"మా సుందర శ్రీకాకుళం": - ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు (ఋష్యశ్రీ) సారవకోట -చరవాణి: 9490904976; 6281474957


మా సుందర శ్రీకాకుళం 
మహనీయుల శ్రీకాకుళం..

చికాకోల్, శిఖాకోల్
సిక్కోలు నీ పూర్వనామము..
చివరకు రూపాంతరమైనావు శ్రీకాకుళము..
చిట్టచివర జిల్లాగా నీ స్థానము..
చరితలో నిలవాలి నీ ప్రస్థానము..

విశాఖపట్టణం నుండి విడబడ్డావు..
విజయనగరానికి వెన్నంటే పక్కనున్నావు..
విభిన్న సంస్కృతులతో విలసిల్లావు..

ఉత్కళాంధ్రలో ఒకప్పుడున్నావు..
ఉత్తరాంధ్రకు ఉత్తర దిక్కునున్నావు.
ఉద్యమాలకు ఊపిరిగానున్నావు..

శ్రీకారం, ఓంకారం తోనే ప్రారంభం.
శ్రీతో ముడిపడి ఉన్నాయి,
శివ,వైష్ణవ శుభ క్షేత్రాలు..
శ్రీకరుడు శుభకరుడు ఉన్న శ్రీకూర్మం .
శ్రీముఖలింగంలో శంకరుడు..
శ్రీ సూర్యనారాయణ స్వామియే దివాకరుడు, 
శ్రీకాకుళానికి సమీపాన అరసవల్లిలో.

బౌద్ధ స్థూపాల శాలిహుండం.
బ్రిటీష్ ఓడరేవు కళింగపట్నం..
బారువ సముద్ర తీరం..
బహు సుందర ప్రదేశాలు..

వళి రవళి పరవళ్ళు తొక్కుతూ పొంగింది..
వంపు సొంపుల నాగావళి..
వయ్యారంగా ప్రవహించే వంశధార. 
వంశధారకు  ఉపనదైన మనసును దోచే మహేంద్రతనయ..

నదులు ప్రవహించి
నరులకు నీటిని అందించే నీటివనరులు.
వేలాది ఎకరాలకు సాగునీరు అందించే
వంశధార రిజర్వాయర్..
నేరడి బ్యారేజి నవ నిర్మాణానికి  శ్రీకారం..
నేరేడువలస సంత సామాన్య జనులకు చవకగా వస్తువులు లభించే గురువారపు సంత..

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన
పొందూరు ప్రఖ్యాత ఖద్దరు..
అలికాం జాందానీ చేనేత చీరలు..
కొరసవాడ నేత కోకలు..
ప్రత్యేక వస్త్రాలకు పెట్టింది పేరు..

కష్టించే మనుషులు
కల్లా కపటం తెలియని మనుషులు 
కరుణ ఉన్న మనుషులు.

మనసున్న మనుషులు
మాయా మర్మం తెలియని మనుషులు
మా శ్రీకాకుళం జిల్లా మనుష్యులు..

శ్రమను నమ్ముకుని ముందుకు సాగే ప్రజల తీరు..
శ్రీకాకుళం నేర్పిన జీవన స్పూర్తి ఘనతే వేరు.

మా జిల్లా ప్రత్యేక రుచులు
సారవకోట స్పెషల్ చుప్పులు.. 
పలాస పసందైన జీడిపప్పు.  
మందస మెత్తని పాలకోవా..
మళ్ళీ మళ్ళీ తినాలనిపించే మధుర రుచులు..

ఎందరో ప్రముఖుల పుట్టినిల్లు.
త్యాగధనుల మెట్టినిల్లు..
సర్దార్ గౌతు లచ్చన్న, చౌదరి సత్యన్నారాయణ,
పుల్లెల శ్యామ సుందర్ వంటి
ఎందరో సమర యోధుల సొంతిల్లు..
దేశ సేవకై సిపాయిలుగా చేరేందుకు
సిద్ధపడే భరతమాత ముద్దు బిడ్డలు.
సంగీత, సాహిత్య, క్రీడాకారులు
మెరిసిన వెల్లివిరిసిన సుందర గడ్డ.

మా సుందర శ్రీకాకుళం..
మహనీయుల శ్రీకాకుళం..

కామెంట్‌లు