'అమ్మ భాషను అందరూ ఆదరించాలి'


 -- రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈర్ల సమ్మయ్య 

 కమ్మనైన తేటతెనుగు అమ్మ భాషను అందరూ ఆదరించాలని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య కోరారు. శనివారం ఆయన పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల పిల్లలకు పద్యాల పోటీలు, తెలుగు భాషలో క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పిల్లలకు తెలుగు భాషా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశభాషల్లోకెల్లా  తెలుగు భాష అత్యంత గొప్పదని, కఠిన హృదయాలను సైతం కరిగించే శక్తి తెలుగు భాషకు ఉందన్నారు. మానవతా సమాజంలో అనేక రుగ్మతలు, మూఢనమ్మకాలను తొలగించి వైజ్ఞానిక సమాజాన్ని ముందుకు నడిపించడంలో తెలుగు భాష ఎంతో దోహదం చేస్తుందన్నారు. అన్య భాషల్లో కంటే మాతృభాషలో బోధన చేయడం ద్వారా పిల్లలకు విషయం పరిపూర్ణంగా అర్థమవుతుందని, తద్వారా పిల్లలు ఉన్నత స్థాయికి చేరే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుత సమాజంలో ఆంగ్ల భాష మోజులో పడిన చాలామంది తెలుగు భాషను పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషాభివృద్ధి దాని విస్తృతికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, మంద శ్రీవాణి, విద్యార్థినీ, విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు