కర్ణ పర్వము ప్రథమాశ్వాసము: 369 వ రోజు
దుశ్శాసనుడు సహదేవుడిని ఎదుర్కొనుట
సహదేవుడు దుశ్శాసనుడితో యుద్ధము చేస్తున్నాడు. దుశ్శాసనుడు సహదేవునిపై నిశిత బాణములు వేసాడు. సహదేవుడు కోపించి డెబ్భై బాణములతో దుశ్శాసనుడిని కొట్టాడు. దుశ్శాసనుడు సహదేవుడి విల్లు విరిచి డెబ్భై బాణములు అతడి మీద వేసాడు. సహదేవుడు కోపించి కత్తి తీసుకుని దుశ్శాసనుడి విల్లు విరిచాడు. దుశ్శాసనుడు కత్తి తీసుకుని సహదేవుని మీద విసిరాడు. సహదేవుడు దానిని మధ్యలోనే విరిచాడు. దుశ్శాసనుడు మరొక విల్లు తీసుకుని సహదేవుడిపై అరవైనాలుగు బాణములు ప్రయోగించాడు. సహదేవుడు వాటిని మధ్యలోనే తుంచాడు. సహదేవుడు నూరు శిలీఖములను దుశ్శాసనుడి మీద వేసాడు. దుశ్శాసనుడు వాటన్నిటినీ మూడు బాణములతో తుంచి రెండు సాయకములను సహదేవుడి మీద వేసాడు. సహదేవుడు కాంతులు వెదజల్లే ఒక అస్త్రమును దుశ్శాసనుడి మీద వేసాడు. ఆ అస్త్రము దుశ్శాసనుడి కవచము చీల్చి అతడిని మూర్ఛిల్లజేసింది. అతడి సారథి వణుకుతూ రథమును అక్కడి నుండి దూరంగా తీసుకు వెళ్ళాడు.
నకులుని భంగపాటు
నకులుడు కర్ణుడిని ఎదుర్కొని " కర్ణా ! ఈ రోజు మంచి రోజు కనుక నువ్వు నా ఎదుట పడ్డావు. కురు పాండవుల వైరముకు మూల కారణం నీవు. నిన్ను చంపనిది నా కోపము చల్లారదు. నేటితో నీ ఆయువు సరి " అన్నాడు. కర్ణుడు " ఓ నకులరాజకుమారా ! మహాస్త్రకోవిదుడవైన నువ్వు ఇలా మాట్లాడటం సహజమే. రా మనిద్దరము యుద్ధము చేసి బలాబలాలు తేల్చుకుంటాము " అన్నాడు. కర్ణుడు నకులుని మీద డెబ్భై బాణములతో కప్పాడు. నకులుడు కూడ డెబ్భై వాడి అయిన బాణాలు నకులుని మీద వేసాడు. మరొక బాణముతో కర్ణుడి ధనస్సు విరిచి మూడు వందల బాణములు కర్ణుడి మీద ప్రయోగించాడు. కర్ణుడు మరొక విల్లు తీసుకుని అయిదు బాణములు నకులుడి వక్షస్థలంలో దింపాడు. నకులుడు ఏడు బాణములతో కర్ణుడి విల్లు విరిచాడు. కర్ణుడు కర్ణుడు మరొక విల్లందుకున్నాడు. అప్పుడు ద్రుపదుడి సేనలు నకులుడికి సాయంగా వచ్చాయి. కర్ణుడు అతి క్రూరబాణ ప్రయోగం చేసి వారిని చెదరగొట్టాడు. కర్ణుడు నకులుడి విల్లు విరిచి అతడి హయములను చంపి, సారథిని గాయపరిచాడు, అతడి చక్రరక్షకులను చంపి, నకులుడి కేతనము విరిచాడు. నకులుడు కత్తి డాలు తీసుకుని కర్ణుడిని ఎదుర్కొన్నాడు. కర్ణుడు వాటిని ముక్కలు చేసాడు. నకులుడు గద తీసుకుని కర్ణుడిని ఎదుర్కొన్నాడు. కర్ణుడు దానిని ముక్కలు చేసి నకులుడి ఆయువు పట్టులో బాణములతో కొట్ట సాగాడు. నకులుడు ఆ దెబ్బలు భరించ లేక పారిపోయాడు. కర్ణుడు వెంబడించి పట్టుకుని " నకులా ! నన్ను ఇందాక అనవసరంగా అనరాని మాటలనడం తప్పు కదా ! మాటాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నవు, ఎన్ని మాటలు మాటాడాలి, ఎలా మాటాడాలి అని తెలుసుకుని మాట్లాడు. ఇప్పటికైనా నూవు నాకంటే తక్కువస్థాయి వీరుడవని తెలుసుకున్నావు. యుద్ధము చేసేటప్పుడు నీ బలము ఎదిరి బలము తెలుసుకుని యుద్ధము చెయ్యి. అంతే కాని నీకన్నా బలవంతుని ఎదుర్కొని ఇలా పారిపోకూడదు. నీవు నాకంటే చిన్న వాడివి కనుక నిన్ను నేను చంపను. కుమారా ! నీవు అర్జునుడి వద్దకు వెళ్ళు " అన్నాడు. నకులుడు సిగ్గుతో తలవంచుకుని ధర్మరాజు రథము ఎక్కాడు. నకులుడి పరాభవంతో కర్ణుడు విజృంభించి పాండవసేనను చిన్నాభిన్నం చేయసాగాడు. సారధులను చంపుతున్నాడు, రథికుల తలలు నరుకుతున్నాడు. హయములను చంపుతున్నాడు. రథములు విరుగ కొడుతున్నాడు. పాండవసేనను నిర్మూలం చేస్తున్నాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి