సత్యహరిశ్చంద్రుడు: - వరలక్ష్మి యనమండ్ర
 

" అమ్మమ్మా! ఈరోజు స్కూల్లో టీచర్ సత్యహరిశ్చంద్రుడి గురించి కొంచెం చెప్పారు. ఆయన ఎవరో, ఆ  కథ పూర్తిగా చెప్పవా!" అంటూ బడి నుండి వచ్చిన 12 ఏళ్ల మనుమడు మిట్టు అమ్మమ్మ దగ్గరికి వచ్చి అడిగాడు.
"రా బుజ్జి  కూర్చో...చెబుతాను .  సత్యహరిశ్చంద్రుడు మన భారతదేశపు గొప్ప రాజు. ఆయన ఎప్పుడూ నిజం మాట్లాడేవాడు" 
"ఎప్పుడూ అంటే... ఎప్పుడూ ఎప్పుడూనా అమ్మమ్మా?"...అడిగాడు మిట్టు.
"అవును నాన్నా! ఏ పరిస్థితులలో కూడా అబద్ధం అనేది చెప్పలేదు. ఒకసారి మహాముని విశ్వామిత్రుడు ఆయన్ని పరీక్షించాలని అనుకున్నాడు"...అమ్మమ్మ మాట పూర్తి కాకుండానే.
"ఎందుకమ్మా పరీక్షించాలి అనుకున్నాడు?" అని అడిగాడు.
" ఆయన అబద్ధం చెప్పడు అన్నది నిజమా /కాదా అని చూడాలని. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని కలలో కనిపించి నిన్నొకటి కోరుకుంటాను. ఇస్తావా? అని అడిగాడట. హరిశ్చంద్రుడు ఇస్తానన్నాడట. అప్పుడు 'నీ రాజ్యమంతా నాకు దానం చేయి'  అని కోరాడట"
" అయ్యో! అప్పుడు హరిశ్చంద్రుడు ఏం చేసాడు అమ్మమ్మా?"
"తన మాట ప్రకారం, ఆయన తన రాజ్యమంతా, రాజభోగాలన్నీ దానం చేసి, భార్య చంద్రమతి, కొడుకు రోహితాశ్వుడితో కలిసి అడవుల్లోకి వెళ్ళాడు" అన్నది అమ్మమ్మ.
" అయ్యో తప్పు కదా అమ్మమ్మా!వాళ్ళ దగ్గర డబ్బులు ఏమీ లేవా? అడవులలోకి ఎందుకు వెళ్ళారు? నాకు చాలా బాధగా ఉందమ్మా!" అన్నాడు మిట్టు.
"ఏమీ లేవు. మొత్తం ఇచ్చేసాడు.ఆ తర్వాత విశ్వామిత్రుడు దక్షిణ కూడా అడిగాడు. డబ్బులు లేక  హరిశ్చంద్రుడు తన భార్యను, కొడుకును అమ్మేశాడు. తాను ఒక శ్మశానంలో పనికి వెళ్ళాడు" అని చెప్పింది.
"అబ్బ్బా! ఎంత బాధగా ఉంటుంది! తన భార్యనీ కొడుకునీ అమ్మేశాడా?పాపం అమ్మమ్మా! "
"అవును  కానీ ! తన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం. అందుకే ఆయన్ని సత్యహరిశ్చంద్రుడు అంటారు".
"తర్వాత ఏమైంది అమ్మమ్మా?"
"ఒకరోజు కట్టెలకోసం అడివిలోకి వెళ్ళిన లోహితాశ్యుడిని పాము  కరిచింది. చంద్రమతి తన  కొడుకు చనిపోయినట్టు తెలిసి, శ్మశానానికి తీసుకుని వచ్చింది. శ్మశానంలో కావలిగా ఉన్నది హరిశ్చంద్రుడే! తన భార్య, కొడుకును గుర్తుపట్టినా, తన బాధ్యత వదలకుండా, శవాన్ని కాల్చడానికి పన్ను (ఫీజు)అడిగాడు.
"అయ్యో పాపం! తన కొడుకు చనిపోయినా కూడానా, తెలిసి కూడా నా? ఏమిటో అమ్మమ్మా! నాకు కోపం వస్తున్నది ఆయనమీద"అన్నాడు మిట్టు.
"విను మరి ఏమైందో చూడు! ఇదంతా చూస్తున్న దేవతలు చాలా సంతోషించారు. విశ్వామిత్రుడు కూడా హరిశ్చంద్రుని నిజాయతీని చూసి ఆశ్చర్యపోయాడు. అందరూ కలిసి కొడుకుకు ప్రాణం పోసి, హరిశ్చంద్రుడికి రాజ్యం , సంపద మొత్తం తిరిగి ఇచ్చారు. వాళ్ళందరూ సంతోషంగా బ్రతుకుతూ, రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు".అని చెప్పింది అమ్మమ్మ.
"నేను  ఇప్పటినుండి నిజమే చెప్తాను. ఎప్పుడూ అబద్ధం చెప్పాను. మాట ఇస్తే కూడా పాటిస్తాను అమ్మమ్మా!" అన్నాడు మిట్టు.
"అదే మంచిది నాన్నా!  సత్యమే జయిస్తుంది గుర్తుంచుకో. నిజం ఎప్పుడూ గెలుస్తుంది". అని చెప్పింది.

కామెంట్‌లు