ఆమె చిత్రకళ: - - యామిజాల జగదీశ్
 









 

వేళ్లు పొడవుగా ఉన్నంత మాత్రాన కళాకారుడు అవుతారనడంలో ఎలాంటి నిజమూ లేదని తెలుసుకున్నాను. 
ఇటీవల ఓ అమ్మాయి పరిచయ మైంది. ఆ అమ్మాయి ఓ రోజు ఓ చిత్రాన్ని వాట్సప్ లో పంపింది. దానిని చూడటంతోనే బాగుందంటూ స్పందించాను. ఆ తర్వాత మరొక చిత్రం పంపింది. తల్లీబిడ్డల బంధాన్ని చెప్పే చిత్రమది. చాలా బాగుందని ప్రశంసిస్తూ బొమ్మలు గీయడాన్ని మానవద్దని చెప్పాను. ఇక్కడో విషయం చెప్పాలి...
చిన్నప్పుడెప్పుడో ఓ మాట ఆ నోటా ఈ నోటా విన్నాను. అదే మాట ఆ అమ్మాయితోనూ చెప్పాను. ఔనా అంది. అయితే నేననుకుకున్న అలనాటి మాట సరికాదని ఇప్పుడు తెలిసింది. నేనా అమ్మాయితో చెప్పిన మాట... "మీ వేళ్ళు పొడుగున్నాయి. అందుకేనేమో మీకు చిత్రకళ అబ్బింది" అని. కానీ ఆ అభిప్రాయం సరికాదట. అది అర్థం లేనిదట.
ఈ భావనకు ఎలాంటి శాస్త్రీయ నియమమో లేదా రుజువో లేదు. కళా నైపుణ్యం సాధన, శిక్షణ, కఠోర శ్రమ ద్వారానే వస్తుంది. చేతి ఆకారమో లేదా వేళ్ల పొడవుతోనో సంబంధం లేకుండా ఎవరైనా కళను సృష్టించడం నేర్చుకోవచ్చు.
బొమ్మలు గీయడం, రంగులు వేయడం నేర్చుకోవడానికి సమయం పడుతుంది.
కళ అంటే మీరు ప్రపంచాన్ని ఎలా చూస్తారు... మీ మనస్సును ఎలా ఉపయోగిస్తారు అనే దానికి సంబంధించినది. అంతేతప్ప వేళ్ళ పొడవుతో చిత్రకళకెలాంటి సంబంధమూ లేదు.
నిజానికి ఒక కళాకారుడిని తయారు చేసేది
రోజువారీ సాధన : తరచుగా బొమ్మలు గీయడం లేదా సృష్టించడం వారిలోని నైపుణ్యాన్ని పెంపొంది స్తుంది.
కాంతి, రేఖలను అధ్యయనం చేయడం మనలోని చిత్రకళ ఎదుగుదలకు సహాయపడుతుంది. పైగా సహనం ఎంతో ముఖ్యం. తప్పులు చేయడమూ నేర్చుకోవడంలో ఓ భాగమే. 
సరే విషయానికొస్తాను... నాకు పరిచయమైన అమ్మాయి వృత్తికీ, ప్రవృత్తికీ ఎలాంటి సంబంధమూ లేదు. ఆమె ఓ ఐ. టీ. కంపెనీలో పని చేస్తోంది. ఆమెకు చిత్రకళపై ఆసక్తి స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే మొదలైనట్టు మాటల్లో తెలిసింది. 
ఇంతకూ ఆ అమ్మాయి పేరు చెప్పలేదు కదూ... శ్రీచందన. ఖమ్మం పుట్టి పెరిగిన ఊరు ఖమ్మం. 
ఆమె నుంచి అందుకున్న కొన్ని చిత్రాలు...

కామెంట్‌లు