శ్రీరస్తూ శుభమస్తూ ........!!!!: - మిత్రాజి -( గుండవరం ప్రభాకర్ రావు పంతులు )


 “చూడండి… మీరు ఎన్నైనా చెప్పండి.మా అమ్మాయికి పెళ్లి నేను చేయనంటే చేయను. ఎందుకు చేయాలి? పెళ్లి చేసి అత్తవారింటికి పంపడానికేనా ఇంత అపురూపంగా మా అమ్మాయిని పెంచింది?
ఎన్ని నోములు నోచాను… ఎన్ని వ్రతాలు చేశాను… ఎన్ని మొక్కులు చెల్లించాను… ఎన్ని యజ్ఞాలు చేశాను… సంతానం కోసం మొక్కని దేవుడంటూ లేడు. తిరగని గుడి అంటూ లేదు. ఎక్కని మెట్టు అంటూ లేదు. ఆ బిడ్డ కోసం ఎన్ని బాధలు పడ్డానో మీకేం తెలుసు?
అన్ని కష్టాలు పడి, ఆ దైవ ప్రసాదంలా నాకు సంతానం కలిగింది. అందులోనూ అమ్మాయి పుట్టింది. నా కళ్ల ముందే పెరిగిన ఆ చిన్నారిని ఎంత అల్లారుముద్దుగా చూసుకున్నానో నాకు మాత్రమే తెలుసు. కాలికి మట్టి అంటకుండా, కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచాను. నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నాను.
అటువంటి నా బిడ్డను పెళ్లి చేసి అత్తవారింటికి పంపమంటే… ఒక తల్లిగా నా మనసు ఎలా ఒప్పుకుంటుంది చెప్పండి?”నేనుంటానా.. నా ప్రాణం ఉంటూందా.ఆమ్మో. నా కూతుర్ని విడిచి ఓక్షణమైనా నేనుండలేను వొదినా.
“మీరన్నది నిజమే వదినగారూ… నేనూ కాదనడం లేదు. ఆ బాధ మాకూ తెలుసు. మనసు రాయిచేసుకుని మా అమ్మాయికి పెళ్లి చేసి, అత్తవారింటికి పంపించాం.మీకూ గుర్తుంది కదా!! అదంతా ఎందుకూ! మీరు  అన్నయ్య గారిని పెళ్లి చేసుకున్నారు కదా. మీ పుట్టంటి వారు కాదంటే మీకు ఇంత కుందనపు బొమ్మలాంటి ఆడ పిల్ల పుట్టేదా చెప్పండి!!
ఎంతైనా ఆడపిల్లను ఎప్పటికీ పుట్టింట్లోనే ఉంచుకోలేం కదా వదినె గారూ ! ఎప్పుడో ఒకప్పుడు ఆమెకు నచ్చిన జీవిత భాగస్వామిని చూసి, కన్యాదానం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది కదా!
బంగారం ఎంతైనా, ఎంతకాలమైనా ఇంట్లో దాచుకోవచ్చు. కానీ బంగారం లాంటి ఆడపిల్లను మాత్రం ఎప్పటికీ పుట్టింట్లోనే ఉంచుకోలేం.మీకు తెలియంది ఏముంది?ఆమె జీవితంలో మరో అందమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టాల్సిందే.
ఇది ఒక్క ఇంటి కథ కాదు… ప్రతి ఇంటి కథే. అదే ‘ఇంటింటి రామాయణం’.
పెళ్లంటే నూరేళ్ల పంట. రెండు మనసులను, రెండు కుటుంబాలను ఒక్కటిగా చేసే పవిత్రమైన బంధం. “ఆది పండాలి కోరుకున్న వారి ఇంట…” అంటూ పెళ్లి పాటలు మొదలైనప్పటి నుంచి, “శ్రీరస్తు… శుభమస్తు…” అంటూ కొత్త జీవితానికి శ్రీకారం చుట్టే వరకు… ప్రతి అడుగులోనూ ఆనందం, ప్రతి మలుపులోనూ అనురాగం నిండిపోతాయి.
ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ పెద్దవారి కళ్లలో ఆనందంతో కూడిన కన్నీటి ధారలు కురుస్తూనే ఉంటాయి . అవే స్వరాలు పెళ్లి కాబోయే వధూవరుల హృదయాల్లో మాత్రం కొత్త ఆశలకు, మధురమైన కలలకు పూలవర్షం కురిపిస్తూనే ఉంటాయి.
తల్లిదండ్రులకు అది ఒకవైపు గుండెను బరువెక్కించే వీడ్కోలు… మరోవైపు తమ బిడ్డ జీవితంలో కొత్త వెలుగులు నిండాలని కోరుకునే ఆశీర్వాద ఘడియ.
వధువుకు అది పుట్టింటి జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుని, కొత్త ఇంటి గడప తొక్కే మధురమైన ప్రయాణం. వరుడికి అది ఒక జీవిత భాగస్వామిని మాత్రమే కాదు… ఒక కుటుంబాన్ని, ఒక కొత్త ప్రపంచాన్ని తన జీవితంలోకి ఆహ్వానించే శుభసమయం.
అందుకే పెళ్లి అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు… రెండు హృదయాల అనుబంధం, రెండు కుటుంబాల ఆత్మీయత, తల్లిదండ్రుల ఆశీర్వాదం, పెద్దల దీవెనలు కలిసే పవిత్రమైన వేడుక.
పుట్టింటి ప్రేమను మనసులో పదిలంగా దాచుకుని, అత్తింటి ఆప్యాయతను హృదయపూర్వకంగా స్వీకరించి… రెండు ఇళ్లను ప్రేమతో కలిపే బంధమే అసలైన వివాహ బంధం.
పెళ్లంటే అదే మరి…కన్నీటిలో ఆనందాన్ని, వీడ్కోలులో కొత్త ఆశను, విడిపోవడంలోనే మరో అందమైన కలయికను చూపించే మధురమైన బంధం.
అదే పెళ్లంటే… ❤️
కామెంట్‌లు