రేచీకటి అల్లుడు: -డా.ఎం.హరికిషన్-9441032222-కర్నూలు


  ఒకూర్లో సుంకన్నని ఒకడుండేటోడు. వానికి రేచీకటి... చీకటి పడితే చాలు కండ్లు సరిగా కనబడవు. అందుకని వాడు ఎంత పనున్నా రాత్రిపూట మాత్రం బైటికెక్కడికీ పోయేటోడు గాదు. మట్టసంగా ఇంట్లోనే కూచునేటోడు.
వానికి పెండ్లి వయసొచ్చింది. రేచీకటని తెలిస్తే పిల్లనెవరిస్తారు? అందుకని వాళ్ళమ్మా నాన్నా వానికి రేచీకటని ఎవరికీ చెప్పకుండా మాంచి సంబంధం తెచ్చి పెండ్లి చేసినారు. వానికి ఇంట్లో ఏది ఎక్కడుంది, ఎంతదూరం నడిస్తే ఏమొస్తాది అన్నీ బాగా తెలుసు. దాంతో ఏమాత్రం తడుముకోకుండా అటూ యిటూ మామూలుగానే తిరుగుతా వుంటే చుట్టుపక్కల వాళ్ళకిగానీ, బంధువులకుగానీ కొంచంగూడా అనుమానం రాలేదు.
రోజూ సాయంత్రం ఐదైతే చాలు వురుక్కుంటా, వురుక్కుంటా ఇంటికొచ్చే మొగున్ని చూసి వాని పెండ్లాం “అబ్బ! నా మొగునికి నేనంటే ఎంత ప్రేమ. అందరి మాదిరి ఆడా ఈడా గప్పాలు కొట్టుకుంటా తిరగకుండా పొద్దుగూకుతే చాలు వురుక్కుంటా నాకోసం ఇంటి కొస్తాడు" అనుకోని మురిసిపోయేది.
ఒకరోజు వాని అత్తా మామా దసరాపండుగకు వారం రోజుల ముందరొచ్చి “అల్లుడూ! అల్లుడూ! మీ పెండ్లయినాక ఇదే మొదటి పండగ. నీవు నీ పెండ్లాంతో రేపే మాయింటికొచ్చి వారం దినాలుండాల" అన్నారు. దానికి వాడు వారం రోజులు ఆన్నే వుంటే దొరికిపోతానేమోనని బెదపడి “అదికాదు మామా! వూర్లో నాకు చానా పనులున్నాయి. కావాలంటే నీ కూతుర్ని రేపే తీసుకోనిపో. నేను మాత్రం పండగనాడు వస్తా" అన్నాడు. వాళ్ళు సరేనని తరువాత రోజు పొద్దున్నే కూతుర్ని తీసుకోని పోయినారు. దసరా పండగొచ్చింది. అత్తోళ్ళింటికి పోవాల గదా... దాంతో సుంకన్న పొద్దున్నే లేచి, తలస్నానం చేసి, కొత్తబట్టలేసుకోని, కిర్రుచెప్పులు తొడుక్కోని టకాటకా నడుస్తా బైలుదేరినాడు. వాళ్ళత్తోళ్ళ ఊరికి పొద్దున తప్పిపోతే మళ్ళా సాయంత్రానికి గానీ బస్సుందదు. అందుకని వురుక్కుంటా పోయి బస్సెక్కినాడు.
ఆ ఊరికి రోడ్డు ఏమీ బాగాలేదు. యాడ చూసినా గుంతలు గుంతలే. దాంతో బస్సు ఎగురుతా పూగుతా పోవడం మొదలు పెట్టింది. లోపలందరూ కిందామీదా పడతా వున్నారు. బస్సు సగం దూరం పోయిందో లేదో ఎవడో రోడ్డు మీద పాడేసిన పెద్ద ఇనుప సీల గుచ్చుకోని చక్రం కాస్తా తుస్సుమనింది. దాంతో అందరూ కిందికి దిగినారు. అప్పటికే బస్సు సగం దూరమొచ్చేసింది గదా... దాంతో వెనక్కు పోడానికి లేదు. సుంకన్న “ఏం చేద్దాం ఖర్మ" అని తిట్టుకుంటా పెట్టె నెత్తిన పెట్టుకోని ఊరికి నడుస్తా బైలుదేరినాడు.
వాడు ఎంత బెరబెరా నడిచినా ఆ ఊరి పొలిమేర చేరుకొనే సరికే చీకటి పడటం మొదలు పెట్టింది. దారి సరిగా కన్పించడం లేదు. “ఊర్లోకి ఎట్లా పోవాలబ్బా" అని ఆలోచిస్తా వుంటే పక్కనే బరగొడ్లు పోతా కనబడినాయి. బరగొడ్లు పొద్దునంతా ఊరి బైటి బీడు పొలాల్లో తిని తిరిగి సాయంకాలం కాగానే వాటంతటవే ఊళ్ళోకి చేరుకుంటాయి గదా. అందుకని వాడు ఒకదాని తోక పట్టుకోని దాని వెనకాలనే పోవడం మొదలు పెట్టినాడు.
ఆ బరగొడ్డు అట్లా పోతావుంటే దానికి ఒకచోట ముండ్ల కంపల్లో పచ్చగడ్డి కనబడింది. దాంతో అది దాన్ని తిందామని ఆ ముళ్ళ కంపల్లోకి దూరింది. వీడు గూడా దాని తోక పట్టుకోని అట్లే లోపలికి పోయినాడు. ఒళ్ళంతా ముళ్ళు తగులుకొని గీరుకుపోయింది. పాపం! వానికి బైటికెట్లా రావాల్నో అర్థం కాలేదు. ఎటు అడుగేసినా ముండ్ల కంపలే. దాంతో అటూ యిటూ తిరుగుతా వుంటే అప్పుడే అటువేపొచ్చిన ఊరోడొకడు “ఎవరు నువ్వు? ఎందుకట్లా ముండ్లకంపల్లో తిరుగుతా వున్నావ్" అని అడిగినాడు.
బరగొడ్డు తోక పట్టుకోనొచ్చి ఇట్లా ఇరక్కపోయినానని చెబితే మర్యాద పోతాది గదా! అందుకని వాడు “ఏం లేదు. ఒంటికి పోస్తా వుంటే ఉంగరం జారి పడిపోయింది. యాడ పడిందా అని వెదుకుతా వున్నా" అన్నాడు. “అట్లాగా" అని వాడు కూడా వెదకడం మొదలుపెట్టినాడు. వీడు నెమ్మదిగా వేలికున్న ఉంగరం చేతిలోకి తీసుకోని "ఆ
దొరికింది! దొరికింది!" అంటూ చూపిచ్చి, వానెంబడే నెమ్మదిగా ముండ్లకంపల్లోంచి బైటకొచ్చినాడు.
వాడు మళ్ళా దారి పట్టుకోని నడుస్తా నడుస్తా కొంతదూరం పోయి ఎటు పోవాల్నో అర్ధంగాక దిక్కులు చూస్తా వుంటే అప్పుడే అటువేపుగా వచ్చినోడొకడు “ఎవరు నాయనా నువ్వు? ఏంది వెదుకుతా వున్నావ్. యాడికి పోవాల" అనడిగినాడు. దానికి వాడు “అన్నా! అన్నా! నేను చిన్న రంగన్న చిన్న కూతురి మొగున్ని. దారి మర్చిపోయినా. వాళ్ళింటికి ఎట్లా పోవాల్నో కాస్త చెప్పవా" అనడిగినాడు. దానికి వాడు “చిన్నరంగన్న ఇళ్లే గదా. ఇట్లానే సక్కగా పో... ఒక పది నిమిషాలు నడిచినాక కుడివైపుకు సందొస్తాది. ఆ సందులో మూడోదే మీ మామోళ్ళ ఇండ్లు" అని చెప్పి పోయినాడు.
వాడు నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటా జాగ్రత్తగా నడవసాగినాడు. అట్లా పది నిమిషాలు నడిచినాక కుడివైపు సందొచ్చింది. అటు తిరిగినాడు. అంతకు ముందురోజే ఆ సందులో కొళాయి వేయడానికని పెద్ద గుంత తవ్వినారు. రెండు అడుగులేసినాడో లేదో దభీమని దాంట్లోకి పడిపోయినాడు. గుంత లోతుగా వుండడంతో పైకెట్లా రావాల్నో అర్థంగాక తడుముకోసాగినాడు.
అప్పుడే అటువేపు వస్తావున్న వాడి పెండ్లాం తమ్ముడు గుంతలో నుండి చప్పుడు వస్తావుంటే "ఏందబ్బా? ఏం పడింది. దీంట్లో'' అని తొంగి చూస్తే అక్కమొగుడు కనబడినాడు. వాడు ఆశ్చర్యంగా "ఏంది బావా? గుంతలో ఎట్లా పడినావ్" అనడిగినాడు, పడినానంటే మర్యాద పోతాది గదా... అందుకని వాడు “అబ్బే అదేం లేదు. గుంతలో ఒక చిన్న మేకపిల్ల పడి గిలగిలా కొట్టుకుంటా వుంటే అయ్యో పాపమని దిగి దాన్ని బైటికేసినా" అన్నాడు. ఆ మాటలకు వాడు “మా బావెంత మంచోడు" అనుకోని "పైకి దా బావా!" అంటూ చేయందించినాడు. వాడు పైకొచ్చి బామ్మర్ది ఎంబడే పోయి ఇంటికి చేరుకున్నాడు.
అల్లున్ని చూడగానే అత్తామామా బైటికొచ్చి "ఏందల్లుడూ ఇంత ఆలస్యమైంది. అమ్మా నాన్న బాగుండారా" అంటూ పలకరించినారు. బస్సు చెడిపోయి నడిచొచ్చినేది తెలుసుకోని “అయ్యో పాపం" అని బాధపడి ఇంట్లోకి తీసుకోని పోయినారు.
అల్లుడొస్తున్నాడు గదా, అదీ మొదటి పండుగ గదా... అందుకని వాళ్ళత్త బాగా ద్రాక్షా,జీడిపప్పేసి నెయ్యితో బ్యాళ్ళ పాయసం చేసింది. అల్లుడు అన్నం తిన్నాక పల్లెంలో పాయసం పోయసాగింది. 
పైనుండి పల్లెంలో పాయసం పడతా వుంటే “బళుక్! బళుక్!" అని చప్పుడు రాసాగింది. అది విని వాడు కుక్క ఏదైనా వచ్చి పల్లెం నాకుతుందేమో అనుకోని "థాయ్" అని చేత్తో అట్టనే కొట్టినాడు. చెయ్యి అత్తకు తగిలి సుర్రుమనింది. దాంతో అత్త “ఏంది నాయనా! పాయసం చాలనుకుంటే వద్దనాలగానీ అట్లా కొడితే ఎట్లా" అనింది. "కుక్కనుకోని కొట్టినా" అని చెబితే మర్యాద పోతాది గదా... అందుకని వాడు "అది కాదత్తా! బ్యాళ్ళ పాయసమంటే నాకు చానా చానా అసహ్యం. అందుకే పోస్తావుంటే వద్దని ఆపబోతే తొందరలో చేయి గట్టిగా తగిలింది. ఏమనుకోవద్దు" అన్నాడు. ఆమె "సరే" అని పాయసం గిన్నె తీసేసింది.
అన్నం తిని గదిలో వండుకున్నాక పెండ్లాం వచ్చి పక్కన కూచోని “బ్యాళ్ళ పాయసం ఎందుకు తినలేదు? అమృతం లెక్క ఎంత బాగుందో తెలుసా. మా అమ్మ నీ కోసమని బాగా నెయ్యేసి, జీడిపప్పేసి కష్టపడి చేసింది" అనింది. ఆ మాటలింటానే వానికి నోట్లో నీళ్ళూరినాయి.
