ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎల్లారెడ్డిపేటలో తేదీ 05-08-226 రోజున కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ మరియు ఎల్లారెడ్డిపేట మండల పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) శ్రీ వెంకటేశ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని ఫోన్ కాల్స్, నకిలీ వెబ్‌సైట్లు, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్‌లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
సైబర్ నేరాలకు ఎవరైనా గురైనట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 (వన్ నైన్ త్రీ జీరో) జాతీయ సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలని, లేదా సమీప పోలీసు స్టేషన్‌ను సంప్రదించాలని సీఐ వెంకటేశ్ సూచించారు. సకాలంలో ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును తిరిగి పొందే అవకాశాలు మెరుగుపడతాయని ఆయన వివరించారు.
అదేవిధంగా విద్యార్థులు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మరియు సమాజంలోని ఇతరులకు కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యాభ్యాసంపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులు డిజిటల్ ప్రపంచంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండటం నేటి అవసరమని పేర్కొన్నారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థుల్లో చైతన్యం, అప్రమత్తత మరియు సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సి.ఐ వెంకటేశ్ , ఎస్.ఐ నర్సింహులు కళాశాల ఇంచార్జీ కె. సత్యనారాయణ, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి వాసరవేణి పర్శరాములు, అధ్యాపకులు మాదాసు చంద్రమౌళి, చెరుకు భూమక్క, బుట్ట కవిత, నీరటి విష్ణు ప్రసాద్, జ్యాతోతు శ్రీనివాస్, గజ్జెల గంగాధర్, అనుముల రవిచంద్ర, వెల్దండి సౌమ్య,అగోలం గౌతమీ, బోధనేతర సిబ్బంది విమల్ కుమార్, కనిమేని దేవేందర్, షాహినా సుల్తానా, నిఖిల్ పోలీసు శాఖ సిబ్బంది మరియు ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి