విలువల వెలుగులు వెలవెలబోయినవేళ...
ధర్మవృక్షమై ధరణినికాచే ఛత్రమునేనే!
ఛత్రమునేనైనిలబడి...సన్నగిల్లిన
స్నేహసుగంధాలను పునరుజ్జీవింపజేసే
పరిమళమునేనే!
పరిమళమునేనైవ్యాపించి...వ్యవస్థల
ఇనుప బంధనాలనుతెంచే
విముక్తి నాయకుడనునేనే!
నాయకుడను నేనైనడిపి...
మనిషిని-పనిని మానవత్వపు
మైత్రితో మేళవించే విశ్వకర్మనునేనే!
విశ్వకర్మను నేనైనిర్మించి...
మమతామృతాన్ని మోసుకొచ్చే
కరుణా మేఘమునేనే!
మేఘము నేనైకురిసి...
మట్టి బిడ్డల ఆకలితీర్చి ఆశలజ్యోతులు
వెలిగించే శక్తిని నేనే!
శక్తినినేనై ఉదయించి...పాపాత్ముల
పరమార్థప్రగల్భాలను అణచివేసే
నిప్పుకణికను నేనే!
నిప్పుకణికను నేనై ప్రజ్వలించి...
నిగూఢమైన నిజనీతులను
జ్ఞాపకముచేసే బోధకుడను నేనే!
బోధకుడను నేనైహెచ్చరించి...
ప్రకృతి సంపదను పీల్చే
దురాశకు సింహనాదము నేనే!
సింహనాదము నేనై గర్జించి...
సత్యస్ఫూర్తిని రగిలించే
అజేయమైన ప్రేరణను నేనే!
ప్రేరణను నేనై జనించి...
కాలగమనంలో చెరగనిముద్రగా
మిగిలే జీవనకావ్యము నేనే!
కావ్యమునేనై వికసించి...
ప్రజలహృదయ వీధులందు
నిరంతరంనిలిచే చిరస్మరణీయుడనునేనే!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి