రాధాకృష్ణులు: - యామిజాల జగదీశ్


 కృష్ణుడి ప్రేమలో విరహం... ఇది అందరికీ దక్కే అదృష్టమా?
ఈ భూమిపై కృష్ణుడి ప్రేమలో తడిసి, ఆయనకు దూరమయ్యామనే బాధను గుండె లోతుల్లో అనుభవించినవారు ఎంతమంది ఉంటారు?
కృష్ణ ప్రేమ అనేది అంత తేలికైన విషయమా?
కానే కాదు... ఆ ప్రేమను పొందడం అంత సులభం కాదు.
ఎందుకంటే కృష్ణుడు మనకు కేవలం సంతోషాన్ని ఇవ్వడానికి మాత్రమే రాలేదు. మన హృదయాన్ని పరిపూర్ణంగా పవిత్రం చేయడానికి వచ్చాడు. 
ఒక చిన్నారి... తన పేరు మాధవి
జీవితం ఆమెకు మళ్లీ మళ్లీ అదే గుర్తుచేస్తూ వచ్చింది:
"ఈ ప్రపంచంలో ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు."
సొంత కుటుంబం చూపిన నిర్లక్ష్యం, సమాజం విసిరిన చేదు మాటలు, మనుషుల ఎత్తిపొడుపులు, చుట్టూ ఉన్నవారి చెడు సలహాలు... ఇవన్నీ కలిసి ఆమె చిన్న మనసులో నమ్మకాన్ని తుడిచేశాయి.
జనాలు ఆమెతో అన్నారు: "నీవల్ల ఏమీ కాదు....నీ జీవితంలో మంచి అనేది జరగదు...ఇన్ని కష్టాల్లోనూ నువ్వు ఎలా నవ్వగలుగుతున్నావు?"
మాధవి ఎవరికీ సమాధానం చెప్పలేదు.
ప్రతి సాయంత్రం ఒక చిన్న కృష్ణుడి విగ్రహం ముందు ఒంటరిగా కూర్చునేది. చేతులు జోడించి ఆమె అడిగే ఒకే ఒక్క మాట :
"కన్నా... నాకు ఏమీ వద్దు. నువ్వు మాత్రం నా చేయి ఎప్పుడూ వదలకు."
ఒక రోజు…
ఒక పెద్ద కష్టం ఆమె మనసును తీవ్రంగా గాయపరిచింది.
కృష్ణుడి ముందు నిలబడి కళ్లనీళ్లతో ఆమె నిలదీసింది:
"నువ్వు నిజంగా నావాడివే అయితే... నన్ను ఎందుకు ఇంత ఒంటరిని చేశావు?"
ఆ రోజు ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
గుడిలోని దీపం మాత్రం గాలికి మెల్లగా ఊగింది.
మాధవి అనుకుంది: "కృష్ణుడు కూడా నన్ను వదిలేశాడా..."
మరుసటి రోజు నుంచి కృష్ణుడికి తన బాధలు చెప్పుకోవడం ఆపేసింది.
కానీ ఒక వింత జరిగింది.
తన్ను బాధపెట్టిన వారి కోసం కూడా ఆమె ప్రార్థించడం మొదలుపెట్టింది.
తనను అవమానించినవారు బాగుండాలని కోరుకుంది.
తనను తక్కువ చేసి చూసినవారి కోసం కూడా ఇలా అంది:
"కన్నా... వారి మనసుకు కూడా కాస్త ప్రశాంతతను ఇవ్వు." 
కృష్ణుడు కష్టాన్ని దూరం చేయలేదు...
రోజులు గడిచాయి. ఒక రోజు మాధవికి ఒక నిజం అర్థమైంది. కృష్ణుడు ఆమె కష్టాన్ని దూరం చేయలేదు… ఆ కష్టానికి ఉన్న అర్థాన్నే మార్చేశాడు!
ఒకప్పుడు తన కోసం ఏడ్చిన అవే కళ్లు, ఈ రోజు కృష్ణుడిని తలుచుకుని ఏడుస్తున్నాయి.
ఆ కన్నీళ్లలో ఇప్పుడు ఎలాంటి ఫిర్యాదు లేదు.
ఉన్నదల్లా ఒక్కటే... కృష్ణుడిని చేరుకోవాలంటే తపన. 
కృష్ణుడి పాదాలను పట్టుకుని మాధవి ఇలా అంది:
"స్వామీ... ఈ రోజు నాకు అర్థమైంది. నువ్వు నన్ను ఒంటరిని చేయలేదు. ఈ ప్రపంచపు నకిలీ తోడుల నుంచి నన్ను దూరం చేసి, నీ పాదాల నీడలోకి తీసుకువచ్చావు." 
రాధ విరహం చెప్పే రహస్యం
అందుకే రాధా-కృష్ణుల ప్రేమ అంత ఉన్నతమైనది.
రాధ చూపిన ప్రేమ మనకు ఒక నిజాన్ని నేర్పుతుంది:
కృష్ణుడిని పొందిన ఆనందం కంటే, కొన్నిసార్లు ఆ కృష్ణుడి విరహమే మనిషిని ఆయన ప్రేమలో ఇంకా లోతైన స్థితికి తీసుకెళ్తుంది.
రాధాకృష్ణులు ఈ భూమిపై ప్రేమ నిజమైన అర్థాన్ని నేర్పడానికి వచ్చారు.
ఆ ప్రేమ ఆశించి అడిగేది కాదు.
ఏది నిరీక్షించని స్వచ్ఛమైన ప్రేమ.
కష్టాల్లో సైతం దేవుడిని వెతికేలా చేసే ప్రేమ. 
మీ జీవితం ఈ రోజు చీకటిగా ఉంటే...
మనసు పాడుచేసుకోకండి.
కృష్ణుడు మీ జీవితంలోంచి వెలుగును తీసేయలేదు.
ఆ చీకటి దారిలోనే తన వెలుగును మీరు తెలుసుకునేలా మార్గం చూపిస్తూ ఉండవచ్చు. 
కృష్ణుడి విరహాన్ని అందరూ అర్థం చేసుకోలేరు.
ఇప్పుడు…
ఒక్కసారి నిజంగా కృష్ణుడిని హృదయంలో నింపుకున్నవారి కంటి నీరు కూడా ఒకరోజు ప్రార్థనగా మారిపోతుంది. 
"హే శ్యామసుందరా... హే నాథా... నువ్వు నా పక్కనే ఉన్నా, నాకు దూరంగా ఉన్నా, నా మనసు నుంచి మాత్రం ఎప్పటికీ దూరం కాకు."
కామెంట్‌లు