ప్రియా కుండ్ రాధమ్మ దివ్య లీలలకు నిదర్శనం. ఈ ప్రదేశం రాధాకృష్ణుల మధురమైన ప్రేమకు గుర్తుగా, లక్షలాది మంది భక్తుల నమ్మకానికి కేంద్రంగా విరాజిల్లుతోంది.
యశోదమ్మ వాత్సల్యం
ఒకరోజు రాధ తన చెలికత్తెలతో కలిసి నందగావ్‌లోని యశోదమ్మను చూడటానికి వెళ్ళింది. రాధ దివ్య సౌందర్యం, నమ్రత, మధురమైన ప్రవర్తన చూసి యశోదమ్మ హృదయం వాత్సల్యంతో నిండిపోయింది.
ఇంతటి దివ్యమైన కన్య తన ముద్దుల కృష్ణుడికి భార్య అయితే అంతకంటే అదృష్టం ఏముంటుందని యశోదమ్మ భావించింది. ఆ అపారమైన ప్రేమతో శుభ శకునంగా రాధ కోమలమైన చేతులకు పసుపు రాసింది. ఆ కాలంలో కాబోయే కోడలికి పసుపు రాయడం శుభప్రదమైన ఆచారంగా ఉండేది.
రాధ సంకోచం
కొద్దిసేపటి తర్వాత రాధ తన చెలికత్తెలతో బరసనాకు తిరుగుపయనమైంది. దారిలో తన చేతులు పసుపు రంగులోకి మారడం చూసింది. అది చూసి ఆమె తీవ్రమైన సంకోచానికి కారణమైంది. ఇలాగే ఇంటికి వెళ్తే ఇంట్లోని వారు, చెలికత్తెలు రకరకాల ప్రశ్నలు అడుగుతారని భావించింది.
సిగ్గుతో దారిలోని ఒక ప్రశాంతమైన సరస్సు ఒడ్డున ఆగాలని నిశ్చయించుకుంది రాధ.
రాధ అక్కడి సరస్సు నీటిలో తన చేతులను కడగడం కోసం ఆగింది. ఆమె చేతుల పసుపు నీటిలో కలవగానే సరస్సు నీరంతా బంగారు వర్ణంలోకి మారి మెరిసిపోయింది.
బ్రజ్ వాసులు ఈ అద్భుతమైన పవిత్ర లీలను చూసి ఆ సరస్సుకు "పీలీ పోఖర్" అని పేరు పెట్టారు. రాధమ్మ పవిత్ర స్పర్శతో పునీతమైందంటూ దీనిని "ప్రియా కుండ్" అని కూడా పిలువసాగారు.
రాధాకృష్ణుల జలకాలాటలు
బ్రజ్ సాంప్రదాయాల ప్రకారం, రాధాకృష్ణులు తమ చెలికత్తెలతో కలిసి ఈ సరస్సులోనే జలకాలాటలు, మధురమైన ప్రేమ లీలలు సాగించారు. అందుకే ఈ కుండం కేవలం ఒక సరస్సు మాత్రమే కాదు, రాధాకృష్ణుల దివ్య ప్రేమకు సజీవ ప్రతీక.
ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
నేటికీ బరసానా వచ్చే సరళ పీలీ పోఖర్‌ను దర్శించి రాధమ్మ కరుణ, ప్రేమను స్మరించుకుంటారు. ఇక్కడ శ్రద్ధతో దర్శనం చేసుకుని రాధ నామం జపించే భక్తుల జీవితంలో ప్రేమ, భక్తి, మనఃశుద్ధి కలుగుతుందని నమ్ముతారు.
కథ ఇచ్చే సందేశం
భగవంతుని పట్ల నిష్కల్మషమైన ప్రేమ, వినయం, భక్తికి దివ్యమైన ఆభరణాలని ఈ కథ మనకు నేర్పుతుంది. రాధమ్మ ప్రతి చర్య ప్రేమ, సమర్పణ భావాన్ని చాటుతుంది. ఈ ప్రేమే బ్రజ్ భూమిలోని ప్రతి లీలకు మూలాధారం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి