కర్ణ పర్వము ప్రథమాశ్వాసము: 374 వ రోజు
సుయోధనుడు శల్యుని నచ్చ చెప్పి ఒప్పించుట
మద్రదేశాధీశా ! నేను ఆ ఉద్దేశ్యంతో అన లేదు. కర్ణుడొక్కడే కాదు ఈ భూమండలంలో నీకు సాటి రాగల వారెవరు. నీవు సార్ధక నామదేయుడవు. నీ కంటే కర్ణుడెక్కువ వాడు అని నేను ఇది అడగలేదు. అర్జునుడికి ధీటుగా యుద్ధం చేయగల వాడు కర్ణుడే. కాని కృష్ణుడు మన ఎత్తులన్నీ కృష్ణుడు తన నేర్పుతో భంగపరుస్తున్నాడు. కృష్ణుడికి సమంగా ఎత్తుకు పై ఎత్తు వేయగలిగిన సమర్ధత మీకు గాక ఎవరికి ఉంది. కనుకనే మిమ్ము అడిగాను కాని కర్ణుడికంటే మిమ్ము తక్కువ చేసి అవమానించడానికి కాదు. ఈ మహత్కార్యం చేయడానికి మీరు తప్ప వేరొకరు లేరు " అన్నాడు. ఆ పొగడ్తలకు పొంగి పోయిన శల్యుడు " సుయోధనా ! నీ మనసు తెలియక కోపగించుకున్నాను. కృష్ణుడికంటే నన్ను గొప్పవాడిని అని ప్రశంసించావు నాకు అదే చాలు. నేను నువ్వు అడిగినట్లు కర్ణుడికి సారధ్యం వహిస్తాను. కాని నాదొక్క నియమం నేను ఇతడితో నాకు ఇష్టము వచ్చిన రీతిలో మాట్లాడతాను. అతడు కోపగించక తనపని తాను చేసుకు పోవాలి " అన్నాడు. కాదంటే శల్యుడు ఎక్కడ కాదంటాడో అని సుయోధనుడు అందుకు అంగీకరించాడు.
త్రిపురాసుర వధ
శల్యుడు కర్ణసారథ్యం వహించడానికి అంగీకరించిన తరుణంలో సుయోధనుడు " మద్రదేశాధీశా ! ఒక నాడు మార్కండేయ మహర్షి మా తండిగారితో చెప్తుంటే విన్నాను. దేవాసుర యుద్ధములో తారకాసురుడు మరణించాడు. అతడి ముగ్గురు కుమారులైన విద్యుమ్నాలి, తారకాక్షుడు, కమలాక్షుడు బ్రహ్మను గురించి అత్యంత నియమ నిష్టలతో తపస్సు చేసాడు. వారి తపస్సుకు బ్రహ్మదేవుడు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయి వరం కోరుకొమ్మని అడిగిన తరువాత వారు ముగ్గురూ ఒక్కసారిగా " బ్రహ్మదేవా ! సకల భూతముల వలన సర్వకాలములో చావు లేకుండా వరం ఇవ్వండి " అన్నారు. బ్రహ్మదేవుడు " ఇలాంటి కోరిక ఎవ్వరైనా కోరతారా ! మీరు కోరిన కోరిక నేను ఇవ్వ కూడదు మీరు పుచ్చుకోకూడదు. నేను ఇవ్వడానికి అనువైన కోరిక కోరండి " అన్నాడు. వారు " అలా అయితే మా ముగ్గురికీ మూడు పురములు ఇవ్వండి. అవి మా ఇచ్ఛ వచ్చిన చోటికి పయనించేలా ఉండాలి. దేవ, దానవ, యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వ, ఉరగాదుల వలన ఆ నగరములు నశింపకుండా వరం ఇవ్వండి. అప్పుడు మేము నిర్భయంగా అంతటా సంచరించగలము " అని కోరారు. అందుకు బ్రహ్మగారు " అలాగే ఇస్తాను. కాని దేనికైనా ఒక అంతం ఉండాలి. ఆ మూడు పురములు ఒక చోట చేరిన సమయాన బలవంతులెవరిచే అయినా నాశననం కాగలవు. అవి విడి విడిగా ఉన్నంతవరకూ సురక్షితంగా ఉంటాయి. ఇక మీరు మీ ఇచ్ఛ వచ్చిన రీతిన పురములు నిర్మించుకున్న అవి మీరు కోరిన విధంగా ప్రతిభావంతులు కాగలవు " అని వరము ఇచ్చి బ్రహ్మదేవుడు అంతర్ధానం అయ్యాడు. బ్రహ్మవరాన్ని పొందిన ఆముగ్గురు రాక్షసులు మయుడి వద్దకు వెళ్ళి తమ కొరకు మూడు నగరాలు నిర్మించి ఇవ్వమని అడిగారు. మయుడు తారకాక్షుడికి సువర్ణపురమును, కమలాక్షునికి రజిత పురమును, విద్యున్మాలికి ఇనుప పురమును నిర్మించి ఇచ్చాడు. స్వర్ణ పురముతో దేవలోకములోను, రజిత పురముతో ఆకాశములోను, ఇనుప పురముతో భూలోకములోను సంచరించసాగారు. ఆ ముగ్గురూ మూడు లోకాలు ఆక్రమించుకుని యదేచ్ఛగా తిరుగుతూ కోట్ల సంవత్సరాలు గడిపారు.
హరి కోరిన వరం
తారకాక్షుడికి హరి అను కుమారుడు కలిగాడు. అతడు బ్రహ్మను గురించి తపస్సు చేసాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షంగానే అతడు " త్రిపురాలలో ఎవరనా మరణిస్తే వారిని ఒక నూతిలో వేయగానే దాని నుండి చని పోయిన వాడి అంత బలంతో పది మంది జన్మించాలి. అలాంటి నూతులు మూడు పురములలో సర్వకాలమూ ఎండని జలములతో ఉండేలా అనుగ్రహించు " అని కోరాడు. ఈ విధంగా త్రిపురాలలో ప్రజలు చావులేని వారైనారు. ఒక వేళ చచ్చినా ఒకరికి పది మందిగా వృద్ధి చెందారు. వారిని చూసి దేవతలు కూడా హడలెత్త సాగారు. త్రిపురాలలో నుడి వారు దేవ, పితృ, ముని లోకాలను హింసించసాగారు. ఇంద్రుడు కూడా వారితో యుద్ధము చేసి పరాజితుడైనాడు. దేవతలు మునులు బ్రహ్మదగ్గరకు వెళ్ళి మొర పెట్టుకుని త్రిపురాధీశులను చంపే ఉపాయం చెప్పమని అడిగారు. బ్రహ్మ వారితో " వారి ముగ్గురిని ఒకే బాణంతో చంపాలి. ఆ పని ఒక్క రుద్రుడే చేయాలి. కనుక మీరు శివుడి వద్దకు వెళ్ళి ప్రార్థించండి " అన్నాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి