సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు,ఖమ్మం

 

 సామెత -319: ఇల్లు కట్టి చూడు - పెండ్లి చేసి చూడు

"ఏంది శెల్లెండ్లూ! ఎన్నల్లేంది  ఇద్దరు కల్శి వొచ్చిర్రు.రాండ్రి రాండ్రి. అంత బాగనే ఉండ్రుగద?"
"మంచిగనే ఉన్నమవ్వా !నేనా ఈదిల నుంచి వత్తుంటే, అవ్వని సూడక శాన్నాల్లయ్యింది వత్త పా అన్కుంట శైలమ్మక్క సుత వొచ్చింది."
 "గిట్ల మీ యిద్దర్ని సూత్తుంటె శానా సంబురంగుంది. వొరమ్మా! ఇల్లు మంచిగ గట్టినవ్! ఊల్లె అందర్ని పిల్శి శెయ్యి గడిగిచ్చినవ్! గా సుట్టింట్లె ఉన్నప్పుడు గదేమొ పాతిల్లు. ఏడ కూల్తదోనని మస్తు బయమైంది శెల్లే!
అవును గని అవ్వా! గా మేత్రి మొదగాల పదేను లచ్చలకి అన్ని సౌలతులు గలిపి ఇల్లుగట్టిత్త అన్నడు. మొదలు వెట్టినంక గయి దేవాలే, గియి దేవాలె అంటే ఎక్కడ మిత్తికి దొర్కితె గక్కడ పట్కొచ్చినం. గిప్పుడు లెక్క సూత్తె పైన అయిదు లచ్చలు అప్పు దేలింది. గజ్జూసుకున్నంక ఎట్ల తీర్సాలని కడ్పుల బయంజొచ్చి నిద్దర పడ్తె గంతొట్టు. గీ సొద నీకు శెప్పుకుందమని వొచ్చినవ్వా! "
" అయ్యో! గంతయిందా శెల్లే! నువ్వేం రంది శెయ్యమాకు.గయ్యి తీరడాన్కి ఏదన్న తొవ్వుందేమో సూద్దాం తీ."
 " శైలమ్మా! ఊరంత పందిరేశి అంగరంగ వైబోగంగ బిడ్డ లగ్గం జేశినవ్. నీకేంది శెల్లె పేద్ద బాద్దెత తీర్సుకున్నవ్. బిడ్డ అల్లుడు వొచ్చి పోతుర్రు గద. "
 " అగ్గో! అవ్వా!  ఏవొచ్చుడో ఏవోఁ పో!గా వొచ్చి పోవుడుతోనే కట్టంగుంది. "
 " గదేంది శెల్లే! గట్లంటవ్! కొత్తంగ లగ్గమయిన బిడ్డ అల్లుడు గట్ల వొచ్చి పోతుంటెనే మీకు సంబురంగుంటది. సూశేటోళ్ళకి సక్కదనంగ అగుపిత్తది. "
 " ఓ అవ్వా! సక్కదనం ముచ్చెటి పక్కకు బెట్టు. గప్పుడే నా బిడ్డని కీలుబొమ్మ సేశిర్రు. వొచ్చినప్పుడల్లా ఏదొకటి అడుగుడు.అయ్యో బిడ్డ నోరుదెర్శి అడిగిందని తల్కాయ తాకట్టు బెట్టి ఇచ్చుడు. లగ్గానికని దాశినవి లగ్గంల కర్సైనయయా!. లగ్గంలనే గాళ్ళు అడ్గక మున్పే గియ్యి బెడ్తం గయ్యి బెడ్తమని ఎడ్డోల్ల లెక్క గప్పుడే అన్ని బెట్టుడు ఎంత పెద్ద తప్పైందో గిప్పుడు తెల్శొత్తుంది."