రాత్రి అందరూ పండుకున్నాక నెమ్మదిగా లేసి బ్యాళ్ళ పాయసం తిందామని తలుపు తీసుకోని బైటికొచ్చినాడు. వానికి వంటగది ఎక్కడుందో అర్థంకాక వెదుకుతా పోతావుంటే వాళ్ళత్త పడుకున్న మంచం ఠకీమని తగిలింది. దాంతో ఆమె అదిరిపడి లేచి చూస్తే ఎదురుగా అల్లుడు కనబడినాడు. ఆమె “ఏందల్లుడూ ఇంత రాత్రిపూట ఇట్లా వచ్చినావు" అనడిగింది. పాయసం కోసం వచ్చినానని చెబితే మర్యాద పోతాది గదా... అందుకని వాడు “ఏం లేదత్తా! రాత్రి పాయసం పోసేటప్పుడు పొరబాటున చేయి తగిలింది. నేను కావాలని కొట్టలేదు. నన్ను మన్నించు" అని కాళ్ళ మీద పడినాడు. దానికామె "నా అల్లుడెంత మంచోడు" అనుకోని “లేదులే నాయనా! నేనేమీ అనుకోలేదులే! అల్లుడంటే కొడుకులాంటోడు. పో...పోయి నువ్వు పండుకోపో" అని పంపిచ్చింది. వాడు మట్టసంగా మరలా గదిలోకి వచ్చేసినాడు.
వానికి ఎంత పడుకుందామన్నా నిద్ర రాలేదు. మాటిమాటికీ బ్యాళ్ళ పాయసమే గుర్తుకు రాసాగింది. దాంతో ఒక గంట దాట్నాక మల్లా లేచి గొంగలి కప్పుకోని నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటా వంట గదిలోకి పోయినాడు. ఒక్కొక్క గిన్నే వాసన చూస్తా పాయసం గిన్నె అందుకోని లోపలికి చేయి పెడితే ఇంకేముంది... అడుగు తప్ప ఏమీ లేదు. సరే కనీసం ఇదైనా దొరికింది గదా అనుకోని గిన్నెలోకి తల దూర్చి నున్నగా నాకేసినాడు. అట్లా అంతా నాకేసినాక తల తీయబోతే రాలేదు. గిన్నెలోనే ఇరుక్కోని పోయింది.
వానికసలే కండ్లు సరిగా కనబడవు. మళ్ళా ఇదొకటి. దాంతో వాడు దాన్ని పీక్కోడానికి కిందామీదా పడతా వుంటే కాళ్ళకూ, చేతులకూ అంట్ల గిన్నెలన్నీ తగిలి ధనాధనా కిందబడినాయి. ఇంట్లో నిద్రపోతావున్న వాళ్ళంతా వులిక్కిపడి లేచి వురుక్కుంటా వచ్చి చూస్తే ఇంకేముంది ఒళ్ళంతా గొంగలి కప్పుకోని వీడు ఎగురుతా కనబడినాడు.
ముఖం కనబడడం లేదుగదా... దాంతో వాళ్ళు దొంగోడేమో అనుకోని ఒక్కసారిగా మీదపడి పట్టుకొని స్తంభానికి కట్టేసి కట్టెలతో మెత్తగా తన్నినారు. వీడు లబోదిబోమని ఎంతరచినా గిన్నె అడ్డముంది గదా దాంతో ఎవరికీ ఏమీ వినబళ్ళేదు. అంతలో వాళ్ళ బామ్మరిది  "వీని మొగం చూద్దాం" అని గిన్నె పట్టుకొని గట్టిగా ఒక్క పెరుకు పెరికినాడు. అంతే... ఇంకేముందీ అల్లుడు కనబడి అందరూ అదిరిపడినారు.
"నువ్వా అల్లుడూ! ఎంత పని జరిగిపోయింది" అంటూ బెరబెరా కట్లు విప్పి "ఏం జరిగింది" అనడిగినారు. ఇక వాడు “ఇట్లాగే దాచిపెడితే ముందు ముందు ఇంగెన్ని కష్టాలు వస్తాయో ఏమో" అనుకోని భయపడి మట్టసంగా తనకు రేచీకటి వున్న సంగతంతా చెప్పేసినాడు.
**********
కామెంట్‌లు