రాజశేఖర్ హాల్లో కూర్చుని, టీవీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు. ఆయన పన్నిండేళ్ళ మనవడు సుభాష్, మొబైల్లో గేమ్ ఆడుతున్నాడు.
"సుభాష్! ఇరవై నిమిషాలుగా మొబైల్లోనే ఉన్నావు. ఈ రోజు ఎంత గొప్ప రోజో తెలుసా నీకు?" అని అడిగాడు, కాస్త అసహనంగా, తాతయ్య.
"తాతా! ఈ రోజు మాకు సెలవు రోజు. మనమింకేం చేయాలి? ఆడుకోవడం తప్ప!" అని, మొబైల్ నుండి తల తిప్పకుండా సమాధానం చెప్పాడు.
"కేవలం సెలవు రోజా సుభాష్?! ఈ రోజనేదే లేకుంటే నువ్వు, నేను, మనమెవ్వరం ఇలా ఉండేవాళ్ళం కాదు. నీవు పుట్టిన భూమి, నీ గుర్తింపు - ఇవేవీ కూడా ఉండేవి కావు!" అన్నాడు అయన, తన అసహనాన్ని దాచుకుంటూ.
"అదేంటి తాతా? నాకేమీ అర్థం కావడంలేదు. వివరంగా చెప్పు!" అన్నాడు సుభాష్. అయిష్టంగానే మొబైల్ పక్కకు పెట్టి, ఆయనకు దగ్గరగా జరిగాడు.
"1947 ఆగస్టు 15వ తేదీ రాత్రి 12 గంటలకు, మన దేశం స్వతంత్రం పొందింది. కానీ, ఆ స్వతంత్రం వచ్చింది కేవలం ఒక్కరోజులో కాదు. అది వందల సంవత్సరాల పోరాటం ఫలితం."
"వందల సంవత్సరాలా? అంత సేపు ఎలా పోరాడారు?" అని, ఆశ్చర్యంగా అడిగాడు సుభాష్
"సుభాష్! స్వతంత్రం అంటే కేవలం రాజకీయ విముక్తి మాత్రమే కాదు. అది మనస్సు విముక్తి, ఆత్మవిముక్తి. మనం ఎవరో, మన సంస్కృతి ఏమిటో గుర్తుంచుకోవడం కూడా స్వతంత్రం" అని, చెప్పుకుంటూ వచ్చాడు తాతయ్య.
"నీకు రాణి లక్ష్మీబాయి గురించి తెలుసా?" అడిగాడు.
"అవును తాత, చరిత్ర పుస్తకంలో చదివాను. కానీ అది కేవలం పరీక్షల కోసం మాత్రమే చదివాను." అన్నాడు సుభాష్.
"కేవలం పరీక్షల కోసమా? ఆమె తన పసిపిల్లవాణ్ణి వీపున కట్టుకుని యుద్ధం చేసింది. తన మాతృభూమి కోసం ప్రాణాలను అర్పించింది. ఆమె చివరి మాటలు తెలుసా? 'మేరీ ఝాన్సీ నహీ దూంగీ!' - నా ఝాన్సీని ఇవ్వను అని!" అని చెప్పాడు తాతయ్య.
"వాహ్! అంటే ఆమె తన బిడ్డతో పాటు యుద్ధం చేసిందా? సరిగా గుర్తులేదు తాతా" అన్నాడు, కాస్త ఆసక్తిగా.
"అవునురా నాన్నా! మాతృత్వం మరియు వీరత్వం ఒకేసారి! అలానే మన తెలుగు వీరుడు అల్లూరి సీతారామరాజు. అడవుల్లో గిరిజనులతో కలిసి స్వతంత్రం కోసం పోరాడాడు" అన్నాడు.
"తాతా! వారిలో అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది?" ఇంకాస్త ఆసక్తిగా అడిగేసరికి, "స్వతంత్రం అంటే వారికి కేవలం ఒక పదం కాదు. అది వారి ఊపిరి, వారి కల, వారి ఆత్మ. వారు తమ కోసం జీవించలేదు - దేశం కోసం, భవిష్యత్ తరాలవారి కోసం జీవించారురా" అని బదులిచ్చారు.
"అంటే మన కోసమేనా తాత ఇదంతా?" అని అడిగాడు ఆ గడుగ్గాయి.
"అవును సుభాష్! మీ కోసం .నువ్వు ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడుతున్నావు. నీ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నావు. నీకు కావలసినట్లుంటున్నావు అంటే ఇదంతా వారి త్యాగాల ఫలితమే!"అన్నాడు తాత.
"తాతా! స్వతంత్రం పొందిన తర్వాత మనం ఏమి సాధించాము?" అని అడిగాడు, సుభాష్.
"చాలా సాధించామురా కన్నా! మనం వైద్య రంగంలో, సాంకేతిక రంగంలో, అంతరిక్ష రంగంలో... ఇంకా అనేక రంగాలలోఎంత దూరం వచ్చామో చూడు. ఇదంతా స్వతంత్ర్యం పొందకపోతే ఉండదు కదా!కానీ..." అని ఆగారాయన.
"కానీ.. ఏమిటి తాత?" అన్నాడు సుభాష్.
"మనం భౌతికంగా స్వతంత్రం పొందాము. కానీ మానసికంగా ఇంకా పూర్తి స్వతంత్రం పొందలేదు. మనలో కొందరు ఇంకా కులం, మతం, మూర్ఖత్వం, స్వార్థం, ప్రాంతం అనే గొలుసులతో బంధించబడి ఉన్నారు" అని, జవాబిచ్చారు తాతయ్య.
"మరి, ఇప్పుడు మనం ఏమి చేయాలి తాత?" అన్నాడు సుభాష్.
"సుభాష్! నీ తరమే మన భవిష్యత్తు. మీరు నిజమైన స్వతంత్రం తీసుకు రావాలి. విద్య ద్వారా, సత్యం ద్వారా, ప్రేమ ద్వారా" అన్నారు ఆయన, ఉద్విగ్నంగా.
"తాతా! నేను ఏం చేయాలో చెప్పండి!"అన్నాడు దృఢసంకల్పంతో ఆ గడుగ్గాయి.
"మొదట నువ్వు నీ దేశ చరిత్రను తెలుసుకో. మన వీరుల గురించి తెలుసుకో. రెండవది... నీ చుట్టూ ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించే దిశగా ఆలోచించు. ఎవరో చేస్తారు అని కాకుండా... నీవేం చేయగలవో ఆలోచించి, ఆచరణలోకి తేవాలన్న మాట" అన్నాడు, తాత.
"నేను ఇంకా చిన్నవాడిని తాత. నేను ఏమి చేయగలను?"అన్నాడు దిగులుగా, సుభాష్.
"చిన్నవాడివా? భగత్ సింగ్ 23 ఏళ్ల వయసులో ఉరిశిక్ష అనుభవించాడు. చంద్రశేఖర్ ఆజాద్ 24 ఏళ్లలో మన స్వతంత్రం కోసం ప్రాణాలను అర్పించాడు. వయస్సు కాదు, సంకల్పమే ముఖ్యం! నీకు ఆ పేరు ఎందుకు పెట్టాననుకున్నావ్?" అని, సుభాష్ చంద్రబోస్ గురించి స్ఫూర్తివంతంగా చెప్పాడు, తాత.
"అలాంటప్పుడు నేను ఎలా మొదలు పెట్టాలో చెప్పు తాతా!" అన్నాడు సుభాష్, తను సిద్ధం అన్నట్టుగా.
"మొదట నీ స్నేహితులందరూ ఒక సమూహంగా ఏర్పడండి. మన దేశం గురించి ఆలోచించండి. పల్లెల్లోకి వెళ్లి, పిల్లలకు చదవడం, రాయడం నేర్పండి. పర్యావరణం కాపాడండి. నిజాయితీగా ఉండండి. దేశం పట్ల అభిమానంతో ఉండండి" అని, దిశానిర్దేశం చేసాడు తాత.
"తాతా, నేను నా స్కూల్‌లో స్వతంత్రం గురించి ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను!" అన్నాడు, చాలా దృఢనిశ్చయంతో, సుభాష్.
"శెభాష్ రా సుభాష్! నువ్వు చెప్పేప్పుడు ఒక విషయం గుర్తుంచుకో - స్వతంత్రం అంటే కేవలం స్వేచ్చ మాత్రమే కాదు, అది బాధ్యత కూడా" అన్నాడు తాతయ్య.
"ఏ బాధ్యత తాతా?" అని అడిగాడు, సుభాష్.
"మన దేశాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత. మన తరువాతి తరాలకు మంచి దేశాన్ని అప్పగించాల్సిన బాధ్యత. అవినీతిని ఖండించి, న్యాయం కోసం పోరాడాల్సిన బాధ్యత. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత... " అని, చెప్పుకొచ్చాడు తాతయ్య.
"తాతా! నేను ఈ మీ మాటలను ఎప్పటికీ మర్చిపోను. నేను నా భవిష్యత్తులో ఏమి చేసినా, మన దేశం గర్వపడేలా చేస్తాను" అన్నాడు, సుభాష్.
"నీలాంటి పిల్లలే మన దేశ భవిష్యత్తు. మన స్వాతంత్ర్య సమరయోధుల ఆత్మలు మీలో కనిపించాలి" అంటూ, ఇద్దరూ మరో చర్చలో మునిగిపోయారు.
ఆ సమయంలో బయట నుండి "వందే మాతరం" గీతం వినబడుతోంది. ఇద్దరూ కిటికీ దగ్గర నిలుచుని జెండాను తన్మయంగా చూస్తూండిపోయారు.
"తాతా! ఈ జెండా మన చరిత్రను, మన కలలను, మన భవిష్యత్తును సూచిస్తోంది అనిపిస్తోంది. నిజమే కదా?!" అన్నాడు, సుభాష్.
"సరిగ్గా చెప్పావు నాన్నా! కేసరి రంగు త్యాగాన్ని, తెలుపు రంగు శాంతిని, ఆకుపచ్చ రంగు వృద్ధిని సూచిస్తాయి. మధ్యలో ఉన్న చక్రం అశోక చక్రం - అది మనకు ఎల్లప్పుడూ ముందుకు సాగమని, ధర్మ మార్గంలో నడవమని చెబుతోంది" అని, వివరించాడు తాతయ్య.
"ఈరోజు నుండి నేను ప్రతిరోజూ ఈ జెండాను చూసి, మన దేశం కోసం ఏదైనా మంచిది చేయాలని గుర్తుచేసుకుంటాను తాతా!" అన్నాడు సుభాష్.
"సుభాష్, నువ్వు కేవలం నా మనవడివే కాదురా! మన దేశపు భవిష్యత్ వారసుడివి. స్వతంత్రం అంటే ఇదే - ఒక తరం తరువాతి తరానికి బాధ్యతలను అప్పగించడం" అన్నాడు తాతయ్య.
ఇద్దరూ కలిసి "జై హింద్" అని సెల్యూట్ చేసారు జెండాకి.
స్వాతంత్య్రం అనేది కేవలం ఒక రోజు గుర్తుచేసుకోవాల్సిన విషయం కాదు. అది ప్రతిరోజూ మనం మన చర్యల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన కృషి ద్వారా కాపాడుకోవాల్సిన అమూల్య వస్తువు. మన వీరుల స్వప్నాలను నెరవేర్చడమే నిజమైన స్వాతంత్ర్య దినోత్సవ వేడుక. అని తెలుసుకున్నాడు సుభాష్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి