రాధమ్మ తలంపు: - - యామిజాల జగదీశ్
 

మధురమైన అమృతంలాంటి రాధ దివ్యప్రేమ ఎంతో తియ్యనిది ! ఆమె మాధుర్యం ముందు నల్లని యమునా నది నీళ్లు కూడా అమృతంలా అనిపిస్తున్నాయంటారు బృందావనవాసులు.
నల్లని యమునమ్మ ఒకవైపు ఉంటే, మేలిమి బంగారంలా మెరిసే రాధమ్మ మరొక వైపు ప్రకాశిస్తోంది. 
రాధమ్మ తన నడకతో బృందావనమంతటా తనివితీరని ఆనందాన్ని, పండుగ ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ పవిత్ర భూమి అంతా  రాధమ్మ ఏలుతున్న సామ్రాజ్యంగా మారింది.
రేయింబవళ్లు కృష్ణుడు తన మురళీ గానంతో ఆమెనే పిలుస్తుంటాడు. ఆయన గుండెల్లో ప్రతీక్షణం ఆమె తలపే మెదులుతోంది. అనంత విశ్వాలను మైమరిపించే ఆ శ్యాముడు ఎన్ని రూపాలు ఎత్తినా, రాధమ్మ అసమానమైన అందం ముందు సాటి రానిదే. ఆమె మాత్రమే ఆయన హృదయాన్ని ఏలే మహారాణి.
వెన్న, కలకండ, లోకంలో ఉన్న ఏ తీపి పదార్థాలు కూడా నాకు నచ్చడం లేదు. నా నాలుక ఇప్పుడు 'రాధా... రాధా...' అని పలకడానికి మాత్రమే తపిస్తోందని కృష్ణుడు అనడం అతిశయోక్తి కాదు.
ఎవరైతే రాత్రింబవళ్లు ప్రతీ శ్వాసలో ఆ రాధా నామాన్ని జపిస్తారో, వారి కష్టాలన్నీ ఆ తల్లి అపారమైన దయతో తొలగిపోతాయి. రాధమ్మ చరణాలను ఆశ్రయిస్తే జీవితం ధన్యమవుతుంది, పరిపూర్ణంగా మారుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చును.
కామెంట్‌లు