అమ్మా!" " అమ్మా!"
బడినుంచి వస్తూనే హడావిడిగా అరుస్తూ పిలిచింది చిన్నూ.
"ఏంటమ్మా, ఎందుకలా కంగారుగా పిలుస్తున్నావ్."
"నెనీరోజొక కొత్త విషయం తెలుసుకున్నా నమ్మా."
"ఏంటమ్మా.?"
"మరే,... చెట్లకు కూడా ప్రాణం ఉంటుందట."
"అవునా.!"
"అవునమ్మా, అవీ మనలాగే బాధపడతాయి, సంతోషపడతాయిట."
"అమ్మా, ఈరోజు మాకు సోషల్ టీచర్ రానందుకు ఆ పీరియడ్ లో తెలుగు టీచర్ వచ్చారమ్మ .
మామూలుగా అయితే అందరం బాగా అల్లరి చేసే వాళ్ళం, కానీ ఈరోజు టీచర్ చెప్పేది వింటూ మేమంతా ఏడ్చేశాం."
"ఎందుకంత బాధయింది నాన్నా..."
"మరేమో టీచర్ కరుణశ్రీ గారు వ్రాసిన పుష్ప విలాపం గురించి చెప్పారు., దాంతో పువ్వులు మనం కోస్తుంటే ఎంత బాధ పడతాయో తెలిసివచ్చింది."
చిన్నూ వాళ్ళమ్మ ఒళ్ళో ఒదిగి కూర్చుంటూ చెప్పింది.
" పువ్వులు కూడా ఇలాగే వాళ్ళమ్మ కొమ్మల వొడిలో కూర్చుని ఉయ్యాలలూగుతాయట. మనం వాటిని తెంపితే అమ్మ వొడిలోంచి తీసుకెళ్లిపోతున్నామని ఏడుస్తాయట."
"అమ్మా, ఇంకెప్పుడూ మనింట్లో చెట్టుకి ఉన్న పూలు తెంపొద్దమ్మా, అలాగే ఉందనిద్దామమ్మా,."
" అలాగే చిన్నూ, పూలు మొక్కలకే ఉందనిద్దాం. సరేనా, " తలవంచి చిన్నూని ముద్దు పెట్టుకుంటూ చెప్పింది అమ్మ.
" అంతేకాదమ్మా ఇలా పూలల్లి తలలో కూడా పెట్టుకోవద్దు, దారంతో వాటి గొంతుకి ఉరి బిగించినట్టవుతుందట. "
" సరే తల్లీ ఇప్పటినుంచి పూలు తెంపను, మాల కట్టను, చెట్టుకింద శుభ్రమైన బట్ట పరిచి రాలిన పూలనే దేవునికి పెడతాను, సరేనా".
" ఊ ".
" నా బంగారు కొండ, ఇకనైనా కాళ్ళూ మొహం కడుక్కుని రా, టిఫిన్ తిందువుగానీ", చిన్నూ తలపై ముద్దుపెడుతూ అన్నది అమ్మ.
చిన్నూ ఫ్రెషప్ అవడానికి ఇంట్లోకెళ్లింది.
అమ్మ మాత్రం పెరట్లోని మల్లెచెట్టును చూసింది. చిరుగాలికి మెల్లగా ఊగుతున్న పూలు ఆమెకు చిన్నూ నవ్వులా కనిపించాయి.
ఆ క్షణం నుంచి ఆ ఇంట్లో పూలను తెంపడం ఆగిపోయింది.
'కరుణ ' అనేది పుస్తకాల్లో చదివే పాఠం కాదు. ఒక చిన్నారి మనసులో పుట్టి, ఒక కుటుంబ జీవనవిధానాన్ని మార్చే వెలుగు.
*** ***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి