పశ్చాత్తాపం: - వరలక్ష్మి యనమండ్ర


 ఆ ఇంట్లో దీపం వెలుగుతోంది, కానీ మనుషుల మధ్య మాత్రం చిమ్మచీకటి. రాఘవయ్య వేలు కోడలికేసి చూస్తున్నది. ఆయన కళ్ళు కోపంతో ఎర్రబడి ఉన్నాయి.ఎదురుగా చేతులు జోడించింది కోడలు సుమతి. 
“ఎంత ధైర్యం నీకు? నా మాట కాదని ఉద్యోగానికి వెళ్తానంటావా? ఈ ఇంటి పరువు గంగలో కలిపేస్తావా?” ఆయన గొంతు అరిచేసరికి కోడలు వణికిపోతున్నది. 
“మామయ్యగారూ! పరువు కోసమే అడుగుతున్నాను. అప్పుల వాళ్లు రోజూ గడప తొక్కుతున్నారు. అత్తయ్యగారి మందులు కూడా అయిపోయాయి. ఇంటి పరిస్థితి బాగలేదు....” సుమతి గొంతు జీరబోయింది. 
“ఛీ! ఆ మాటలు నా దగ్గర కాదు. ఆడది సంపాదిస్తే మగవాడు బతికి కూడా చచ్చినట్టే. నా కొడుకు చేతగాని వాడని లోకం ఉమ్మేస్తుంది” అని సుమతి చేతిని విదిల్చి కొట్టాడు. 
శ్రీధర్ గుమ్మంలో నిలబడి అన్నీ చూస్తున్నాడు. కానీ తండ్రి ఎదురుగా నోరెత్తే ధైర్యం చేయలేకపోయాడు. తను ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పెద్దగా చదువుకోలేదు. 
“నాన్నా, సుమ మన మంచి కోసమే...” అని గొణిగాడు. 
“నువ్వు నోరు మూయ్. పెళ్లాం మాట వింటూ సంసారాన్ని నాశనం చేస్తావా?” రాఘవయ్య గర్జించాడు. 
సుమతి ఆ రాత్రి అన్నం ముట్టలేదు. కానీ మరుసటి రోజు మౌనంగా ఇంటిపని చేసుకుంది. ఉద్యోగం ఊసెత్తలేదు. రాఘవయ్య గెలిచానని విర్రవీగాడు. 
ఆరు నెలలు గడిచాయి. 
అప్పు మూడు లక్షల నుంచి మూడున్నర లక్షలైంది. వడ్డీ వ్యాపారి 'వెంకట్రావు' రోజూ ఇంటి ముందు అరుస్తున్నాడు. “రాఘవయ్యా, సొమ్ము ఇస్తావా? లేక పొలం పత్రాలు రాసిస్తావా?”
పరువు పోతుందన్న భయంతో రాఘవయ్య గుండె దడదడలాడింది. కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. శ్రీధర్ రాత్రి ఆటో తోలి, పగలు కంపెనీకి వెళ్లి నీరసించిపోయాడు. ఒక రోజు కళ్లు తిరిగి పడిపోయాడు. 
“రెస్ట్ కావాలి. ఇలా చేస్తే కిడ్నీలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది" అని హాస్పటల్ కి వెళ్తే డాక్టరు అన్నారు. మందులు రాసిచ్చారు.
దురదృష్టం కొద్దీ 'గోరుచుట్టు మీద రోకటి పోటు' అన్నట్లుగా అప్పుడే లక్ష్మమ్మకు గుండెనొప్పి వచ్చింది. హాస్పిటల్‌లో చేర్చితే 50 వేలు కట్టమన్నారు. రాఘవయ్య చేతిలో చిల్లిగవ్వ లేదు. చుట్టాలంతా ముఖం చాటేశారు. ‘పరువుగల రాఘవయ్య’ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా ఉంది . 
వెంకట్రావు వచ్చి ఇంటి సామాన్లు బయట పడేస్తున్నాడు. “పరువు, పరువు అన్నావు కదయ్యా!  ఇప్పుడు నీ పరువు ఏం చేస్తుంది? ఆకలి తీరుస్తుందా? ఆస్పత్రి బిల్లు కడుతుందా?” అని ఊరందరి ముందు అవమానించాడు. 
రాఘవయ్య తల దించుకున్నాడు. 65 ఏళ్ల జీవితంలో మొదటిసారి నిస్సహాయంగా, మోనంగా రోదించాడు. అదే సమయంలో స్కూల్ హెడ్‌మాస్టర్ ఇంటికి వచ్చాడు. 
“అయ్యా! మీ కోడలు సుమతిగారికి మా స్కూల్లో టీచర్ పోస్ట్ ఇవ్వాలని ఆరు  నెలల నుంచి ఎదురుచూస్తున్నాం. ఆవిడ చాలా తెలివైనది. వాళ్ళ నాన్న నాకు స్నేహితుడు. అందుకే ఇప్పటికీ తనకోసం ఎదురు చూస్తున్నాం. గతంలో మా స్కూల్లో చేసింది కాబట్టి. కానీ మీరు ఒప్పుకోరని రాలేదట. ఇప్పటికైనా ఒప్పుకోండి. జీతం అడ్వాన్స్‌గా 30 వేలు ఇస్తాను. మీ అబ్బాయి,మీ  ఆవిడగారి వైద్యానికి ఉపయోగపడుతుంది” అన్నాడు విషయం అంతా తెలిసి. 
రాఘవయ్యకు చెంప పగిలినట్టయింది. తాను ‘వద్దు’ అన్న ఉద్యోగమే ఇవాళ తన కుటుంబాన్ని ఆదుకుంటోంది. తాను కాపాడాలనుకున్న ‘పరువు’ తనని రోడ్డు మీద నిలబెట్టింది. తాను తిరస్కరించిన ‘కోడలు’ ఇప్పుడు ఆధారం అవుతోంది. 
సుమతి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా వెళ్లి అత్తగారి బట్టలు సర్దింది, ఆస్పత్రికి బయలుదేరింది. వెళ్తూ వెళ్తూ మామగారి కాళ్లకు చెప్పులు అందించింది. “మీరు కూడా రండి మామయ్యగారూ. అత్తయ్యకు ధైర్యంగా ఉంటుంది” అన్నది. 
ఆ మాట, ఆ ప్రవర్తన రాఘవయ్య గుండెను కోసింది. ‘ఇంత అవమానించినా నన్ను ‘మామయ్యా’ అని  ఎంతో ఆప్యాయంగా పిలుస్తోంది. నా భార్య కోసం తన గొడవ పక్కన పెట్టింది. ఇదేనా పరువు తీయడం?’ అనుకున్నాడు.
ఆస్పత్రిలో 15 రోజులు ఉన్నది లక్ష్మమ్మ. సుమతి పగలు స్కూల్, రాత్రి ఆస్పత్రి. శ్రీధర్‌ కూడా మందులు వాడుతూ క్రమంగా కోలుకున్నాడు. తండ్రి కొంత ఆర్థిక సహాయం చెయ్యడంతో ఒడ్డున పడ్డారు. రాఘవయ్య మాత్రం మౌనంగా కూర్చుని అన్నీ చూస్తున్నాడు. అతని ‘అహం’ అనే పురుగు నెమ్మదిగా చస్తోంది. 
లక్ష్మమ్మ కోలుకుని ఇంటికి వచ్చింది. ఒక రోజు  వెంకట్రావు మళ్లీ వచ్చాడు. కానీ ఈసారి రాఘవయ్య తల దించుకోలేదు. 
సుమతి ముందుకు వచ్చింది.  20 వేలు వెంకట్రావు చేతిలో పెట్టింది. “లెక్క చూసుకోండి వెంకట్రావు గారూ! మిగిలింది నెలనెలా ఇస్తాము. మా పొలం జోలికి రాకండి” అన్నది స్థిరంగా. 
ఊరంతా ఆశ్చర్యంగా చూసింది. వెంకట్రావు కూడా తల వంచుకుని వెళ్లిపోయాడు. 
ఆ రాత్రి రాఘవయ్య భోజనం దగ్గర సుమతి చెయ్యి పట్టుకున్నాడు. ఈసారి గట్టిగా అదిమిపట్టడానికి కాదు, క్షమాపణ అడగడానికి. 
“తల్లీ!  నన్ను క్షమించు. నా కళ్లు మూసుకుపోయాయి ఇప్పటి వరకు. ‘పరువు’ అంటే నలుగురు ఏమనుకుంటారో అని భయపడటం కాదని ఇవాళ తెలిసింది. కష్టంలో కుటుంబాన్ని నిలబెట్టడమే నిజమైన పరువు. నిన్ను ఇంట్లో కూర్చోబెట్టడమే‌ నేను గొప్ప అనుకున్నాను. కానీ నిన్ను బయటకు పంపితేనే మన ఇల్లు నిలబడింది. ఇప్పుడు తెలిసింది నాకు అసలైన పరువు ఏమిటో!” అన్నాడు నిజాయితీగా.
సుమతి కళ్లలో నీళ్లు... “మామయ్యగారూ! మీది ఎంతమాత్రము తప్పు కాదు . మీరు పెరిగిన వాతావరణం అటువంటిది. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు. మనందరం ఒక కుటుంబం. మీరు కుటుంబం కోసమే అప్పులు చేసారు. కానీ అన్ని రోజులూ ఒకలా ఉండవు కదా మామయ్యా! మీ దీవెన, ప్రోత్సహం ఉంటే చాలు నాకు ... ధైర్యంగా ఏ పనినైనా చేయగల సత్తా వస్తుంది నాకు. మిమ్మల్ని మా నాన్నగారే అనుకున్నాను. ఇది నా కుటుంబం అనుకున్నాను. మనందరం ఒకే మాట మీద ఉంటే మనింటిలోకి వచ్చే వారసులకు మంచి జీవితాన్ని ఇవ్వగలం కదా మామయ్యా!” అన్నది సుమతి.
రాఘవయ్య లేచి నిలబడి, అందరూ చూస్తుండగా తన చేతిని సుమతి తలమీద పెట్టి దీవించాడు. “ఇన్నాళ్లూ నా వేలు నిన్ను తప్పు పట్టింది తల్లీ. ఇక నుంచి ఈ వేలు నీకు ఆసరాగా ఉంటుంది. వారసుడు రాబోతూ నన్ను మార్చేసాడన్నమాట. ఎంత శుభవార్త చెప్పావు తల్లీ! ఇక నుండి ఈ ఇంట్లో నీ ఆలోచన ప్రకారమే నడుస్తుంది తల్లీ " అన్నాడు మనస్పూర్తిగా రాఘవయ్య.
తన మాటలలో పశ్చాత్తపం స్పష్టంగా తెలుస్తున్నది.
మరుసటి రోజు సుమతి బడికి వెళుతుంటే స్వయంగా రాఘవయ్య గారు తన బండిమీద సుమతిని బస్టాండు వరకు తీసుకెళ్ళి...“జాగ్రత్త తల్లీ. పిల్లలకు మంచి బుద్ధులు నేర్పు. ‘ఆడపిల్ల, మగపిల్లాడు ' అనే తేడా లేకుండా అందరూ సమానమే అని చెప్పు. జాగ్రత్తమ్మా! సాయంత్రం వస్తాను ఇంటికి తీసుకువెళ్ళడానికి” అన్నాడు. 
ఆ మాట విన్న సుమతికి కళ్లలో నీళ్లు తిరిగాయి 'ఎంతమంచి మనసో మామయ్యది' అనుకుంది తృప్తిగా. 
లక్ష్మమ్మ శ్రీధర్ తో " 65 ఏళ్ల మర్రిచెట్టు కదిలింది. కదలడానికి కష్టం రావాల్సి వచ్చింది. కన్నీళ్లు రావాల్సి వచ్చింది.  కానీ చివరికి చలించింది. కోడలిని అపురూపంగా చూసుకుంటున్నాడు" అని అన్నది.
" ఔనమ్మా! ఇక మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. పొలం కూడా నేనే చూసుకుంటాను. ఇన్నాళ్ళూ కౌలకు ఇచ్చి ఇబ్బంది పడ్డాము. నాన్న మారారు. సమస్యలన్నీ తీరిపోతాయి ఇక మెల్లగా" అన్నాడు శ్రీధర్ సంతోషంగా.
కామెంట్‌లు
యేచన్ చంద్ర శేఖర్ చెప్పారు…
మంచి సందేశాత్మక కథ అందించినందుకు మీకు అభినందనలు మేడం 🙏