గోడపై గీసిన బొమ్మలు!: - - యామిజాల జగదీశ్
 ​

కొన్ని ఇళ్లల్లో గోడలపై బొమ్మలు గీసి ఉండటం చూడొచ్చు. అయితే అవేవీ అందంగా తీర్చిదిద్దిన చిత్రాలు కావు. ఒక పసిపాప చేతిలో గీతలు, తప్పుల తడకలుగా రాసిన అక్షరాలు. పెన్సిల్‌తో గీసిన ఇల్లు...వంకరగా ఉన్న సూర్యుడు...చేతులు కాళ్లు సరిగ్గా లేని మనుషుల రూపాలు. 
చూసేవాళ్లకు ఇవి కేవలం పిచ్చి గీతలలా అనిపించవచ్చు. కానీ ఆ ఇంట్లో బతికిన వాళ్లకు అవే ఒక కాలపు జ్ఞాపకాలు. 
ఒక బిడ్డ మొట్టమొదటిసారిగా పెన్సిల్ పట్టుకున్న రోజు, అమ్మ చూడని సమయంలో గోడపై చేసిన చిన్న అల్లరి, నాన్న చూసి కోప్పడినట్లు నటించిన క్షణం, ఆ తర్వాత అందరూ కలిసి నవ్వుకున్న నిమిషం... ఇలా ప్రతి గీత వెనుకా ఒక కథ ఉంటుంది.
​ఆ పసిపిల్లాడికి అప్పుడు తెలియదు, తను ఒకరోజు పెద్దవాడినో పెద్దవాడినో అయిపోతానని, ఆ ఇల్లు విడిచి వెళ్లాల్సి వస్తుందని, తన చిన్న వేళ్లతో గీసిన ఆ బొమ్మలను ఒకరోజు ఆగి చూసి కంటతడి పెట్టుకుంటానని. అప్పుడు జీవితం చాలా సులభంగా ఉండేది. ఏడ్వడానికి పెద్ద కారణాలు అక్కర్లేదు. నవ్వడానికి పెద్ద కారణాలు అక్కర్లేదు. అమ్మ ఒడి చాలు, నాన్న భుజం చాలు, ఆడుకోవడానికి చిన్న జాగా చాలు, గొడవ పడడానికి తోబుట్టువు చాలు. ఆ చిన్న ఇంటి లోపలే ఒక పూర్తి ప్రపంచం ఉండేది.
​కాలం నెమ్మదిగా కదలడం మొదలవుతుంది. గోడపై బొమ్మలు గీసిన పిల్లాడు కూడా ఎదగడం మొదలుపెడతాడు. బడి వస్తుంది, చదువు వస్తుంది, పని వస్తుంది, పెళ్లి వస్తుంది, బాధ్యతలు వస్తాయి. ఒక కాలంలో గోడపై గీతలు గీసినందుకు భయపడిన బిడ్డ, ఒకరోజు జీవితపు లెక్కలను సరిగ్గా రాసుకోవాల్సిన పెద్ద మనిషిగా మారిపోతాడు. ఆ తర్వాత ఆ ఇంటికి రావడం కూడా తగ్గవచ్చు. ప్రతి రోజూ ఉన్న గది, సెలవులకు మాత్రమే వచ్చిపోయే చోటుగా మార వచ్చు. రోజూ చూసిన అమ్మనాన్నలను ఫోన్ తెరలో చూడాల్సిన బతుకు రావచ్చు. తోబుట్టువులు ఎవరి దారిన వాళ్లు వెళ్లొచ్చు. ఒక కాలంలో అల్లరితో నిండిన ఇల్లు మెల్లగా నిశ్శబ్దంగా మారవచ్చు.
​కానీ గోడలు మాత్రం అన్నీ గుర్తుపెట్టుకుంటాయి. ఈ మూలలో పిల్లలు పరిగెత్తారు, ఫలానా చోట ఎవరో ఏడ్చారు, ఈ గదిలో పరీక్ష కోసం రాత్రంతా చదివారు, ఈ గుమ్మం వద్ద నాన్న ఎదురుచూశారు, ఈ వంటగదిలో అమ్మ అందరికీ ఇష్టమైనది వండిపెట్టింది అనే నిజాన్ని ఆ గోడలు ఎప్పటికీ మరచిపోవు.
​ఒకరోజు ఆ ఇల్లును బాగు చేయాల్సిన సమయం రావచ్చు. పాత రంగు మార్చవచ్చు. కొత్త సామాన్లు కొనవచ్చు. గోడపై ఉన్న గీతలను కూడా తుడిచివేయాల్సి రావచ్చు. అప్పుడు, ఒకప్పుడు "గోడపై ఎందుకు రాస్తున్నావు?" అని కోప్పడిన అదే అమ్మ, "దాన్ని మాత్రం ముట్టవద్దు, అలాగే ఉంచండి" అని అనవచ్చు. 
ఎందుకంటే ఇప్పుడు అది గీత కాదు.
దూరంగా బతుకుతున్న తన బిడ్డ చిన్ననాటి రూపం. 
ఒకప్పుడు గోడను పాడుచేసిన ఆ గీతలే, ఇప్పుడు ఆ ఇంట్లో ఎంతో భద్రంగా దాచుకోవాల్సిన అందమైన జ్ఞాపకాలుగా మారిపోతాయి.
​అదే కాలపు వింత. 
జరుగుతున్నప్పుడు సాధారణంగా అనిపించిన విషయాలను, దాటి పోయిన తర్వాత వెలకట్టలేనివిగా మార్చేస్తుంది. 
అమ్మ పిలిచే గొంతు, 
నాన్న పాత బండి చప్పుడు,
తోబుట్టువులతో చేసిన పోట్లాటలు, 
వానొస్తే ఇంటి లోపలకు పరిగెత్తిన రోజులు, 
ఒకే పళ్లెంలో పంచుకుని తిన్న తిండి, 
కరెంటు పోతే అందరూ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకున్న రాత్రులు... 
అప్పుడు అవీ సాధారణ రోజులు, నేడు వాటిని మళ్లీ ఒక్కసారి బతకలేమా అని తపించేలా చేసే జ్ఞాపకాలు.
​కొన్ని సంవత్సరాలు గడిచాక, ఆ బిడ్డ తన సొంత బిడ్డతో ఆ ఇంటికి రావచ్చు. 
గోడపై ఉన్న పాత బొమ్మను చూపిస్తూ, "ఇది నేను చిన్నప్పుడు గీశాను" అని నవ్వుతూ చెప్పవచ్చు. ఆ క్షణంలో రెండు కాలాలు ఒకే చోట కలుస్తాయి. 
ఒకప్పుడు చిన్నపిల్లాడిగా ఉన్న మనిషి, ఇప్పుడు ఒక చిన్నారి చేయి పట్టుకుని తన గతాన్ని తను చూసుకుంటున్నట్లు ఉంటుంది.
​అప్పుడు అర్థమవుతుంది ఇల్లు అంటే కేవలం ఇసుక సిమెంట్ మాత్రమే కాదు, మనం ఎవరమో మనకు గుర్తుచేసే ఒక చోటు అని. అక్కడ ఉన్న కొన్ని వస్తువులు పాతబడిపోవచ్చు, కొంతమంది మనుషులు దూరమవనూ వచ్చు, కొన్ని గదులు మారిపోవచ్చు, కొన్ని గోడలు కూడా కూలిపోవచ్చు. కానీ ఆ ఇంట్లో గడిపిన జీవితం మాత్రం పూర్తిగా కనుమరుగైపోదు. అది ఎక్కడో ఒకచోట నిలిచిపోతుంది.
​ఒక పాత ఫోటోలో, అమ్మ వాడే గిన్నెలో, నాన్న కూర్చునే కుర్చీలో, పాత అలమార వాసనలో, తలుపు పక్కన కొలత వేసిన పిల్లల ఎత్తులో, గోడపై ఇంకా చెరిగిపోకుండా ఉన్న ఒక చిన్న బొమ్మలో ఆ జ్ఞాపకాలు అలాగే ఉంటాయి. అందుకే, పాత ఇంటికి చాలా ఏళ్ల తర్వాత తిరిగి వెళ్లేట ప్పుడు మనం కేవలం ఒక ఇంట్లోకి అడుగుపెట్టడం లేదు; మన గతాన్ని మళ్లీ చూసేందుకు కొద్ది క్షణాలు వెనక్కి వెళ్తున్నాము. అక్కడ మనం వదిలి వచ్చిన పిల్లాడు ఇంకా పరిగెడుతున్నట్లే అనిపిస్తుంది. అమ్మ గొంతు ఇంకా వినిపిస్తున్నట్లు ఉంటుంది. నాన్న ఇంకా వాకిట్లో నిలబడి ఉన్నట్లు ఉంటుంది. మనం కోల్పోయిన కాలం ఎక్కడికీ వెళ్లకుండా ఆ గోడల మధ్యే మనకోసం ఎదురుచూస్తున్నట్లు అనిపిస్తుంది.
​ఒకరోజు ఆ బొమ్మలు కనిపించకుండాపోవచ్చు, గోడ కూలిపోవచ్చు, ఇల్లు కూడా లేకుండా పోవచ్చు. కానీ పరవాలేదు. అసలైన బొమ్మలు గోడలపై మాత్రమే గీయలేదు; అవి మనసులోని జ్ఞాపకాల్లో కూడా రూపుదిద్దుకు న్నాయి. ఆ గోడ రంగును కాలం మార్చవచ్చు, దానిపై ఉన్న గీతలను వాన ఎండ తుడిచివేయవచ్చు. కానీ, ఒకప్పుడు ఆ గోడ ముందు నిలబడి నవ్వుకున్న మనల్ని ఏ కాలమూ పూర్తిగా తుడిచివేయలేదు.
​కొన్ని బొమ్మలు గోడలపై గీస్తారు. 
కొన్ని బొమ్మలు హృదయకాన్వాస్ పై గీస్తారు.
అవి తెరమరుగయ్యే అవకాశమే ఉండదు. ఎక్కడికి వెళ్ళినా ఆ జ్ఞాపకాలు వెంటే ఉంటాయి. అదే విశేషం.
ఇది తమిళంలో చదివాను. రచయిత పేరు తెలియలేదు. ఓ తమిళమిత్రుడు నాకింటివి ఇష్టమని వాట్సప్ లో పంపాడు. నిజంగానే నాకు నచ్చాయి ఈ మాటలు. అందుకే అమాంతం దీనికి తెలుగక్షరాల రూపమిచ్చాను. మూల రచయిత ఎవరో ఆయనకు నమస్సులు.
కామెంట్‌లు