కృతజ్ఞత: - :పాలగుమ్మి జ్యోతి.
      

    అదొక రకరకాల పళ్ళు,పువ్వుల చెట్లు ఉన్న అందమైన ఉద్యానవనం. ఆ పళ్ళు,పువ్వులకోసం ఇంకా అక్కడ ఆడుకోవడానికి పిల్లలు రోజూ  వస్తూ ఉంటారు. చెట్లపై వాలే రకరకాల పిట్టలను, సీతాకోకచిలుకలను  చూసి మురిసిపోతూ ఉంటారు.  ఎప్పటిలాగానే ఉద్యానవనంలో ఆడుకోవడానికి వెళుతున్న పిల్లలలో "దయచేసి నన్ను కాపాడండి!" అన్న మాటలు విన్న రాము ప్రక్కనే ఉన్న సోముతో "సోమూ!నన్ను కాపాడండి అన్న మాటలు నీకు వినిపించాయా?" అని అడిగాడు. సోము "లేదు" అని అంటూ ఉండగానే మరలా" పిల్లలూ! దయచేసి నన్ను కాపాడండి" అన్న మాటలు వినిపించాయి. "ఒరేయ్! ఎవరో ఆపదలో ఉన్నారు! కాపాడమని వేడుకుంటున్నారు! అందరూ ఇక్కడ ఉన్న పొదలు, చెట్లు వెతకండి"  రాము మిగతా మిత్రులతో అన్నాడు. అందరూ వెతకడం మొదలుపెట్టారు.
               ఒక ముళ్ళ పొదలో చిక్కుకుపోయి బయటకు రాలేక బాధపడుతూ నెమలి కనిపించింది. అరవింద్ నెమలిని చూసి "ఇదిగో! ఇదే పాపం! ముళ్ళపొదలలో చిక్కుకొని బయటకు రాలేక అరుస్తోంది"  నెమలిని చూపిస్తూ అన్నాడు. "పిల్లలూ! నా పేరు మయూరాక్ష. నేను ఆపదలో ఉన్నాను! ఈ ముళ్ళన్నీ నా శరీరాన్ని గుచ్చి గాయపరుస్తున్నాయి. ఇందులోంచి తప్పించుకుని బయట పడలేకుండా ఉన్నాను. దయచేసి నన్ను కాపాడండి" గాయాల బాధతో కన్నీరు కారుస్తూ అంది మయూరాక్ష.
          " రాము, సోము ఈ ముళ్ళు  మనకు గుచ్చుకుని గాయాలు అవుతాయి. వెళ్ళిపోదాం పదండి" అన్నాడు అరవింద్. "తప్పురా అరవింద్! ఆపదలో ఉన్నవారు సహాయం కోరినప్పుడు మనకు  చేతనైనంత సాయం  చేయాలని మా అమ్మ చెప్పింది. మనం మొత్తం పదిమంది ఉన్నాము. జాగ్రత్తగా ఈ ముళ్ళని తీస్తే,పాపం! ఆ మయూరాక్ష బయటికి వస్తుంది"అన్నాడు రాము. "అవునురా అరవింద్! అందరం కలిసి దానిని కాపాడుదాం" జాలిగా మయూరాక్షని చూస్తూ అన్నాడు అజయ్. 
             పిల్లలంతా  చాలా నేర్పుగా ముళ్ళని తొలగించడం మొదలుపెట్టారు." పిల్లలూ!జాగ్రత్త! నన్ను కాపాడబోయి మీరు గాయాల పాలైతే నాకు బాధగా ఉంటుంది" అంది మయూరాక్ష.  "పరవాలేదు, మేము జాగ్రత్తగానే తీస్తాం" అన్నాడు సోము. ముళ్ళు తొలగించిన తర్వాత మయూరాక్ష బయటపడింది. మయూరాక్ష ఒంటికైన గాయాలను  అక్కడే ఉన్న ఆకులతో పిల్లలు శుభ్రం చేశారు. "పిల్లలూ! మీరు చేసిన మేలు మర్చిపోలేను! మీకు నా నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం కదా!  మీరు మీ పుస్తకాల్లో వాటిని ఎంతో పదిలంగా దాచుకుంటారని నాకు తెలుసు. అందుకే  నాకు మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతగా నా నెమలిపించంలోని ఈకలను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున ఇస్తాను" అని తన పించంలోంచి ఈకలను పిల్లలకు ఇచ్చింది మయూరాక్ష.
          పిల్లలంతా ఆ నెమలి ఈకలు చూసి భలే సంబరపడిపోయి చప్పట్లు కొట్టారు. మయూరాక్ష  పిల్లలకు కృతజ్ఞతతో వీడ్కోలు చెప్పి,అక్కడ నుంచి ఎగిరి వెళ్ళిపోయింది. 
              +++++++++++++++++++++++++++++++++++++++++++++++
నీతి :ఆపదలో ఉన్న వారు అడిగినప్పుడు మనకు చేతనైనంత సాయం చేయాలి.
కామెంట్‌లు