సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 


సామెత -309: ఇవ్వడమన్నది ఈ ఇంటా వంటా లేదు-తే అన్నది తరతరాలుగా వస్తున్నదన్నట్లు
.
****
"గాల్లేం మడుసులే అవ్వా!గాళ్ళింట్లె పతొక్కలు శిత్రంగనే ఉన్నరు.గాళ్ళ మాట తీరు సూత్తే కంప్రం. శేత తీరు సూత్తే అసియ్యం ఏత్తదవ్వా!"
"ఏంది శెల్లే? ఎవలాళ్ళు? గాళ్ళేమన్న అన్రాని మాటలన్నరా ఏంది శెప్పు. గాళ్ళ నోట్లె వున్న ముప్ఫై రెండు పండ్లూడగొట్టి నీ శేతుల బెడ్త శెల్లే! గాళ్ళేమన్న తొవ్వల బోతుంటే ఎవ్వలినన్న షిడాయిత్తుర్రా శెప్పు. గాళ్ళ అంతు సూత్త శెల్లే!"
"అవ్వా! అవ్వా! గాళ్ళు అస్మంటోళ్ళయితే నీదనుక వత్తనా ఏంది? గా పనేదో నేనే శేసి గట్టిగ బుద్ధి శెప్పేదాన్ని. ఇంకో రకం అవ్వా! గాల్లింటికి బోంగనే మన శేతులొంక,మనం ఎంట కొంట బొయ్యిన సంచులొంక సూత్తరు. గయ్యి సుత కాలిగుంటే మన అంగీ,లాగులకున్న కీసలొంక సూత్తరవ్వా!"
 గాళ్ళేం మడుసులే శెల్లే! గాల్లేమన్న దొంగసచ్చినోళ్ళా ఏంది? గవి ఎవలు సూడకుండ సగబెడ్తరా? మనల్ని లూటీ జేసి పంపిత్తరా ఏంది? ఎందుకైనా మంచిది జెర బద్రం శెల్లోవ్!"
 " ఎహే ఏందవ్వా! నేను శెప్పుట్ల తేడుందా? నువ్వు యినుట్ల తేడుందా? గియ్యాల నేనేం జెప్పినా నీకు సమజవ్వట్లే? గాళ్ళో తరీక మడుసులవ్వా!   గాళ్ళింటికి బోతే మనం ఏం తెత్తమాని సూత్తుంటరు.గట్ల సూత్తె సూశిర్రు గని  వొచ్చినోళ్ళకి ఏమన్న పెడ్తరా అంటే గదేం లేదు. పైంగ మనం ఏం  తీస్క బోకుండ గా యింటికి బొయినమా అంటే మనల్ని పురుగుల్లెక్క సూత్తరవ్వా!"
అంటే గాళ్ళు మస్తు కంజూషి గాళ్ళన్న మాట. మా ఇంటి కొత్తే ఏం దెత్తరు? మీ యింటి కొత్తే ఏం బెడ్తరు అన్న తరీక ఉంటరు.గింతకీ గాళ్ళు కడుపుకన్న గింత తింటరా లేదా ?గంజి నీళ్ళు తాగి,పచ్చడి మెత్తకులతో బత్కుతరా ఏంది?"
 "గావొచ్చవ్వా!"మన సుక్కమత్తకి ఆడిబిడ్డోళ్ళు. గాళ్ళు ఆడిబిడ్డోల్లని వొచ్చినప్పుడల్ల ఏదొకటి పట్కొచ్చి పెడ్తది. గాఅత్త ఉత్త శేతుల గాల్లింటికి ఎల్లంగ ఏనాడు సూడలేదవ్వా!"
"గట్ల శానా త్యేపల సూశీ సూశీ  ఓ దినం గా సుక్కమ్మత్తని ఓ త్యేప అడిగిన. ఏందత్తా? నువ్వు బెట్టుడే గని గాళ్ళెన్నడన్న ఆవ యిత్తంత పెట్టినట్టు కాన్రాలే. నీ తాన నించి తీస్కోడమే గని గాల్లిచ్చుడేం లేదా అని అడ్గినవ్వా!"
 "గప్పుడు గా అత్త పక్కున నవ్వి  "ఇచ్చుడన్నది గాళ్ళ ఇంటా వంటా లేదంట" .  గిదంత సూశీ ,ఇన్నోళ్ళు ఎవలో నోరూర్కోక ఓ త్యేప అడిగిర్రట. దానికాళ్ళు ఎప్పుడు ఒకలు పెడ్తే తీస్కోడమె గని ఇయ్యడమన్నది మా తరాలల్లనే లేదు అన్నరంట అవ్వా!"
"ఓష్నీ గాల్లేం మడుసులే శెల్లే! ఎన్కట మన పెద్దోళ్ళు శెప్పిన సామెత లెక్కుంది. "ఇయ్యడమన్నది మా ఇంటా వంటా లేదు-తే అన్నది తరతరాలుగా వత్తున్నది అన్నట్టుంది" శెల్లే"
"అవునవ్వా! నువ్వు శెప్పింది నిజ్జంగా నిజం. పైసకి పది ముళ్ళు ఏశి దాశే రకం. పిల్లికి బిచ్చం వేయరు - ఎంగిలి శేతుల కాకిని గొట్టరు. గాళ్ళు గంతే అన్కుందమంటే పొద్దత్తమానం ఎవలేం  బెడ్తరా అని సూశే రకాలు. కొన్ని జల్మలు గంతే అవ్వా! గాళ్ళకి శెప్ప తరం గాదు.శెప్పినా యినే రకం గాదు."
"అవును శెల్లే!గాళ్ళని మార్సుడు బెమ్మ తరం సుత గాదు."
 "గదండీ సంగతీ! ఇయ్యడమన్నది మా ఇంటా వంటా లేదు -తే అన్నది తరతరాలుగా వత్తున్నది "అంటే గిదే మరి.
కామెంట్‌లు