కర్ణ పర్వము ప్రథమాశ్వాసము- 364 వ రోజు
ప్రధమాశ్వాసం
సంజయుడు రెండు రోజులు యుద్ధరంగమున పర్యటించి యుద్ధ విశేషములు ధృతరాష్ట్రుడికి చెప్పుటకు హస్థినకు వచ్చి ధృతరాష్ట్రుడికి వర్తమానం పంపాడు. ధృతరాష్ట్రుడు వెంటనే సంజయుని లోపలకు రమ్మని చెప్పాడు. సంజయుడు ధృతరాష్ట్రుడితో " మహారాజా ! రెండు రోజుల పాటు యుద్ధరంగమున పర్యటించి యుద్ధమును చూసి వచ్చాను. నేను చూసినది మీకు విన్నవిస్తాను " అన్నాడు.
ధృతరాష్ట్రుడు కర్ణ దుశ్శాసనుల మరణం గురించి వినుట
సంజయుడు " మహారాజా ! కర్ణుడు అత్యంత పరాక్రమంతో పాండవసేనని చెదరగొట్టాడు. రెండు రోజులు పాండవసేనలను హడలగొట్టి చివరకు అర్జునుడి పరాక్రమానికి తలవంచి అతడి చేతిలో ప్రాణములు విడిచాడు. మదించిన ఆంబోతు పెద్ద పులికి ఆహారమైనట్లు అర్జునుడికి కర్ణుడు బలి అయ్యాడు. పాండవుల పగ చల్లారింది " అని చెప్పి తాను కూడా దుఃఖించాడు. ఒక నిట్టూర్పు విడిచి " మహారాజా ! ఇంకొక విషాద వార్త నీ కుమారుడి ఆశ అడుగంటి పోయేలా భీమసేనుడి చేతిలో దుశ్శాసనుడు హతుడయ్యాడు. భీమసేనుడు నీ కుమారుడి గుండెలు చీల్చి అతడి రక్తము తాగాడు. భీముడు నాడు నిండు సభలో చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. మహారాజా ! మీ వంతు వచ్చిన రాజ్యభాగమును మీరు అనుభవించక దురాశతో పాండుసుతుల రాజ్యం అపహరించ వలెనని మీరు చేసిన అకృత్యములకు ఫలితం అనుభవించక తప్పుతుందా " అన్నాడు.
దుశ్శాసనుడి మరణవార్త నిని ధృతరాష్ట్రుడు మూర్ఛిల్లుట
దుశ్శాసనుడు మరణించాడు అని వినగానే సుయోధనుడు కూడా మరణించాడని తలచి ధృతరాష్ట్రుడు శరీరం కంపించగా మూర్ఛిల్లాడు. అప్పుడు అక్కడకు వచ్చిన విదురుడు సేవకుల సాయంతో ధృతరాష్ట్రుని శయ్యపై చేర్చి శైత్యోపచారాలు చేసారు. కొంతసేపటికి తేరుకున్న ధృతరాష్ట్రుడు తమకు ఈ దుస్థితి కల్పించిన విధిని తిట్టుకున్నాడు. కన్న కుమారులను అదుపులో పెట్టలేని తన అసమర్ధతను నిందించుకున్నాడు. పాండుసుతుల ధర్మనిరతిని, నీతిని మెచ్చుకున్నాడు. ఇంతటి వినాశనానికి కారణమైన శకునిని తిట్టాడు. తరువాత సంభాళించుకుని " సంజయా ! నీవు చెప్పినది సరిగా విన లేదు. సుయోధనుడు క్షేమమే కదా! లేక అతడు కూడా మరణించాడా " అన్నాడు. " మహారాజా ! రెండు రోజుల యుద్ధములో కర్ణుడు అతడి తమ్ములు కుమారులతో సహా మరణించాడు. భీమసేనుడు నీ కుమారుని దుశ్శాసనుడిని సంహరించి అతడి గుండెలు చీల్చి నెత్తురు తాగాడు. ఆ దృశ్యం చూడడానికి అసహ్యంగా, భయంకరంగా ఉంది " అని సంజయుడు చెప్పగానే " ఆపు సంజయా ! ఇక చాలు ఊరుకో నా మనసు కలత చెంది ఉంది. నీ మాటలు వినే స్థితిలో లేను " అన్నాడు ధృతరాష్ట్రుడు. సంజయుడు కొంత సేపు మౌనం వహించాడు. ధృతరాష్ట్రుడు తిరిగి " సంజయా ! నేను అనుసరించిన దుర్నీతి వలన సుయోధనుడి బుద్ధి హీనత వలన ఇలా జరిగింది. నాకు కలిగిన దుఃఖం ఉపశమించడానికి మార్గము కనిపించ లేదు. ఇరు పక్షములలో మరణించిన వారెవరు. జీవించి ఉన్న వారెవరు " అని అడిగాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి