ఒక పాత ఇంట్లో ఒక వయసైన పిల్లి ఉండేది. చిన్నతనంలో అది మెరుపంత వేగంగా పరిగెత్తి ఎలుకలను పట్టుకునేది. కానీ వయసు పెరిగే కొద్దీ దాని కాళ్లు బలహీన పడ్డాయి. చూపు కూడా మసకబారిం ది. ఎలుకల వెనుక పడినా పట్టుకోలేక పోయేది. కానీ ఆకలి ఊరుకుం టుందా... ఊరుకోనివ్వదుగా...
రోజురోజుకూ ఆకలి ఎక్కువైపోతోంది. ఇక లాభం లేదనుకున్న ఆ పిల్లికి ఒకరోజు ఒక ఉపాయం తట్టింది.
ఒంటిమీద తెల్లటి బట్ట కప్పుకొని, కళ్లు మూసుకుని, ప్రశాంతంగా కూర్చుంది.
“నేను ఇక వేటాడను. ఐహిక బంధాలు వదిలేసి సన్యాసిగా మారాను. నాకు అన్ని జీవులూ ఒక్కటే. ఇక ఎవరికీ హాని చేయను!” అని చాటించింది.
ఈ వార్త ఎలుకల చెవిన పడింది.
“అబ్బో! పిల్లికి జ్ఞానోదయం అయిం దట!” అని కొన్ని చిన్న ఎలుకలు ఆశ్చర్యపోయాయి. అవన్నీ మొదటిరోజు దూరంగా నిలబడి చూశాయి.
రెండో రోజు కాస్త దగ్గరకు వచ్చాయి.
మూడోరోజు సన్యాసి పిల్లి కాళ్ల దగ్గరే కూర్చున్నాయి.
ఐతే పిల్లి కాచుకుని ఉన్నది ఇందుకోసమే.
రెప్పపాటులో కళ్లు తెరిచి, పక్కనే ఉన్న ఒక చిన్న ఎలుకను పట్టుకుని మింగేసింది.
మరుసటి రోజు మళ్లీ అదే నాటకం.
మరో ఎలుక మాయమైంది.
ఇలాగే రోజూ ఒక ఎలుక కనిపించకుండా పోతోంది.
మిగిలిన ఎలుకలు భయపడ్డాయి.
అప్పుడు ఆ గుంపులో ఉన్న ఒక ముసలి ఎలుక ప్రశాంతంగా గమనించడం మొదలుపెట్టింది.
“ఇది సన్యాసే అయితే, రోజూ మనలో ఒకరు ఎందుకు మాయమవుతున్నా రు?” అని దానికి అనుమానం వచ్చింది.
మరుసటి రోజు దూరం నుంచే పిల్లిని గమనించింది.
అప్పుడు పిల్లి కళ్లు తెరిచి, చుట్టూ ఎవరైనా ఉన్నారేమో చూసుకుని, మీసాలు నాక్కుంటూ నవ్వడం కనిపించింది.
నిజం అర్థమైపోయింది.
వెంటనే ఎలుకలను సమావేశపరిచి, "సన్యాసి బట్టలు కట్టినంత మాత్రాన సన్యాసి అయిపోరు. పిల్లి ఎప్పటికీ పిల్లే. దాని నైజం మారదు. ఇకపై ఎవరూ దాని దగ్గరకు వెళ్లకూడదు” అంది.
ఆ తర్వాత ఏ ఎలుకా పిల్లిని నమ్మ లేదు.
పిల్లి ఎన్ని రోజులు వేచి చూసినా ఒక్క ఎలుక కూడా దరిదాపులకు రాలేదు.
చివరకు దాని తంత్రం తుస్సుమంది.
దీంతో తెలుసుకోవలసిన వాస్తవికత...
బాహ్య రూపాన్ని చూసి ఒకరి స్వభావాన్ని అంచనా వేయకూడదు. సహజ నైజం అంత సులభంగా మారదు. నకిలీ వేషం కొందరిని ఏమార్చవచ్చు; కానీ నిజాన్ని ఎప్పటికీ దాచలేదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి