అమెరికా నుండి ఆమదాలవలస వచ్చిన అమృతకి అందాల తన సొంత అవనితల్లిని చూసేసరికి చెప్పలేని ఆనందం కలిగింది.
"ఏయ్! అమృతా! ఏంటి పరధ్యానంలో వెళ్ళావు? సొంత ఊరిని చూసేసరికి మైమరచిపోయావా!" అన్నాడు అమృత భర్త ఆనంద్ చమత్కారంగా.
"మీరన్నది నిజమేనండీ!" అన్నది అమృత సంబరంగా. "ఎటు చూసినా పచ్చని పంటపొలాలు. కొబ్బరి చెట్ల వరుసలు, కాలువలు, రోడ్లకిరువైపులా పూల మొక్కలు, చల్లని గాలి నిచ్చే చెట్లు, ఎవరికి మాత్రం నచ్చదు ఈ వాతావరణం? ఏదో నన్ను ఎగతాళి చేస్తున్నారు గానీ మీకు మాత్రం సంబరమేగా!" అన్నది అమృత తనేమీ తీసిపోదు అన్నట్లు.
"తల్లీ నీకో నమస్కారం!"అని పైకి అన్నా...పుట్టి పెరిగిన ఊరంటే తనకీ అపురూపమే అనుకున్నాడు మనసులో.
ఎడ్ల బండిలో కావాలనే వస్తున్నారు. పాత మధురానుభవం మరల పొందాలని.
కొంచెం దూరంలో మాగాణి చేలో గొర్రుతో దున్ని, బ్లేడ్‌తో చదును చేస్తున్నారు, వరి నాటడానికి సిద్ధం చేస్తున్నారు.
ఆ పక్కనే నారు పోసిన నేలలో కలుపు మొక్కలు తీస్తున్నారు కూలీలు. పక్కనే గట్టుమీద పక్కింటి రాఘవరావుగారు ఉన్నారు పర్యవేక్షిస్తూ.
"అమృతా! అటుచూడు ఆ నారుమడి ఎంత బాగుందో కదూ!"అన్నాడు ఆనంద్ భార్యతో పరవశంగా.
"పచ్చని తివాచీ పరిచినట్లున్న పంట చేలు. ఎంత పెద్ద తివాచీ! ఆశ్చర్యం కలిగేలా ఉంది కదూ! ఆకలే వెయ్యదు ఈ ప్రకృతి అందాలకు కదా డియర్!" అన్నది అమృత తన్మయత్వంతో.
"అమృతా అటు చూడవోయ్ డార్లింగ్! ఆ పొలాలు చూస్తుంటే నాకు కవిత్వం వచ్చేలా ఉంది" అన్నాడు ఆనంద్.
"ఒక పేపరు కలము ఇమ్మంటారా! దొరగారికి రాయడానికి కవిత్వం" అంటూ వెటకారంగా అంది.
"ధరణి తల్లి హరితవర్ణపు చీరతో హర్ష వదనంతో విరాజిల్లుతోంది" అన్నాడు ఆనంద్...
"అక్కడక్కడా విరిసిన రంగురంగుల పూలు క్రొంగొత్త అందాన్ని ఇస్తున్నాయి"అని మరో వాక్యం పూర్తి చేసింది అమృత.
"పచ్చని సొగసుల చిన్నది!
విచ్చని బంగరు వన్నెది!
మెచ్చిన ఇచ్చును సర్వము!
మనసుకు నచ్చిన పర్వము!"
"అది ప్రకృతి అయినా... పడతి అయినా" అన్నాడు ఆనంద్.
"అబ్బో దొరగారికి నిజంగానే కవిత్వం పొంగిపొర్లుతోందే" అన్నది అమృత మురిపెంగా.
చిన్నపిల్లల్లా కేరింతలు కొడుతూ పాటలు పాడుతూ తుళ్ళుతూ ప్రయాణం సాగిస్తున్నారు.
"మన కడుపులోకి నాలుగు మెతుకులు పోవాలంటే రైతన్నలు కష్టపడాలి. వాళ్ళ కష్టం మరువకూడదు ఎవ్వరూ!"అన్నది అమృత.
"అన్నదాతను మించిన ఆరాధ్య దైవం లేరు ఇలలో" అన్నాడు ఆనంద్.
ఇంతలో ఇల్లు రానే వచ్చింది. సామాన్లు ఆనంది రాములు లోపల పెడుతున్నారు.
"అయ్యగోరూ! సిన్నమ్మాయి గోరు, అబ్బాయిగోరు బండి ఎక్కినప్పటి సంది పొలాల గురించి కవిత్వం, మాటలు పాటలు ఒకటేంటయ్యగారూ, సిటీకి ఇంటికాడికి వచ్చేసినాం. మన రాముడు, భీముడు ఎద్దులు కూడా ఆరి మాటలు ఆలకిస్తూ హుషారుగా వచ్చేసినాయి బాబూ!" అన్నాడు రాములు అమృత తండ్రితో.
అమృత ఆనంద్ ఇంకా ఆ పారవశ్యంలో నుండే తేరుకోలేదు. ఆనంద్ ఒక నిర్ణయం తీసుకుని అమృతకు చెప్పాడు. ఎగిరి గంతేసింది. 'ఇక అమెరికా నుండి పూర్తిగా వచ్చేసి ఇక్కడే ఉందాం. వీళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటూ. మన పొలం మనమే చూసుకుందాం' అన్న భర్త నిర్ణయానికి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి