సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 

 

సామెత -308: -ఇల్లరికం కన్నా మూలరికం మేలు
***
శ!శ!ష!ఏం బత్కు? ఏం బత్కు గానిది? శెప్పితిన్నాడు? నువ్వే సూత్తుండు నేనెట్ల దర్జాగ కాల్మీద కాలేస్కొని బత్కుత. నన్ను సూశి కండ్లల్ల నిప్పులు బోస్కోవాలె.అదృట్టమంటే గానిదేరా? అని శెవులు కొరుక్కావాలె అని ఏం ఎచ్చులు గొట్టిండులే.గిప్పుడు సూడు."
 "ఏందిరా అయ్యా!ఎవలి ముచ్చెటి.ఎవలా ఎచ్చుల పోతు. గాన్నెందుకు గంతగనం తిడ్తున్నవ్.ఏం జేశిండ్రా అయ్యా!"
 "నీయవ్వ!  గాడు ఏం జేసుడు గాదే.గట్ల ఎచ్చులు గొట్టినోడు గిప్పుడెట్లుండని అడుగు శెప్త. మా దోత్తుగాళ్ళందరం గదేదో సైన్మా ముచ్చెటి సుత జెప్పి గాని మన్సు మార్సాలని జూశినం.సశేం యింటెనా.గిప్పుడాని బత్కు కుక్క బత్కు లెక్క అయ్యింది."
"గింతకీ అస్లిష్యం శెప్పకుండ ఏంట్రా అయ్యా  గీ నస.పాపం నీ మాటలింటుంటే గాడేదో పెద్ద శిక్కుల్లనే బడ్డట్టుంది. జాలి సూపేది బొయ్యి గట్లంటవేందిరా ?"
 "అవ్వా!గియ్యన్ని అనేది గాని మీద కోపమొచ్చి గాదె.జాలొచ్చి. గాన్ని సూశొచ్చిన కానిచ్చి మన్సుల మన్సు లేదు. గాని మొకంల పెండ్లికి ముందున్న కళ దివిటేశి సూశినా కాన్రాలె.గాడు మాకు శాయ తెత్తనని బొయ్యిండు.'యాది మర్శిన్రా ఇంట్లె పాలు లెవ్వని' తల్కాయొంచుకొని అంటుంటెనే తెల్శిపోయింది. గీనికి గా యింట్ల  ఆవిత్తంత సొతంత్రం లేదని. మేము శిన్నప్పటి ముచ్చెట్లు యాజ్జేత్తుంటే గాడేదో యేదాంతం వల్లిచ్చుకుంట "అన్కున్నయి అన్కున్నట్టు జరిగితే మడిషి గిట్లుంటడార" అన్నడు.గాల్లింట్ల ఎట్టి శాకిరి శెయ్యడాన్కి తేరగ దొర్కిండు. "ఇంటిపేరు మాశిపాయె.గట్లనైన సుఖవడకపాయె" ఏందో అవ్వా!"
 "ఒరే అయ్యా గిన్ని డొంక తిరుగుడు మాటలు జెప్పినవ్.సాపు సీదగ గాడు ఇల్లీటం బోయిండని ఒక్క ముక్క శెప్పొచ్చు గదర.మొగ సంతు లేనేళ్ళు.ఇంటి పేరు మోశేటోళ్ళు గావాల్నని గిట్ల మొగ పిల్గానోళ్ళను ఇల్లరికం అడుగుతరు. శానా మందిరి ఒప్పుకోరు గని గీళ్ళవి గాళ్ళవి ఆత్తిపాత్తులు తూకమేస్కోని యిశారిచ్చి  లేనోళ్ళు గిట్ల తలొగ్గుతరు."
 "గంతొరుకు బాగనే ఉంది గని.ఎంత ఇల్లీటపు అల్లుడైతే మాత్తరం ఎవలన్న పనోని లెక్క సూత్తరా. సొతంతరం లేకుండ శేత్తరా నువ్వే శెప్పవ్వా!"
 "ఎవ్వలు గంత గనం శెయ్యర్రా.ఇగ్గో నీ దోత్తు గానికి దొర్కిన గయ్యాలోల్లస్మంటోళ్ళు గిట్ల శేత్తుంటరు.పెత్తనాలు మొత్తం ఆళ్ళయే ఉంటయి.ఆళ్ళు ఏమన్నా బడాలె. కట్టే బట్ట తినే తిండి అంత ఆళ్ళిట్టం మీద నడుత్తది. గస్మంటి తావుల్ల అవుమానం అనిపిత్తది. ఏం జేత్తం నీ దోత్తు గాని అదృట్టం గట్లుంటది. గందుకే  "ఇల్లిరికం కన్న మూలిరికం నయం" అన్నరు మన పెద్దోళ్ళు. "
 "మూలరికం అంటే ఏందే  అవ్వా! గిదేందో కొత్త కొత్తగుంది‌"
" మూలరికం అంటే మూలాలు ఏడున్నయో గాడుండడం అంటే గాని పుట్టింట్లే,పుట్టినూల్లె ఉండటం అన్న మాట. అత్తింటికి బొయ్యి గాళ్ళతో గన్ని అనుమానాలు పడే కంటే ఉన్నూల్లో కలో గంజో తాగి బత్కడం నయం గద అని అర్తం రా అయ్యా!"
 "పాపం గాడింక గోతిల బడ్డట్టేనా.గాడికీ జల్మల సుఖం రాసిపెట్టి లేదా అవ్వా! ఎంత కాలమని గిట్ల బత్కుతడు.గానికింక మంచి దినాలే రావా? గాన్ని తల్సుకుంట మా దోత్తుగాళ్ళం గిట్ల రంది వడాల్సిందేనా?" 
అయ్యో! నాయినా! గన్ని శరలు వడ్తుండా?గంత రంది శెయ్యమాకు. శీకటెన్క ఎల్తురు వొచ్చినట్టు గానికి సుత మంచి దినాలు వత్తై తీ!
"ఒకపాలి ఏదోక వొంకతో నీ దోత్తు గాన్ని , గాని పెళ్ళాన్ని మనింటికి తోల్కరా .ఆల్మగలు అంటే ఎప్పుడు తోడుగా నీడగా  దోత్తులెక్క ఉండాలె గని పిల్లి ఎల్కల లెక్క ఉండొద్దు.ఒకల్నొకలు గావురిచ్చుకోవాలె గని ఎకర్దిచ్చు కోకూడదు.గిస్మంటియి ఎన్నో నేను శెప్త గద. నువ్విట్ల మనియాది శెయ్యకురా అయ్యా! నా సాయం నేజ్జేత్త తీ!
గదండీ సంగతి " "ఇల్లరికం కన్నా మూలరికం మేలు" అంటే గిదే మరి. సమజైంది గదురుల్లా!"
కామెంట్‌లు