టిక్కు టిక్కు మనుచు మ్రోగు నందమైన గడియారము
మూడుముళ్ళు కలిగియుండు ముచ్చటైన గడియారము
గడియారము లేకుండా ఘడియకూడ గడవదులే
సమయములను తెలియజేయు పొందికైన గడియారము.
02
గంటలనూ నిముషాలను సెకనులనిది తెలుపుతుంది
గడిచినట్టి కాలమింక రాదనిఇది తెలుపుతుంది
వెనుకకసలు చూడకుండ మున్ముందుకు సాగుతుంది
పసిడికన్న విలువైందని సమయమునిది తెలుపుతుంది.
03
ముంజేతికి పెట్టుకొనగ మురిపెముగా ఉంటుందిది
గోడపైన ఉంచిన గంభీరముగా ఉంటుందిది.
ఎక్కడైన ఎప్పుడైన దానివిలువ మారదులే
టేబులుపై ఉంచావా ఠీవిగాను ఉంటుందిది
04
ఎవరితోడు కోరుకొనక నడుస్తుంది ఏమియనదు
తనపాటికి తానుగానె తిరుగుతుంది ఏమియనదు!
సంకల్పముతో నడచుచు సమయమెపుడు తెల్పునంట
బయటపడక నడుచునెపుడు!సాగుతుంది ఏమియనదు!
05
నిరంతరం ఆగకుండ తిరుగుచుండు గడియారము
పక్షపాతమెరుగకుండ కదలుచుండు గడియారము
రకరకాల అకృతులను సంతరించుకున్నదోయి
ప్రతీక్షణం విలువైందని తెలుపుచుండు గడియారము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి