సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 
కర్ణ పర్వము ప్రథమాశ్వాసము:- 367 వ రోజు


ఇరుపక్షముల వ్యూహ రచన
మరునాటి ఉదయం కర్ణుడు సైన్యాధ్యక్షుడుగా మకరవ్యూహాన్ని పన్నాడు. మొసలి నోరు భాగములో తాను నిలిచాడు. కళ్ళ భాగంలో శకుని, ఉలూకుడు నిలిచారు. తల భాగాన అశ్వత్థామ మెడ భాగాన తన తమ్ములను నిలిపాడు సుయోధనుడు. ముందరి కాళ్ళ భాగాన కృపాచార్యుడు, కృతవర్మలు, కడుపు భాగాన సుయోధనుడు, వెనుక కాళ్ళ భాగాన సుషేషణుడు, శల్యుడు తోక భాగాన చిత్రసేనుడు తమతమ సైన్యములతో నిలిచారు. మిగిలిన సేనలను వ్యూహము చుట్టూ నిలిపాడు. యుధిష్టరుడు కూడా తమ సైన్యముతో యుద్ధరంగమున నిలిచాడు. సైన్యాధ్యక్షుడుగా కర్ణుని చూసాడు. అంతకు ముందు యుధిష్టరుడికి కర్ణుడంటే భయం ఉండేది. ఇప్పుడది లేదు సహజ కవచకుండలములు లేవు, ఇంద్రుడిచ్చిన శక్తి లేదు, ద్రోణుని అండ లేదు. కనుక సులభంగా కడతేర్చవచ్చును అనుకున్నాడు. అర్జునుడిని చూసి " అర్జునా ! చూసావా ! కర్ణుడు సర్వసైన్యములకు అధిపతి అయ్యాడు. మన అరణ్యవాస, అజ్ఞాతవాసములకు, అవమానములకు, అనుభవించిన సకల కష్టాలకు మూల కారణం ఇతడే. ఇక నీవు అతడి మీద పగ తీర్చుకో. కౌరవ సేన తరఫున చెప్పుకోతగ్గ వీరుడితడే ఇతడిని వధించిన కౌరవులను మనం అనాయాసంగా జయించవచ్చు. కర్ణుడు పన్నిన మకర వ్యూహముకు తగిన వ్యూహమును రచించు " అన్నాడు. అర్జునుడు తన సేనలను అర్ధచంద్ర వ్యూహమున నిలిపాడు. ఎడమ కొమ్మున భీముని, కుడికొమ్మున ధృష్టద్యుమ్నుడిని, ధర్మరాజ నకుల సహదేవులను వ్యూహము వెనుక భాగమున నిలబెట్టాడు. అర్జునుడి చక్రరక్షకులుగా యుధామన్యుడు, ఉత్తమౌజుడు నిలిచారు. కర్ణుడి చేతిలో కృష్ణార్జునులు ఓడిపోతారని నీ కుమారుడు, అర్జునుడి చేతిలో కర్ణుడు ఓడగలడని ధర్మరాజు గట్టిగా నమ్మారు.
యుద్ధారంభం
తమ తమ సైన్యాధ్యక్షులు ఇచ్చిన ఆజ్ఞతో ఇరు పక్షములు ఢీకొన్నాయి. ఏనుగులు రథములు, హయములు, కాల్బలములు క్షణంలో నాశనం ఔతున్నాయి. ఏనుగుల కాళ్ళ కింద రథచక్రముల కింద పడి సైనికులు చితికి పోతున్నారు. అర్జునుడు కర్ణుడు ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధము చేస్తున్నారు. సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, చేకితానుడు, ఉపపాండవులు కలిసి కౌరవ సేనలో ఉన్న ప్రభధ్రక, చేది, మధ్య, పాండ్య, వంగ, చోళ మొదలైన సైన్యములను తరుముతున్నారు. భీమసేనుడు తన గజవాహనము మీద విహరిస్తున్నాడు. దానికింద పడి కౌరవ వీరులు మరణిస్తున్నారు.
క్షేమధూర్తి భీముని ఎదుర్కొనుట
ఇంతలో కులూత దేశపు రాజు క్షేమధూర్తి ఏనుగు మీద వచ్చి భీమసేనుడిని ఎదుర్కొన్నాడు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఈటెలు విసురుకున్నారు, ఒకరి విల్లు ఒకరు విరుచుకున్నారు. ఏనుగులు కూడా ఒక దానిని ఒకటి ఎదుర్కొన్నాయి. క్షేమదూర్తి భీమసేనుడి గుండెలలో ఈటెను దించి భీమసేనుడి ఈటెలను మధ్యలోనే విరుస్తున్నాడు. భీమసేనుడి శరీరం మీద అరవై బాణాలు వేసాడు. భీమసేనుడు క్షేమధూర్తి ఏనుగు శరీరం నిండా బాణములు వేసాడు. ఆ బాధకు తాళ లేక ఏనుగు అక్కడి నుండి పారిపోయింది. భీమసేనుడు క్షేమధూర్తి ఏనుగును తరిమాడు. క్షేమధూర్తి అతి కష్టము మీద ఏనుగును అదుపులోకి తెచ్చుకుని భీమసేనుడి మీద అతడి ఏనుగు మీద శరప్రయోగం చేసాడు. భీమసేనుడి ఏనుగు కింద పడింది. గద తీసుకుని కిందకు దిగిన భీమసేనుడు క్షేమధూర్తి ఏనుగును ఒక్క దెబ్బతో పడగొట్టాడు. క్షేమధూర్తి ఏనుగును దిగి కత్తి దూసాడు. భీమసేనుడు గద ఎత్తి క్షేమధూర్తి తల మీద మోదాడు. క్షేమధూర్తి అక్కడికక్కడే తల పగిలి మరణించాడు. క్షేమధూర్తి మరణం చూసి అతడి సైన్యాలు చెదిరి పోయాయి. భీమసేనుడు ఉత్సాహంతో కర్ణుడి వైపు పోయాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు