే నోట్లో చెక్కర పోసినంత తియ్యగా వుండేది. ఆ పాప మొహం వేయి చందమామల వెలుగులు విరజిమ్ముతా ఉండేది. ఒళ్లంతా తెల్లని మల్లెపూవులా మెరిసిపోతా ఉండేది. ఆమె అసాధారణమైన అందం గురించి ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోసాగాడు. తోట దాటి బయటకు వచ్చేది కాదు. ఎవరికంటా పడేది కాదు. కానీ ఇంటికొచ్చిన బంధువులు, ఇంట్లో పని చేసే పనిమనుషుల ద్వారా నెమ్మది నెమ్మదిగా ఆ మెరుపుతీగ గురించి రాజ్యమంతా తెలిసిపోయింది. పెళ్లి కానివాళ్ళు ఇలాంటి పెళ్ళాం ఇంట్లో దీపం పెడితే ఎంత ముచ్చటగా వుంటాదో అనుకుంటూ వుంటే, పెళ్లయినవాళ్లు ఇలాంటి కూతురు నవ్వుతూ తిరుగుతుంటే ఇల్లంతా పండగలా ఎంత సంబరంగా ఉంటుందో అనుకునేవాళ్ళు.
ఆ రాజ్యంలో వుండే అత్యంత ధనవంతులు, ప్రముఖులు, వీరుల కుమారులు ఐదుమంది ఆ అమ్మాయిని చేసుకోవడానికి వాళ్ళ ఇంటికి వచ్చారు. "నీకు మాలో ఎవరు ఇష్టమైతే వాళ్లను చేసుకో... నీ కంట నీరు రాకుండా రెప్పలా చూసుకుంటాం, కాలు కందకుండా కన్నతల్లిలా కాపాడుకుంటాం" అన్నారు.
కానీ ఆ పాపకు వాళ్ళని ఎవరినీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అలాగని మొహం మీదనే కాదంటే ఏమనుకుంటారో ఏమో అని ఒక్కొక్కరికి ఒకొక్క అసాధ్యమైన పరీక్ష పెట్టి "ఇందులో ఎవరు గెలిస్తే వాళ్లను చేసుకుంటా" అంది.    
మొదటి వీరునితో బుద్ధుడు భిక్షాటనలో వాడిన రాతి పాత్ర తీసుకు రమ్మనింది.
రెండవ వీరునితో సముద్ర ద్వీపంలోని బంగారు చెట్టుకు కాసిన రత్నాల కొమ్మ కావాలంది.
మూడవ వీరునితో అగ్ని ఎలుకల చర్మంతో నేసిన అపురూపమైన చీర కావాలంది.
నాలుగో వీరునితో సముద్రంలోని తుఫానులను నియంత్రించే డ్రాగన్ చేతి ఆభరణాలు తీసుకు రమ్మనింది.
అయిదవ వీరునితో గండభేరుండ పక్షి గూటిలోని గుడ్ల పెంకులతో తయారు చేసిన పాత్ర కావాలంది.
సరే అని ఆ అయిదుగురు వాటికోసం బైలుదేరారు.
మొదటి వీరుడు బుద్ధుడు భిక్షాటన చేసిన పాత్ర కోసం రాజ్యమంతా వెతికాడు. అనేకమంది చరిత్రకారులను, పండితులను కలిశాడు. అనేక పురావస్తు ప్రదర్శనశాలలు తిరిగాడు. కానీ ఆ పాత్ర ఎక్కడుందో, ఎలా వుంటుందో ఎవరూ చెప్పలేకపోయారు. దాంతో తిరిగి తిరిగి అలసిపోయి ఇక అది ఎప్పటికీ దొరకదని నిర్ధారించుకొని వెళ్ళిపోయాడు.
రెండవవాడు ఆ రత్నాల కొమ్మను వెతకడానికి ప్రయత్నించాడు గానీ అసలు సముద్రంలో ఆ ద్వీపం ఎక్కడుందో కూడా తెలుసుకోలేకపోయాడు. దాంతో రాజ్యంలో అందరికన్నా అద్భుతంగా నగలు తయారు చేసే ఒక బంగారు పనివాన్ని పిలిచి రత్నాలు పొదిగిన బంగారు కొమ్మను చూడముచ్చటగా తయారు చేయించి ఆమె ముందు పెట్టాడు. కానీ కొత్తగా ధగధగా మెరుస్తావున్న దాన్ని చూడగానే అది పురాతనమైనది కాదని, దానికి ఎటువంటి పవిత్రత లేదని ఆమె కనుక్కుంది. దాంతో అతడు తలవంచుకొని అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
మూడవవాడు అగ్ని ఎలుకల చర్మంతో నేసిన అపురూపమైన చీర కోసం వెతకసాగాడు. అలా వెతుక్కుంటూ జపాన్ దాటి చైనాలోకి అడుగు పెట్టాడు. అక్కడ ఒక వ్యాపారి ఎర్రగా ధగధగా మెరిసిపోతున్న ఒక పట్టుచీరను చూపించి "ఇదే అగ్ని ఎలుకల చర్మంతో నేసిన అపురూపమైన పట్టుచీర. కాకపోతే దీని ధర చాలా చాలా ఎక్కువ. ఎంతో ధనవంతులు తప్ప ఇంతవరకు ఎవరూ కొనలేరు" అని చెప్పాడు. ఆ మూడవ వీరుడు ఎలాగైనా సరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే కోరికతో అతడు అడిగినంత ధనమిచ్చి ఆ పట్టుచీర తీసుకొచ్చి ఆమె ముందు ఉంచాడు. అప్పుడు ఆమె "అగ్ని ఎలుకల చర్మంతో తయారుచేసిన చీర నిప్పులో కాలదు, నీటిలో నానదు. చూద్దాం ఇది నిజమైనదో కాదో" అంటూ అగ్గిపుల్ల గీసి అంటించింది. అంతే... క్షణాల్లో ఆ చీర భగభగమని మండుతూ బూడిద కుప్పగా మారింది. దాంతో తాను మోసపోయానని గ్రహించి ఆ మూడవ వీరుడు విచారంగా వెళ్ళిపోయాడు.
నాలుగవ వీరుడు డ్రాగన్ చేతిలోని కంకణాలను తీసుకురావడం కోసం ఒక పెద్ద ఓడలో సైనికులతో సముద్రంలోకి బయలుదేరాడు. అలా చాలాదూరం పోయాక ఒక పెద్ద పర్వతం దగ్గర నీటి అలల మీద దూసుకుపోతావున్న ఒక డ్రాగన్ కనిపించింది. దాన్ని పట్టి బంధించాలని ప్రయత్నించాడు. దాంతో ఆ డ్రాగన్ సముద్రాన్నంతా అల్లకల్లోలం చేయసాగింది. దాని వేగానికి సముద్రంలో సుడిగుండాలు పుట్టి అలలు ఎగిసిపడసాగాయి. ఆకాశం కారు మబ్బులతో నిండిపోయి తీవ్రమైన గాలులతో తుఫాను ప్రారంభమైంది. "ఇలాగే ముందుకుపోతే డ్రాగన్ను పట్టుకోవడం సంగతి దేవునికెరుక... తామంతా జల సమాధి కావడం ఖాయం" అనుకొని వెంటనే ఓడను వెనక్కి తిప్పుకొని వేగంగా తీరం వైపు బయలుదేరాడు. తన ఓటమిని అంగీకరించాడు.
