సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 కర్ణ పర్వము ప్రథమాశ్వాసము- 368 వ రోజు*


కురు పాండవ యోధుల సమరం*
కర్ణుడు బాణములు వేసి పాండవ సేనలోని ఏనుగులను కొడుతున్నాడు. అవి తలలు పగిలి చచ్చి కిందపడుతున్నాయి. నకులుడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు. సాత్యకి కేకయరాజులైన విందానువిందులను, భీమసేనుడు అశ్వత్థామను, చిత్రసేనుడు శ్రుతవర్మను, ప్రతివింద్యుడు చిర్తుడు అనే రాజును, సుయోధనుడిని యుధిష్టరుడు, అర్జునుడు సంశక్తులను, ధృష్టద్యుమ్నుడు కృపాచార్యుని, శిఖండి కృతవర్మను, శ్రుతకీర్తి శల్యుడిని, సహదేవుడు దుశ్శాసనుడిని ఎదుర్కొన్నారు. పోరు ఘోరమైంది.
సాత్యకి విందానువిందులు
సాత్యకి విందానువిందుల విల్లులు నరికాడు. వారిశరీరముల నిండా బాణములతో ముంచెత్తాడు. విందాను విందులు తిరిగి విల్లందుకుని సాత్యకి మీద శరప్రయోగం చేసారు. సాత్యకి ఒక పదునైన బాణంతో అనువిందుడి తల నరికాడు. తమ్ముడు చనిపోయాడన్న కోపంతో విందుడు సాత్యకి అనేక బాణములతో కొట్టాడు. సాత్యకి విందుడు ఒకరి సారథిని ఒకరు చంపుకున్నారు. ఒకరి హయములను ఒకరు చంపారు. ఒకరి రథమును ఒకరు విరిచారు. ఇరువురు రథములు దిగి కత్తి దూసి యుద్ధము చేయసాగారు. ఆ యుద్ధములో సాత్యకి పక్కకు ఒంగినట్లు ఒంగి కత్తితో విందుని తల ఒక్క వేటుతో తుంచాడు. విందాను విందులను చంపి సాత్యకి పక్కనే ఉన్న యుధామన్యుడి రథము ఎక్కాడు. త్వరలో రథము సమకూర్చుకుని కేకయ సైన్యమును తరిమాడు.
శ్రుతకర్మ చిత్రుడిని చంపుట
చిత్రసేన మహారాజు సహదేవుడి కుమారుడైన శ్రుతకర్మతో యుద్ధము చేస్తున్నాడు. చిత్రసేనుడు అయిదు వాడి అయిన బాణములతో శ్రుతకర్మను కొట్టాడు. శ్రుతకర్మ కోపించి చిత్రసేనుడిని మూర్ఛిల్లేలా కొట్టాడు. చిత్రసేనుడు తేరుకుని శ్రుతకర్మ విల్లు విరిచాడు. శ్రుతకర్మ మరొక విల్లందుకుని వాడి అయిన బాణంతో చిత్రసేనుడి తల ఎగురకొట్టాడు. తమ మహారాజు మరణించడం చూసి సైన్యం ఒక్కసారిగా విజృంభించి శ్రుతకర్మను చుట్టుముట్టాయి. శ్రుతకర్మ అమిత పరాక్రమంతో వారిని తరిమి కొట్టాడు. చిత్రుడితో యుద్ధము చేస్తున్న ప్రతి వింధ్యుడు చిత్రుడిథసారథి గుండెల్లో మూడు నారములు దించాడు. అతడి కేతనమును, వింటిని వ్రిచి, చిత్రుడు విసిరిన ఈటెను రెండు ముక్కలు చేసాడు. అందుకు కోపించిన చిత్రుడు తన గదను ప్రతి వింద్యుడి మీద విసిరాడు. ఆదెబ్బకు ప్రతివింద్యుడి రథము విరిగి సారథి మరణించాడు. ఆగ్రహించిన ప్రతి వింద్యుడు ఒక తోమరము విసిరి చిత్రుడి గుండెను చీల్చాడు. చిత్రుడు మరణించగానే కౌరవ సేనలు ప్రతివింద్యుడి మీద విరుచుకు పడ్డాయి. పాండవ సేనలు ప్రతివింద్యునకు సాయం వచ్చాయి. ప్రతివింధ్యుని ధాటికి కౌరవసేనలు పారి పోయాయి.
భీముడు, శ్రుతకీర్తిల యుద్ధము
భీముడు అశ్వత్థామతో యుద్ధము చేస్తున్నాడు. అశ్వత్థామ భీముడిని రథమును తన బాణములతో కప్పాడు. భీమసేనుడు అశ్వత్థామ పై శరవర్షం కురిపించాడు. ఇరువురు ఒకరి కేతనము ఒకరు కొట్టారు. ఒకరి సూతుని ఒకరు గాయపరిచారు. ఒకరి దేషమును ఒకరు గాయపర్చుకున్నారు. అది చూసి సూతులు వారిరువురిని అక్కడి నుండి తప్పించారు. అర్జున కుమారుడు శ్రుతకీర్తి శల్యుడిని ఎదుర్కొన్నాడు. శల్యుడు శ్రుతకీర్తి విల్లు విరిచి అతడి మీద ఏడు బాణములు నాటాడు. శ్రుతకీర్తి మరొక విల్లు తీసుకుని అరవైనాలుగు బాణములు వేసాడు. శల్యుడు తిరిగి తొంభై బాణములు వేసి తిరిగి శ్రుతకీర్తి విల్లు విరిచాడు. శ్రుతకీర్తి తనగదను తీసుకున్నాడు. శల్యుడు దానిని కూడా విరిచాడు. శల్యుడు శ్రుతకీర్తి సారథిని నరికాడు. రథాశ్వములు బెదిరి రథమును ఎటో లాక్కుని వెళ్ళాయి.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు