బతుకు పోరాటం!: - యామిజాల జగదీశ్
 

మనం చాలా సాధారణంగా చూసుకుంటూ వెళ్ళిపోయే ఒక పని… వారికి మాత్రం ప్రతి రోజూ బతుకు పోరాటం!
ఒక దుకాణం పక్కన లారీ ఆగు తుంది. బస్తాలు కిందకి దించుతారు. కొన్ని నిమిషాల్లో ఆ పని పూర్తయి పోతుంది. మనం మన పని చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం.
కానీ ఆ కొన్ని నిమిషాల్లో జరిగే కష్టాన్ని ఎంతమంది గమనించాం?
ఒక బస్తా కిందకి దించాలి. పైకి లేపాలి. మోయాలి. సరైన స్థానంలో అమర్చా లి.
మళ్ళీ ఇంకో బస్తా.
ఒక్కసారి చూస్తే ఇది మామూలుగానే అనిపిస్తుంది. ప్రతిరోజూ చేస్తే దానిలోని కష్టం ఏంటో తెలుస్తుంది.
మన జీవితంలోనూ ఉండే చాలా విషయాలు అంతే.
దుకాణాల్లో సరుకులు ఉంటాయి. గోదాముల్లో సరుకులు ఉంటాయి. పంట పొలాల నుండి ధాన్యం ఒక చోటు నుండి ఇంకో చోటికి వెళ్తుంది.
మనకి ఇవన్నీ చాలా సహజంగా జరుగుతున్నట్లు అనిపిస్తాయి.
కానీ ఆ వస్తువులు మన దగ్గరికి చేరడానికి మధ్యలో ఎందరో మనుషుల శారీరక శ్రమ ఉంటుంది. ఆ విషయాన్ని మనం అంతగా ఆలోచించం.
ముఖ్యంగా ఇలాంటి శ్రమతో కూడిన పనులు...
ఎండైనా, వానైనా, శరీరం అలసిపోయినా పని మాత్రం ఆగడానికి వీల్లేదు.
ఎందుకంటే వీరికి ఇది ఒక ఫోటో కోసం పెట్టే ఫోజు కాదు.
ఇది వీరి రోజువారీ జీవితం.
మనం కొన్ని నిమిషాలు చూసి వెళ్ళిపోయే పనిని, ఒకరు తమ కుటుంబం కోసం, తమ బతుకు తెరువు కోసం ప్రతిరోజూ చేయాల్సి వస్తోంది.
అందుకే ఇలాంటి పనులను చూసి నప్పుడు జాలి చూపించడం కంటే...ఆ కష్టానికి విలువ ఇవ్వడం చాలా ముఖ్యం.
చేసే పని వేరు కావచ్చు.
ల్యాప్‌టాప్ ముందు కొందరు పని చేస్తారు. 
కొందరు పొలాల్లో పని చేస్తారు. 
రోడ్లపై కొన్ని పనులు చేస్తారు.
వీరి రోజంతా…
బస్తాలు మోస్తూనే గడిచిపోవచ్చు.
కానీ అందరికీ ఇంట్లో ఎదురుచూసే కుటుంబం, రేపటి గురించిన కలలు ఒక్కటే.
మన చుట్టూ ఇలాంటి అనేక పనులు జరుగుతున్నాయి.
మనం గమనించకుండా వెళ్ళిపోతాం.
కానీ ఒక విషయం మర్చిపోకూడదు...
మన రోజువారీ జీవితం హాయిగా సాగిపోవడానికి, ఎవరో ఒకరి రెక్కల కష్టమే కారణం. 
మరోసారి ఇలాంటి పనిని చూసినప్పుడు, ఒక్క క్షణం ఆగి గమనిద్దాం.
మనం పట్టించుకోకుండా వెళ్ళే ప్రతి పని వెనుకా ఒకరి సమయం, వారి కష్టం ఉంటుంది కదూ.
కామెంట్‌లు