సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 కర్ణ పర్వము ప్రథమాశ్వాసము- 366 వ రోజు


దృతరాష్ట్రుడు కర్ణుడి మరణానికి ఆశ్చర్యపడుట
సంజయా! గతజలసేతు బంధనమేల ! అసలు కర్ణుడు ఎలా చనిపోయాడు ? అర్జునుడు కపటోపాయంతో భీష్ముని చంపినట్లు కర్ణుడిని చంపడానికి కూడా కపటో పాయం పన్నాడా ! మన సైనికిలు వీరులూ కర్ణుని రక్షించడానికి ప్రయత్నించ లేదా ! కర్ణుడిని వంటరిగా వదిలి అందరూ పారిపోయారా ! సంజయా ! కర్ణుడు సామాన్యుడు కాదు. పరశురాముడి శిష్యుడై బ్రహ్మాస్త్రం పొందాడు, సర్పముఖ శాస్త్రం తెలిసిన వాడు. దివ్యాస్త్ర బల సంపన్నుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఉపాయశాలి. ఆ ఉపాయంతోనే అభిమన్యుడిని చంపాడు కదా ! అసురవీరుడూ, మాయావీ, నిశాచరుడు, యుద్ధవిద్యా నిపుణుడు అయిన ఘటోత్కచుని సంహరించిన వాడు. నకుల సహదేవుల గెలిచి వదిలిన వాడు. అతడి దివ్యాస్త్రాలు ఏమయ్యాయి. అవి నశించాయా ! లేక నిష్ప్రయోజనం అయ్యాయా ! అతడి రథము విరిగి పోయిందా ! సంజయా ! అతడి సారథి శల్యుడు ఏమి చేస్తున్నాడు. అర్జునుడు కర్ణుని చంపుతున్నప్పుడు శకుని, కృపాచార్యుడు, అశ్వత్థామ ఏమి చేస్తున్నారు. కృతవర్మను సుయోధనుడు ఎక్కువగా అభిమానిస్తుంటాడు. అతడు కూడా కర్ణుడిని కాపాడటానికి రాలేదా ! నా కుమారుడు సుయోధనుడు ఏమి చేస్తున్నాడు. అశ్వత్థామ, శకుని, కృపాచార్యుడు, కృతవర్మలు వెంట ఉండగా నిష్కారణంగా కర్ణుడు ఎలా చచ్చాడు. పాండవులు కర్ణుని మీద ఎలా దాడి చేసారు. కర్ణుడి సర్పముఖాస్త్రాన్ని అర్జునుడు ఎలా తప్పించుకున్నాడు. మిగిలిన పాండవులు కర్ణుడితో ఎలా యుద్ధము చేసారు. ఈ రెండు రోజుల యుద్ధము ఎలా జరిగింది " అన్నాడు.
కౌరవ సైన్యాధ్యక్ష నిర్ణయం
సంజయుడు " మహారాజా ! ద్రోణాచార్యుడు పడిపోయిన తరువాత సాయంత్రం వరకు యుద్ధం జరిగింది ఆ తరువాత యుద్ధం చాలించి తమ తమ శిభిరాలకు వెళ్ళారు. సుయోధనుడు తమ శిభిరంలో అశ్వత్థామ, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని మొదలగు యోధులతో సమాలోచనలు జరిపి తరువాతి సైన్యాధ్యక్షుడు ఎవరిని నియమించాలి అని అశ్వత్థామను అభిప్రాయం అడిగాడు. అశ్వత్థామ సుయోధనుడు ఆలోచనకు అనుగుణంగా " సద్గుణ సంపన్నులైన భీష్ముడు, ద్రోణుడు వెళ్ళి పోయారు. మన సైన్యంలో సర్వ సైన్యాధ్యక్ష పదవికి అర్హులు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరిని ఎంచుకో. నా అభిప్రాయం ప్రకారం కర్ణుడు ఇందుకు సమర్ధుడు. అతడి వద్ద అశేషమైన దివ్యాస్త్రసంపద ఉంది. శత్రు సైన్యమును నాశనం చేయడంలో మేటి. విశ్వాసపాత్రుడు, నీ ప్రియ మిత్రుడు. కనుక అతడిని సైన్యద్యక్షిడిని చెయ్యి " అన్నాడు. అశ్వత్థామ పలుకులు విని సుయోధనుడికి ఆనందానికి అవధులు లేక పోయింది. కర్ణుడిని చూసి " మిత్రమా కర్ణా ! భీష్మ, ద్రోణుల తరువాత అంతటి సమర్ధుడివి నీవే. ఇన్ని రోజులు భీష్మ, ద్రోణులు పాండవ పక్షపాతంతో వారిని చంపక వదిలారని నీవు సేనాపతివి అయు ఉంటే పాండవ నిర్మూలనము ఎప్పుడో జరిగి ఉండేది. ఇప్పటికి యుద్ధము ముగిసి మనను విజయలక్ష్మి వరించేది " అన్నాడు. ఈ మాటలకు " కర్ణుడు పొంగి పోయి " సుయోధనా ! నేను నీకు పాండవులను అందరినీ జయిస్తాను అని మాట ఇచ్చాను. ఇప్పుడు ఆ మాట నెరవేర్చుకుని నిన్ను ఆనంద పరుస్తాను. ఈ యుద్ధానికి నేను ఒక్కడినే చాలు నీవు చూస్తూ పక్కన ఉంటే చాలు. పాండవులను జయించి నిన్ను సర్వంసహా భూమండలానికి పట్టాభి షిక్తుడిని చేస్తాను " అన్నాడు.
కర్ణుని సైన్యాధ్యక్షుని చేయుట
సుయోధనుడు పుణ్య నదీ జలాలు తెచ్చి, ఉన్నతాసనము వేసి, కర్ణుని అందు ఆశీనుడిని చేసి, నదీ జలముతో అభిషేకము చేసి, పుణ్యాహవాచనము చేసి మొదలగు క్రతువులు చేయించి వంధి మాగధుల జయజయ ధ్వనుల మధ్య కర్ణుని సర్వ సైన్యాధ్యక్షుని చేసాడు. కర్ణుడు సుయోధనుడిని చూసి " మిత్రమా ! నాడు నన్ను అంగరాజ్యానికి అభిషిక్తుడిని చేసి పది మందిలో నా పరువు నిలిపావు. నేడు నన్ను సైన్యాధ్యక్షుడిని చేసి గౌరవించావు. ఇందుకు ప్రతిగా నేను నీకు ఏమి ఇవ్వగలను ? బంధు మిత్రసమేతంగా పాండవులను చంపి నిన్ను సమస్త కురు సామ్రాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిషిక్తుని చేస్తాను నీవు పుత్ర పౌత్ర సమేతంగా సుఖంగా ఆచంద్రార్కం పాలించు " అన్నాడు. సుయోధనుడు ఆ మాటలకు పరమానంద భరితుడయ్యాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు