కసాయి నామస్మరణ: - - యామిజాల జగదీశ్


సదానన్ అనే కసాయి ఉండేవాడు. చేసేది జంతువులను నరికే వృత్తే అయినా, ఆయన అత్యంత సత్యసంధుడు, ఎప్పుడూ భగవంతుని నామస్మరణలో మునిగిపోయే గొప్ప భక్తుడు. మాంసం కోస్తూ, విక్రయిస్తున్నప్పుడు కూడా ఆయన నోటి వెంట నిరంతరం భగవన్నామమే వినిపిస్తూ ఉండేది.
ఒకరోజు మాంసం కోస్తుండగా ఒక నల్లటి రాయి ఆయన కాలికి తగిలింది. పని ఆపి ఆ రాయిని చేతిలోకి తీసుకుని చూశాడు. అది నల్లగా, బరువుగా ఉంది. "మాంసం తూచడానికి పనికొస్తుంది" అని అనుకుని దానిని తన జేబులో వేసుకున్నాడు.
ఇంటికి వెళ్లాక ఆ రాయిని త్రాసులో తూకం రాయిగా వాడటం మొదలుపెట్టాడు. కానీ కొన్ని రోజులకే అది సాధారణ రాయి కాదని ఆయనకు అర్థమైంది. ఎవరైనా ఎంత తూకం అడిగితే, అది అంత బరువుగా మారిపోయేది. ఒక కిలో మాంసం అడిగితే ఆ రాయి ఒక కిలో బరువు తూగేది; రెండు కిలోలు అడిగితే రెండు కిలోల బరువు అయ్యేది. అలా అడిగిన తూకానికి తగ్గట్టు దాని బరువు మారిపోతుంది.
ఈ వింత వార్త ఊరంతా పాకింది. ఆ రాయి మహిమ చూద్దామని జనాలు సదానన్ దుకాణానికి తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు. జనం పెరగడంతో ఆయన వ్యాపారం బాగా పుంజుకుంది.
ఈ సంగతి ఒక పండితుడైన బ్రాహ్మణుడి చెవిన పడింది. మాంసం అమ్మే అపవిత్రమైన స్థలానికి వెళ్లడానికి మొదట ఆయన కాస్త సంకోచించాడు. కానీ ఆ వింత రాయిని చూడాలనే కుతూహలం ఆయన్ని చివరికి సదానన్ దుకాణానికి తీసుకెళ్లింది.
ఆయన ఆ రాయి మహిమను స్వయంగా చూశాడు. దగ్గరగా వెళ్లి పరిశీలించారు. అది సాధారణ రాయి కాదని, సాక్షాత్తు శ్రీసాలగ్రామ శిల అని గుర్తుపట్టాడు.
జనాలందరూ వెళ్ళిపోయాక ఆ బ్రాహ్మణుడు సదానన్‌తో ఇలా అన్నాడు: "నువ్వు సాధారణ రాయి అనుకుని మాంసం తూచడానికి వాడుతున్నది సాక్షాత్తు ఆ భగవంతుని స్వరూపమైన శ్రీసాలగ్రామం. దీనిని ఇలా వాడటం చాలా పెద్ద అపచారం."
సదానన్ చాలా అమాయకుడైన భక్తుడు. బ్రాహ్మణుడి మాటలు వినగానే తెలియక ఎంత పెద్ద తప్పు చేశానో అని తీవ్రంగా కుమిలిపోయాడు. ఎంతో వినయంతో ఆ శ్రీశాలగ్రామాన్ని అందిస్తూ ఇలా అన్నాడు: "మీరు బ్రాహ్మణులు. దయచేసి శ్రీసాలగ్రామానికి యథావిధిగా సేవలు చేసి స్వామిని ప్రసన్నం చేసుకోండి. నేను చేయగలిగిన సేవ ఏదైనా ఉంటే దయచేసి చెప్పండి."
ఆ బ్రాహ్మణుడు ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీసాలగ్రామాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. పవిత్ర స్నానం చేయించి, పంచామృతాలతో అభిషేకించి, నిత్య పూజలు ప్రారంభించారు.
కొన్ని రోజులు గడిచాక ఒకరాత్రి శ్రీసాలగ్రామ స్వామి ఆ బ్రాహ్మణుడికి కలలో కనిపించి ఇలా చెప్పాడు: "ఓ బ్రాహ్మణుడా! నువ్వు చేసే పూజలు, సేవలు నాకు ఎంతో సంతోషాన్ని స్తున్నాయి. అయినా నన్ను మళ్లీ ఆ కసాయి సదానన్ దగ్గరకే తీసుకెళ్లండి."
బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో: "స్వామీ! దానికి కారణం ఏమిటి?" అని అడిగాడు.
అప్పుడు భగవంతుడు అన్నాడు: "నువ్వు నన్ను శాస్త్రోక్తంగా పూజిస్తున్నావు; అది నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నా నామాన్ని నిరంతరం జపిస్తూ, నా మహిమలను పాడుకునే భక్తులకు నన్ను నేను సమర్పించుకుంటాను. సదానన్ నీలా పూజలు చేయపోవచ్చు. కానీ ఆయన ఎల్లప్పుడూ ఎంతో వినయంతో నా నామాన్ని స్మరిస్తూనే ఉంటాడు. ఆ నామస్మరణే నాకు అత్యంత ప్రియమైనది.."
మరుసటి రోజే బ్రాహ్మణుడు సదానన్ ఇంటికి వెళ్లాడు. కలలో జరిగినదంతా చెప్పి శ్రీసాలగ్రామాన్ని ఆయనకు తిరిగి ఇచ్చేశాడు.
బ్రాహ్మణుడి మాటలు విన్న సదానన్ కళ్లు ఆనందబాష్పాలతో నిండిపోయాయి.
ఆ సంఘటన తర్వాత సదానన్ మాంసం వ్యాపారాన్ని వదిలేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. "నా స్వామికి నామసంకీర్తనే అత్యంత ప్రియమైనదైతే, ఇకపై నా జీవితాన్ని భగవన్నామ కీర్తనకే అంకితం చేస్తాను" అని ప్రతిన బూనాడు.
బాహ్య ఆచారాల కన్నా భక్తుని ఆత్మార్థమైన ప్రేమను, వినయాన్ని, నిరంతర నామస్మరణను మాత్రమే భగవంతుడు మిక్కిలి ప్రీతితో స్వీకరిస్తాడని ఈ కథ మనకు నేర్పుతోంది.
 
కామెంట్‌లు