నిద్రపోయే ముందు, ఆ రోజటి ముచ్చట్లతో మనసు సాగించే మౌన సంభాషణల అంతరంగమే ఈ డైరీ!మనసు మోసిన బరువులను...రాసిన చేతులు...దించేస్తాయి ఈ దిగులు తీర్చే అరుగుపై....మనసనే జల్లెడలో వడకట్టిన క్షణాలు...కాగితాలపై కనిపిస్తాయి...కొద్దిపాటి వరుసల్లో.
కొన్నిసార్లు ఆ జల్లెడలో మిగిలినవి...వాటిని దాటి తపించినవి....రాస్తున్నప్పుడు...కాళ్లకు సంకెళ్లు వేసి కట్టేసే సంఘటనలు కొన్ని....అందెల రవళితో ఆటలాడించేవి కొన్ని....ఇతరులతో పాటు మనకు కూడా మన ఉనికిని చూపేవి కొన్ని.
పువ్వును తాకినట్టు మృదువైనవి కొన్ని.
అనుకోకుండ నిప్పును తాకినట్టు కొన్ని.
ప్రతి అక్షరంలో
అనుభవం పండి వికసిస్తుంది!
దోరగా పండి రాలే పండులా!
రక్తం కార్చే గాయాల్లో నాని, మానిన మచ్చల నునుపులో జారి...తొలగిపోయే కొన్ని బాధలు...
పదాలు నిలుస్తాయి దినచర్యలో...రాత పూర్తయ్యాక...హత్తుకుంటుంది హాయైన నిద్ర.
దుఃఖం తన్నుకొచ్చి రాలిన కన్నీళ్లకు ఆశ్రయమిచ్చిన దిండు!
కొన్ని రాత్రుల్లో తడిసిపోతుంది!
పొరపాటున నేను చేసిన తప్పులను నా రాత మన్నిస్తుందిఈ డైరీలో.
శూన్యం నిండిన మనసును...బయటపెడుతుంది ఖాళీ కాగితం....పొంగిపొర్లిన భావాలకు చాలదు ఒక్క కాగితం! ఆలోచనను బంధించే యత్నంలో ఎన్నో నిమిషాలు గడిచిపోతుంటాయి.
కొన్ని జ్ఞాపకాలను నీలి సిరాతో చిత్రీకరించడం రాక రాతను ఆపేసిన క్షణాలున్నాయి. తొంగిచూస్తే నిండు చందమామకు దోవనిస్తాను కిటికీని వెడల్పుగా తెరచి!
రాసిన రాతలను తాకిన పిల్లగాలి తనతో పాటు తీసుకెళ్తుంది దానికో ప్రతీకను!
ఫోను నుంచి జాలువారే సంగీతం...హద్దుల్లేకుండా నింపుతుంది ఆ గదిని....రాయడానికి అనువుగా తెరిచి ఉంచుతుంది...మనసనే బంధీఖానాను!
అనుకున్నది అనుకున్నట్టు చేసింది! చేసింది...చూసినది చూసినట్టు, విన్నట్టు...రాయడం కుదరకపోవచ్చు, సమాజం ఒప్పుకున్న నియమాలతో అవి పొసగనప్పుడు.
వచ్చి తాకే అలలు మాత్రమే చదివేలా తడి ఇసుక తిన్నెలపై వేళ్లతో రాసిన రహస్యాలు...నిశ్శబ్దంలో, ప్రశాంతతలో...దాక్కునే క్షణాలను, మబ్బుల్లో తేలియాడి చల్లిన ఆశలను, నిద్రలో అటు ఇటు దొర్లే ఆలోచనలను, లైట్లు ఆర్పేశాక కూడా వెలిగే జ్ఞాపకాలను ఏమని రాయను ఈ డైరీలో ?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి