సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 

 సామెత -316: -ఇస్తినమ్మ వాయనం - పుచ్చుకుంటినమ్మ వాయనం

"ఓ అవ్వా!గిదిన్నవా?మొన్నేదో పేటల పంచనయ్యిందంట. గక్కడికి బొయ్యొచ్చిన కానించి మా ఇంటి పక్కన రోషమ్మత్త సణుగుడంటే సణుగుడు గాదుపో!గాళ్ళ సుట్టాలింట్ల పంచెనెట్ల జర్గిందో తెల్సుకుందమని నిన్న మాపటీలి పనైనంక బోయిన. నేనెల్లే తల్కి మావఁ మీద అరుత్తుంది. మావేఁమో త్యేపకో పాలి  ఊకూకెనే ఎందుకట్ల అరుత్తవు.పంచెన్కి బొయ్యొచ్చిన కానించి నీకేమన్న దెయ్యం ,బూతం బట్టిందా? ఉన్నట్టుండి నా మీద ఇర్సుక బడుతున్నవ్" అంటుండు.నా అల్కిడిని ఆపి "రా కోడలా రా !" అని లోపల్కి పిల్శింది."
 "ఏందత్తా! పంచెనెట్లైంది"అనంగనే మూతి మూడొంకలు తిప్పి "మాగనే అయ్యిందని" మారు మాట శెప్పకుండా ఊల్లె ముచ్చెట్లు అడ్గుడు మొదలు వెట్టింది. జెర సేపుండి వొచ్చిన. నేను గిట్లొచ్చి ఇంటెన్క ఉత్కిన గుడ్డలు తియ్య బోతే మల్ల అత్త మాటలు యినబడితే గోడసాటునుండి యిన్న. ఇంటెన్కాలకొచ్చి"గిదేం మరియాద.గిట్ల జేసుడేంది? ఒక్కొక్కల్ని సూత్తుంటె తెల్వట్లేదాను.ఏం మడుసులు? ఏం మడుసులు పంచెనెంత మాగ శెత్తేముంది?గాల్ల వైబోగం సూపిచ్చుకునే తానికి పిల్శినారు.వొచ్చినోళ్ళకి అందర్కొక్క తీర్గ మరియాద శెయ్యాలని తెల్వదాను!" అంటుందవ్వా."
 "గయన్ని యిన్న గని అస్లేం మరియాద తక్వ శేసిర్రో తెల్వకనే నాకు బాయె!"
"అవునా శెల్లే!గింతకీ రోషమ్మత్త సణుగుడెందుకో నేను శెప్పనా?"
 "శెప్పవ్వా! నిన్నన్నించి అత్త రందేందో తెల్వక నేను రంది వడ్తున్న.  అద్దమ్మ రేతిరి గీ యిష్యం యాదికొచ్చి మల్ల నిద్దర్రాలేదంటే నమ్ము!"
"అయ్యో గట్లనా శెల్లే! మన రోషమ్మత్త ఇంట్లె పంచనైనప్పుడు నపరొక్క టీలు డబ్బా, గందుల ఓ బత్తాయి కాయ,ఓ రైక ముక్క,పస్పు కుంకుమ పొట్లాలు ఏశి ఇచ్చింది గద."
 "అవునవ్వా! మన్వరాలికి వొల్లె గట్టిచ్చినప్పుడు అందర్కి ఇచ్చింది.గా టీలు డబ్బా సుత  పప్పో,పందారో పోసుకోడాన్కి బాగుందన్కున్నంగద మనంద్రం. అయిన గని దాన్కి దీన్కి సంవందమేవుందవ్వా!"
"వుందంటే వుంది. లేదంటే లేదు శెల్లే! గయ్యాల మొన్న బొయిన సుట్టపోళ్ళు సూత్కమొచ్చి

 

రాకుంటే దాశి మరీ గాళ్ళకి బంపిందంట."
"అవునవ్వా! బాగ దెగ్గరోళ్ళు రాకుంటే దాశి మరీ యిత్తం గద."
"గదే మరీ! గంత గనం దాశి యిచ్చిన అత్త కండ్లముందే అందర్కిచ్చిర్రట. మన రోషమ్మత్తకి యియ్య లేదంట 'బంతిల వొలపచ్చమోలె శేత్తరా? నేనేమో రాకున్న సుత ఇచ్చిన నాకియ్యొద్దా? గిదేం మరియాద గిట్ల శేత్తరా? గా సుట్టపోళ్ళ కండ్లకి నేను ఆనలేదా?" అన్కుంట ముక్కు శీదుకుంట ,కండ్లనీళ్ళు కొంగుతో తుడ్సుకుంట మొన్న పంచెన్నించి రాంగనే ఇంటికొచ్చి శెప్పింది శెల్లే!"
"ఓష్నీ! గా ఇచ్చే వాయినమెంత? దాని కరీదెంత?యిశాతెంత ?గీ దానికి అత్త గంతగనం ఎల్తిపడుడెందుకవ్వా?  గీ నడ్మల పెండ్లని,పేరంటమని,సావని, బత్కని గిస్మంటి టీలు, గాజు వొత్తవులు ఇత్తనే ఉన్న్రు.ఇంటినిండ గయ్యే. యియ్యకపోతె ఏమాయె.గా దాన్కి గంత గనం బాదవడాల్నా శిత్రం గని!"
"ఇగ్గో శెల్లే! గది గింతది గంతదని గాదు. "యిస్తినమ్మ  వాయనం - పుచ్చుకుంటినమ్మ వాయనం" అని ఎదుటోళ్ళకి మనం యిచ్చినప్పుడు గాళ్ళు సుత యియ్యాలె గద అన్నది ముక్కెం.గందుకే పేద్ద అవుమానమైనట్టు మన రోషమ్మత్త బాదవడ్తున్నది."
 "గంతేనంటవా అవ్వా!"
"అవును శెల్లే! నువ్వొకల్కి ఆపదల సాయం శేసినవన్కో. మల్ల నీ అవుసరానికి గాళ్ళు సాయం జెయ్యక పోతే బాదవడ్తవా? పడవా? గిది సుత గంతే శెల్లే!"
గదండీ సంగతి! "ఇస్తినమ్మ వాయనం-పుచ్చుకుంటినమ్మ వాయనం" సామెతల ఉన్న అర్తం గిదే. గిట్లనే ఉంటయి మానవ సంవందాలు. కొందరు గిట్ల రోషమ్మత్తొతికె ఏడ్సుడో ఇంకొందరు బండవల్గ సాపిచ్చుడో ఉంటది.జెర పంచెన్లు సేశేతప్పుడు గియ్యి యాది మరవకుర్రి."
కామెంట్‌లు