సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 

 

సామెత -314: ఇల్లే తీర్థం-కడుపే కైలాసం

" అనుకుంటం గనవ్వా! కొంత మందిరి బయిటి పెపంచకం తెల్వకుండనే బత్కుతరు.గట్లనే బత్కంత ఎల్లదీత్తరు. గాళ్ళకి ఎవ్వలెటుబోయిర్రో గీ లోకం ఎటుబోతుందో పట్టదు. బలే గమ్మతి మడుసులు అవ్వా! ఎవ్వలికి ఆని జెయ్యరు గని.గాళ్ళకు గాళ్ళు సుత గాకుండనే యింతగ బత్కు ఎల్లదీత్తుర్రు"
 "ఎవ్వలి యిష్యం శెల్లే?గంత బాయిల కప్పలోలె గీ దినాలల్ల బత్కేటోళ్ళు సుత ఉర్రంటే అశ్చిరంగుంది ఎవలు శెల్లే! గంత ఇచ్ఛింత్రం మడుసులు.యింటుంటెనే శిత్రంగుంది."
"గాల్లే అవ్వా! గా ఎల్లయ్య మావోఁల్లు ఉన్రు సూడు.గాళ్ళకి ఒళ్ళు సోయిందా? ఇల్లు సోయుందా? శెప్పు. ''మందిల గలవరు - మంచినీళ్ళు తాగరంటే" గాళ్ళనే శెప్పొచ్చు! శెవ్వా! ఏం మడుసులు ఏమో? గింత తెలివిలేనట్టు శీకట్ల బత్కటోళ్ళను గీళ్ళనే సూశిన."
" ఓష్నీ! గాళ్ళా శెల్లే! గా సూరయ్య మావఁ ముచ్చెటేనా నువ్వు శెప్పేది.సడేలే! గా  మావఁ పాలికి పాతికెకరాల పొలమొచ్చింది.బాయి,శిన్న కుంట శెర్వు .గా పొలంల ఒకప్పుడు బంగారమస్మంటి పంట బండేది."
"అవ్వా!  గిప్పుడు సుత శాన్నే పొలముంది.బంగారమస్మంటి పంట పండుతనే ఉంది. గదేం శాపమో అవ్వా! గంతుండి సుత ఏనాడూ ఆయిమన్న బట్ట గట్టంగ సూడలే. ఇంట్లె ఆడోళ్ళకి నగో నట్రో శేయించడం సూడలే.ఇంకో శిత్రం శెప్పనా.ఏ దినం కా దినం ఉప్పుతో తొమ్మిది పప్పుతో పది కొనుక్కోడం సూత్తుంటే గీళ్ళకి పంటమీదొచ్చిన ఆమ్దాని ఏం జేసిర్రో అన్పిత్తది . గా రగస్యం గిప్పటికీ తెల్వకనే పాయె."
 "నిజవే శెల్లే గా కొంపేమన్న సుబ్బరంగుందా? గక్కన్నే పందికొక్కులు తొవ్విపోశిన మన్ను కుప్పలు.గా పక్కన్నే పిల్లి దాని పిల్లలు ఆ గిన్నెల ఈ గిన్నెల మూతులు బెట్టుడు. గీ నడ్మల మా సుట్టపోళ్ళు వొచ్చిర్రు .గాళ్ళింటికి పోదమంటే పొయ్యినం శెల్లే! గవన్ని సూశి వొచ్చినోళ్ళు ఏవఁనుకున్రో అని యిజ్జత్ పోయిందన్కో.
 "గదే గదవ్వా! నేను సుత శెప్పేది!  గా ఇల్లు తప్పనిడిశి యాడికి బొయ్యేది లేదు.ఊల్లె ఎంత పండుగలు పబ్బాల అడావుడి వున్న నల్గురిని కలుద్దాం,ఎవలెట్లుండ్రో సూశి నేర్సుకుందమని అనుకోరు . గింత యింగితం లేదు. ఏది సుత తెల్వదు. ఇంగ ఒక్క తిండి తాన మాత్తరం బరాబర్ గ తినంగ సూశినం.ఊళ్ళె ఏడ యేటను గోశ్నా , కోళ్ళు, మేకలు కోషినా గీళ్ళే ముందుంటరు.గా తినేతాన మాత్తరం తగ్గేదెలే అన్నట్టు శేత్తరవ్వా!"
 "గస్మంటోళ్ళని మనం గాదు బెమ్మ దేవుడు సుత బాగు జెయ్యలేడు,మార్సలేడు శెల్లే. గిస్మంటోళ్ళను సూశే మన పెద్దోళ్ళు"ఇల్లే తీర్థం-కడుపే కైలాసం "అన్న సామెత పుట్టించినట్టుర్రు శెల్లే!"
 "అవునవ్వా! బలే శెప్పినవ్! గీళ్ళకి మంచిగ సూటివెట్టినట్టుంది గీ సామెత. ఏమోలే అవ్వా! గీ పెపంచకంల అడివిలో బతికేటోళ్ళు సుత బయటికొచ్చి సక్కదనంగ బత్కుతుర్రు. గాళ్ళని గిట్లుండమని దేవుడేవన్న శాపం బెట్టిండేమో!"
 "శెల్లే! ఏం దేవుడు గట్ల అగ్నానంగ తెల్విలేకుండ ఎడ్డెగ,మడ్డెగ బత్కమని శెప్పడు.గాళ్ళ బుద్ధి తీరు గట్లుంది గంతే!"
అంతే అంటవా శెల్లే!"
"గదండీ సంగతి! ఇల్లే తీర్థం-కడుపే కైలాసం"*అంటే గిదే మరి.గస్మంటి మడుసులు మన నడ్మల ఉండ్రు గనకనే గిస్మంటి సామెత పుట్టించిర్రు."
కామెంట్‌లు