గురువాయూర్!: - - యామిజాల జగదీశ్
 



సృష్టి కొత్తగా ప్రారంభం కావడానికి సిద్ధమైన సమయంలో, మహావిష్ణువు దివ్యమైన కృష్ణ విగ్రహాన్ని భూలోకంలో ప్రతిష్ఠించాలంటే దైవీక ఆలోచన దేవతలకు కలిగిందట.
ఆ పవిత్ర కార్యానికి ఎవరిని ఎంపిక చేసారో తెలుసా? దేవతల గురువైన బృహస్పతిని, సకల ప్రాణులకు శ్వాసగా నిలిచే వాయు దేవుడిని. ఒకవైపు జ్ఞాన స్వరూపం, మరోవైపు ప్రాణ స్వరూపం. ఇద్దరూ కలిసి ఆ దివ్య విగ్రహాన్ని మోస్తూ, భగవంతుడు మెచ్చే స్థలం కోసం భూమి అంతటా వెతుక్కుంటూ వెళ్లారట.
వారు వెళ్లిన ప్రదేశాలన్నీ పవిత్రమైనవే అయినా, ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించ డానికి తగిన చోటు మాత్రం వారికి కనిపించలేదట. చివరికి, పచ్చదనంతో నిండిన ఓ ప్రశాంతమైన ప్రదర్శన చేరుకోగానే, అక్కడ సాక్షాత్తూ పరమశివుడే వారికి స్వాగతం పలికి, "ఈ ప్రదేశమే నారాయణుడి నివాసస్థానంగా విలసిల్లనీ. ఇక్కడే ప్రతిష్ఠించండి" అని అనుగ్రహించారు.
అలా శివుని అనుమతితో, గురువు, వాయు దేవుడు కలిసి కృష్ణ విగ్రహాన్ని స్థాపించిన ఆ క్షణం నుంచే ఆ పవిత్ర క్షేత్రం, "గురు", "వాయు" అనే రెండు దైవిక పేర్లతో కలిసి "గురువాయూర్"గా పేరొందింది. (గురు+వాయు+ఊరు).
అద్భుతం! ఒక ఊరి పేరులో ఇద్దరు దేవతల సేవలు చిరస్థాయిగా నిలిచిపోవడం ఎంతటి గొప్ప విషయం!
'గురు' అంటే జ్ఞానానికి ప్రతీక. 'వాయు' అంటే ప్రాణానికి సంకేతం. జ్ఞానం, ప్రాణం ఒకటైనప్పుడే మనిషి భగవంతుడిని చేరుకోగలడు. జ్ఞానం లేని జీవితం పరిపూర్ణం కాదు. ప్రాణస్పందన లేని జ్ఞానం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ రెండూ భగవంతుని పాదాల చెంత సంగమించే పవిత్ర స్థలమే ఈ గురువాయూర్.
కామెంట్‌లు