భలేవాడివి వాసు: - సరికొండ శ్రీనివాసరాజు.


   "రాజు, శ్రీహరి, పరమేశు వాళ్ళు ఎంత ధనవంతులో కదా! ఎప్పుడూ కొత్త బట్టలు వేసుకుంటారు. ఖరీదైన ఆహారం తింటారు. ఎంతో సుఖంగా జీవిస్తారు." అన్నాడు వాసు. "ఒకరితో పోలిక నీకెందుకు? కష్టపడి చదువు. భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధిస్తే వాళ్లకంటే మంచి ధనవంతుడవు అవుతావు." అన్నాడు రాము.
     మరోసారి "ఆ వేంకటేశం చూడు! ఎంత తెల్లగా ఉన్నాడో! అందరూ అతణ్ణి తదేకంగా చూస్తారు. నాకు అదృష్టం లేదు. నా రంగు చూడు. నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు."' అన్నాడు వాసు. "రూపంలో ఏముంది? గుణమే ప్రధానం. నువ్వు మంచి గుణవంతుడివి అనిపించుకో!" అన్నాడు రాము.
      మరోసారి వాసు "ఆ రాజేశ్ చూడు. ఎంత పొడవుగా ఉన్నాడో. ఎంత ఎత్తున ఉన్నది అయినా అతనికి తేలికగా అందుతుంది. నేను ఎందుకు ఇంత పొట్టిగా ఉన్నాను?" అన్నాడు. "పొట్టివాడు గట్టివాడు అన్నది నువ్వు వినలేదా? పొట్టిగా ఉండడం గొప్ప వరం." అన్నాడు రాము.
     మరోసారి వాసు "ఆ సురేశ్ ఎంత అదృష్టవంతుడో కదా! అందరికంటే ఎక్కువ స్నేహితులను కలిగి ఉన్నాడు. ఏం లాభం? నాతో ఎవ్వరూ స్నేహం చేయరు." అన్నాడు. "ఇతరులతో పోల్చుకోవడం మంచిది కాదని నీకు ఎన్నిసార్లు చెప్పినా వినవా? నిన్ను భరించడం నావల్ల కాదు. నన్ను విడిచి పెట్టరా." అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రాము. 
      వాసు తరచుగా ఆయా విషయాల్లో తనను ఇతరులతో పోల్చుకుంటూ కుమిలిపోవడం శ్రావణికి తెలిసింది. శ్రావణి వాసు వద్దకు వచ్చి, "నువ్వు చదువులో చాలా వెనకబడి ఉన్నావు. తెలుసా? నువ్వు ఈ పాఠశాలకు వచ్చింది. చక్కగా చదువుకొని, మంచి మార్కులు తెచ్చుకుని నీకు, నీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవడానికి. అది ఆలోచించు. ఇతర విషయాలను పక్కన పెడితే నీకే మంచిది." అన్నది. 
      తన తరగతిలో ఎప్పుడూ మొదటి ర్యాంకు సాధించే శ్రావణి వాసుతో స్నేహం చేసింది. వాసును చదువులో బాగా ప్రోత్సహించడం మొదలు పెట్టింది. తాను చదువుకుంటున్న సమయంలో వాసూను కూడా పక్కన కూర్చోబెట్టుకుని వాసూను చదివిస్తుంది. ఏ సబ్జెక్టులో అయినా అర్థం కానివి సులభంగా అర్ధం అయ్యేలా వివరిస్తూ వాసుని చదివిస్తుంది శ్రావణి. కొద్దికాలంలోనే వాసు తన తరగతిలో మొదటి ర్యాంకు విద్యార్థి అయినాడు. ఈ శుభవార్తను శ్రావణికి చెప్పాడు. అప్పుడు శ్రావణి ఇలా అన్నది. "ఇప్పుడు చూడు. నీ తరగతిలో అందరికంటే అత్యుత్తమ విద్యార్థివి. నీ అంత తెలివిగలవాడు లేడు. ఇప్పుడు గర్వపడు. ప్రతి విషయంలోనూ ఇతరులతో పోల్చుకుంటూ కుంగిపోకు." అని. సంతోషించాడు వాసు. తాను ఇక నుంచి వెను తిరిగి చూడకుండా ఎప్పుడూ మొదటి ర్యాంకు వచ్చేలా కష్టపడాలని అనుకున్నాడు వాసు.
కామెంట్‌లు