 " గీళ్ళతాన  ముల్లె శాన్నే ఉందనుకుర్రో ఏమో వొచ్చినప్పుడల్ల పిల్లతో అడిగిపిచ్చి తీస్కబోతుర్రు. గయి తీర్సలేక గుడ్లు తేలేత్తున్నం. గిప్పుడు బిడ్డ అల్లుడు వొత్తుర్రంటే శలి జొరం వొచ్చినట్లై వొన్కుడొత్తుందవ్వా! "
" అయ్యో అవునా శెల్లే!గందుకే మనియాదితో గట్లయినావ్! గీ త్యేప బిడ్డ అల్లుడు వొత్తే నా తానికి బంపు. గప్పుడు నీకో మాంచి తొవ్వ సూపిత్త. ఇంకోపాలి అడ్గకుండ శేత్త. "
 " అవ్వా! నీ మాటలు శెవుల్ల అమ్ముతం బోశినట్లున్నయ్. గదేందో జెర జెప్పవ్వా నాకు సుత. "
" ఇల్లు గట్టి సూడు - పెండ్లి జేసి సూడు "మని ఊకెనే అన్లే" అయితే గయి తీరే తొవ్వ ఎతుక్కునుట్లనే వుంది మన తెల్వి.
" ఇగ్గో వొరమ్మా! నువు పెట్టెల దాస్కున్న బంగారపు గాజులు పెద్ద గొల్సు.గిట్ల ఏవన్నుంటే గయి తీస్కబొయ్యి బేంకుల బెట్టు.గక్కడైతే మనస్మంటోళ్ళకి మిత్తి తక్వ. బయిట రొండు మూడు రూపాయిల మిత్తికి దెచ్చిన్రు గద.గా అప్పు ముందుగాల తీర్సుండ్రి. ఎగసాయం మీద వొచ్చిన పైసలు ఏటిన్ని జమజేసి గా నగలు యిడ్పిచ్చుకోండి. గప్పుడు నువ్వు మర్దిగారు రంది జేసుడే ఉండదు శెల్లే!"
 " గీ తెల్వే లేకపాయె మంచి తొవ్వ సూపినవ్ అవ్వా! గట్లనే శేత్త!"
 " శెల్లే! నీ అల్లుడు మంచోడన్నవు గద. అల్లుడంటే కొడ్కుతో సమానం కూసబెట్టి యింటిష్యాలు పూస గుచ్చినట్టు శెప్పు. రేప్రేపు ఏం సంపాయిచ్చినా కొడుక్కి ,బిడ్డకే గద పెట్టుకునేదని యిడమర్శి శెప్పు.గప్పుడు యిన్లేదన్కో.ఏదొకటి శేద్దాం ఏవంటవ్ శెల్లే!"
 " అల్లుడు శాన మంచోడవ్వా! దాని అత్తనే కొడుక్కి తెల్వకుండ అడిగి తెమ్మంటుందంట.గియన్ని తెల్శేతట్టు శేత్తే యింగ సమస్సే ఉండదవ్వా! మంచి మాట శెప్పినవ్!"
 " ఇగ్గో! ఏదన్న కట్టమో,సమస్సెనో వొత్తే రంది వడొద్దు.ఎట్ల బయిట బడాల్నా అని బాగ సోంచాయించాలె.ఏదోక తొవ్వ గిట్ల దొరక్క పోదు. ఏమైనగని "ఇల్లు గట్టి సూడు-పెండ్లి జేసి సూడు" మంటే గిదే మరి అడ్గు దొరకని బాయి లెక్క ఉంటది పరిత్తితి. "
 మన్సు తేలికైందవ్వా! మల్లొత్తం." 
గదండీ సంగతీ!" ఇల్లు కట్టి చూడు - పెండ్లి చేసి చూడు" అంటే గిట్లనే వొత్తుంటయి సమస్సెలు. గందుకే మన పెద్దోళ్ళ తరం నించి గీ సామెత పుట్టుకొచ్చింది. "
కామెంట్‌లు