కృష్ణ ప్రేమ : - యామిజాల జగదీశ్
 

ఒకరోజు ఆడుకుంటున్నప్పుడు బాలకృష్ణుడు వణుకుతున్న ఒక చిన్న పక్షిని చూశాడు... ఆ తర్వాత జరిగిన సంఘటనతో గోకులమంతా నిజమైన ప్రేమ అర్థాన్ని తెలుసుకుంది. 
గోకులంలో ఒక మధ్యాహ్న వేళ.... బాలకృష్ణుడు తన మిత్రులతో కలిసి ఇంటి ముంగిట ఆడుకుంటున్నాడు. కొద్దిసేపు మట్టితో చిన్న పక్షులను చేస్తూ, కొద్దిసేపు పరుగులు తీస్తూ, మరికొద్దిసేపు గోపబాలురతో నవ్వుకుంటూ గడుపుతున్నాడు.
అప్పుడే కృష్ణుడి దృష్టి ఒక చిన్న గోధుమ రంగు పక్షిపై పడింది. అది నేలపై వణుకుతూ నిలబడి ఉంది. దానికి రెక్క దెబ్బతినడం వల్ల ఎగరలేకపోతోంది.
గోపబాలురు అన్నారు: "కృష్ణా, ఇది ఇక ఎప్పటికీ ఎగరలేదు."
ఆ మాట వినగానే కృష్ణుడు దాని దగ్గరకు వెళ్లాడు. లోకంలోకెల్లా విలువైన నిధిని పట్టుకున్నంత జాగ్రత్తగా దానిని తన రెండు చేతుల్లోకి తీసుకున్నాడు.
ప్రేమగా అన్నాడు: "భయపడకు చిన్నదానా... నేను ఉన్నంతవరకు నీకేమీ కాదు."
కృష్ణుడు ఆ పక్షిని ఇంటికి తీసుకెళ్లాడు. యశోదమ్మ ఒక శుభ్రమైన గుడ్డ తెచ్చి ఇచ్చింది. కృష్ణుడు దాని రెక్కలను ప్రేమగా నిమురుతూ తాగడానికి కొద్దిగా నీళ్లు ఇచ్చాడు.
కొద్దిసేపటికి పక్షి వణుకుడు తగ్గింది. అది ప్రశాంతంగా మారింది.
సాయంత్రం వరకు కృష్ణుడు దానిని తన గుండెలకు హత్తుకుని ఉంచుకున్నాడు. కొన్ని ధాన్యపు గింజలు తినిపిస్తూ, తన చిన్న స్నేహితురాలితో మాట్లాడినట్లే దానితో తీయగా మాట్లాడాడు.
మరుసటి రోజు సూర్యోదయ వేళ కృష్ణుడు ఆ పక్షిని బయటకు తీసుకువచ్చాడు. చేతిని మెల్లగా చాచి ప్రేమగా అన్నాడు: "ఎగిరిపో చిన్నదానా... విశాలమైన ఆకాశం నీకోసం వేచి చూస్తోంది."
పక్షి మెల్లగా రెక్కలు కదల్చటం ప్రారంభించింది. ఆ తర్వాత ఆకాశంలోకి ఎగిరింది. కొద్దిసేపు కృష్ణుడి తలపై వలయాకారంలో తిరిగింది. కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా ఉందా దృశ్యం.
గోపబాలురు ఆశ్చర్యంతో అన్నారు: "కృష్ణా, నువ్వు నిజంగా అందరికీ మంచి స్నేహితుడివి!"
యశోదమ్మ కళ్ళు ఆనందబాష్పాలతో నిండాయి. ఆమె కృష్ణుడిని అక్కున చేర్చుకుని అంది: " నా కన్నా, నువ్వు గోకులానికి మాత్రమే కాదు, ఈ ప్రపంచంలోని ప్రతి నిస్సహాయ జీవికి రక్షకుడివి."
సందేశం శ్రీకృష్ణుని కరుణ మానవులకే పరిమితం కాదు. మాట్లాడలేని చిన్న జీవుల బాధను కూడా అర్థం చేసుకుని వాటిపై ప్రేమ, కరుణ చూపేవారే నిజంగా దైవత్వానికి అతి దగ్గరగా ఉంటారు. 
దెబ్బతిన్న ఆ చిన్న పక్షిని ప్రేమతో చేతుల్లోకి తీసుకుని సేవించి, ఆరోగ్యం కుదుటపడ్డాక మళ్ళీ విశాల ఆకాశంలోకి పంపించిన శ్రీకృష్ణుని ఈ లీల మనకు ఒకటే నేర్పుతోంది — నిజమైన ప్రేమ అంటే ప్రతి జీవి బాధను అర్థం చేసుకుని కరుణ చూపించడమే.
కామెంట్‌లు