ఇక ఐదవ వీరుడు గండభేరుండ పక్షి గూడును వెతుక్కుంటూ బయలుదేరాడు. కాకులు దూరని కారడువులు, చీమలు దూరని చిట్టడువులు అన్నీ గాలించాడు. చివరికి ఒక దట్టమయిన అడవిలో పెద్ద పర్వతం మీదున్న ఎత్తయిన చెట్టు మీద ఆ పక్షి కనబడింది. అది ఆహారం కోసం పోయినప్పుడు నెమ్మదిగా కష్టపడి పైకి చేరుకున్నాడు. గూటిలో గుడ్డును అందుకునే సమయంలో ఎక్కడినుంచి వచ్చిందో ఆ గండభేరుండ పక్షి సర్రున దూసుకువచ్చి విసురుగా వాన్ని ఢీకొట్టింది. అంతే పట్టుజారి అంత పైనుండి దభీమని కిందపడ్డాడు. ఒళ్లంతా దెబ్బలు తగిలాయి. అంతలో ఆ పక్షి తన గుడ్లను తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయింది. దాంతో "ఇక లాభం లేదు ఆ పక్షి గుడ్లను తీసుకురావడం అసాధ్యం" అనుకొని పోటీనుంచి తప్పుకున్నాడు. అలా ఆమెను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ఐదుమంది నిరాశతో వెనుతిరిగి వెళ్ళిపోయారు.
కొంతకాలానికి ఆమె అపురూపమైన సౌందర్యం గురించి ఆ నోటా ఈ నోటా పడి ఏకంగా జపాన్ దేశపు యువరాజుకు తెలిసింది. అతను చాలా మంచివాడు. మెత్తని పూవులాంటి మనసు కలవాడు. ఎలాగైనా ఆ పాపను పెళ్లి చేసుకుని తన దేశానికి యువరాణిగా చేయాలని అనుకున్నాడు. దాంతో స్వయంగా ఆమెను ఒప్పించడానికి వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆ అమ్మాయికి యువరాజు మాటతీరు ఎంతో నచ్చింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఎవరికీ చెప్పుకోలేని విషయం. దాంతో తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని దానికి ఇంకా చాలా సమయం ఉందని నెమ్మదిగా సర్ది చెప్పింది. కానీ యువరాజు ఆమె ప్రేమలో పడిపోయాడు. "చేసుకుంటే నిన్నే చేసుకుంటాను లేదంటే ఇలాగే ఒంటరిగా ఎప్పటికీ మిగిలిపోతాను" అని చెప్పి వెళ్లిపోయాడు.
ఆ తరువాత ప్రతినెలా ఒక ఉత్తరం రాసి ఒక ముఖ్యమైన అనుచరునితో ఆమెకు పంపించసాగాడు. అట్లా నెమ్మదిగా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టం పెరిగినా ఆ అమ్మాయి పెళ్లికి మాత్రం సరే అని చెప్పకుండా దాటవేయసాగింది. ఆ పాపకు పద్దెనిమిది సంవత్సరాలు నిండసాగాయి.
పున్నమి దగ్గర పడింది. నెమ్మదిగా ఆకాశంలో చందమామ వెలుగులు రోజురోజుకు పెరగసాగాయి. రోజూ ఆ పాప మిద్దె మీద కూర్చొని ఆ చందమామనే తదేకంగా ఆనందంగా చూడసాగింది. తిండి, నీళ్లు కూడా పట్టించుకోవడం మానేసింది. అదిచూసి ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఒకరోజు రాత్రి ఆ పాప పక్కన కూర్చుని "ఏమి తల్లీ! నిద్రపోకుండా పది రోజులుగా ఆ చందమామనే అలా చూస్తా వున్నావు. ఏమైంది" అన్నారు.
అప్పుడు ఆ పాప "నాన్నా... నీకు ఒక నిజం చెప్తా. బాధపడకుండా జాగ్రత్త విను. నాది ఈ లోకం కాదు. అదిగో ఆ కనపడే చంద్రలోకం. అల్లరిచిల్లరగా తిరుగుతూ చిన్నా పెద్దా తేడాలేకుండా అందరితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే చంద్రలోకపు రాజుకు కోపంవచ్చి కొంతకాలం ఈ భూమి మీద జీవించమని శపించాడు. నన్ను పెంచేవాళ్ళకు ఎటువంటి సమస్య లేకుండా రోజుకో బంగారు వరహా దొరికేటట్లు ఏర్పాటు చేశాడు. మరో పదిరోజుల్లో నా శిక్ష పూర్తవుతుంది. చంద్రలోకం నుంచి దేవతలు వచ్చి నన్ను స్వయంగా తీసుకొని పోతారు. ఆరోజు ఎప్పుడెప్పుడు వస్తుందా... తిరిగి నా వాళ్ళను ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఎదురు చూస్తావున్నా" అని చెప్పింది.
