కాలాన్నే కలంగా మలిచింది: - బి.ఉషారాణి- Govt టీచర్-మంచిర్యాల


నేలతల్లితో చెలిమి చేసేందుకు
మబ్బుల నుండి వాన చినుకులై జారగా,
ఆ స్నేహ హస్తాన్ని అందుకునేందుకు
మన్ను పరిమళాలు వెదజల్లి
ఆప్యాయంగా ఆహ్వానం పలికింది.

చినుకుల తడుపుకు పరవశించిన
ప్రకృతి కాంత హరిత వర్ణపు కోక కట్టి,
హరివిల్లు రంగులలో విరబూసిన
సుందర కుసుమాలను సిగలో తురిమి,
అందంగా అలంకరించుకుంది.

ప్రకృతి సోయగాలు గాంచి మురిసిన
మలయ మారుతం మంద్రంగా వీస్తూ,
మధుర గానాలు ఆలపించాలని
మనసులో ఉత్సాహం ఉప్పొంగగా,
రాగాల పల్లకి ఎక్కి ఊరేగుతోంది.

భువి తన అందాలలో చూపిస్తున్న
మహోదయాలను గాంచి నా కవి హృదయం,
ప్రకృతి రమణీయతను వర్ణిస్తూ,
పుంఖానుపుంఖాలుగా కవితలల్లాలని,
కాలాన్నే కలంగా మలిచింది.
కామెంట్‌లు