ఆ పాప త్వరలో తమకు దూరమవుతుందని తెలిసి పెంచిన అమ్మానాన్న కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. విషయం యువరాజుకు తెలిసింది. వెంటనే చంద్రలోకం నుంచి వచ్చే దేవతలను ఆపడానికి వందమంది వీరుల్ని ఆమెకు కాపలాగా పంపించాడు.
పున్నమిరోజు వచ్చింది. రాత్రి నిండు చందమామ తెల్లని కాంతులు వెదజల్లుతా ఆకాశంలో చిరునవ్వులు నవ్వసాగాడు. భూమంతా పట్టపగలుగా మారిపోయింది. ఆ పండు వెన్నెల కాంతుల్లో బంగారురథంలో దేవతలు భూమి మీదికి వచ్చారు. వెంటనే ఆ పాప చుట్టూ వున్న సైనికులంతా ఎక్కడికక్కడ మబ్బెక్కి పడిపోయారు.
దేవతలు చిరునవ్వుతో ఆ పాపను తమతో పాటు చంద్రలోకానికి ఆహ్వానించారు. ఆ పాప వెళ్ళిపోయేముందు తనను ఎంతో అపురూపంగా పెంచిన అమ్మానాన్నలకు తన గుర్తుగా బంగారంతో అల్లిన వజ్రాల అంచు గల పట్టుచీరను కానుకగా ఇచ్చింది. చంద్రలోకంలో దేవతలు తాగే అమృతాన్ని ఒక బంగారుచెంబు నిండా పోసి తనను ఎంతో ప్రేమించే యువరాజుకు అందించమని, అది తాగితే అతనికి ఎప్పటికీ చావు రాదని తెలిపింది. తల్లిదండ్రులకు వీడ్కోలు చెబుతూ బంగారు రథం ఎక్కి వెన్నెల కాంతుల మధ్య చంద్రలోకానికి వెళ్లిపోయింది.
విషయం తెలిసి యువరాజు చాలా బాధపడ్డాడు. తాను ప్రేమించిన యువతి లేని భూమి మీద తాను ఎక్కువకాలం బతకడానికి అతను ఇష్టపడలేదు. దాంతో తన బాధను తెలుపుతూ ఆ అమృతాన్ని ఆకాశానికి తిరిగి పంపాలి అనుకున్నాడు.
జపాన్ లో చంద్రలోకానికి దగ్గరగా ఉండే పర్వతం ఏదని తన మంత్రులను అడిగాడు. వాళ్ళు శంఖాకారంలో వుండే ఫ్యూజీ పర్వతం అన్నిటికన్నా ఎత్తుగా... మేఘాలను తాకుతూ... చందమామకు దగ్గరగా ఉంటుందని తెలిపారు. దాంతో యువరాజు తనకు కానుకగా ఇచ్చిన ఆ అమృతాన్ని తీసుకుపోయి ఆ కొండ అంచు మీద కాల్చి వేయమన్నాడు. వాళ్లు అలాగేనని ఆ అమృతంతో నిండిన ఆ బంగారు చెంబును తీసుకుపోయి ఆ పర్వతం అంచు మీద అంటించారు.
అది అమృతం కదా... దాంతో అది ఆరిపోకుండా అలాగే మండసాగింది. నెమ్మదిగా ఆ పర్వతం అగ్నిపర్వతంగా మారిపోయింది. అందులోంచి వచ్చే పొగ చంద్రలోకానికి చేరుకుంటూ ఇప్పటికీ యువరాజు ప్రేమను ఆమెకు తెలియజేస్తూనే ఉంది.   
**********
కామెంట్‌లు